మన దేశంలో రాన్రాను పుణ్య పురుషు లెవరో, నరరూప రాక్షసులెవరో తెలుసు కోవటం చాలా కష్టమయిన విషయంగా మారుతోంది. ఇవాళ మహాను భావుడని మన నోటి తోనే పొగిడినవాడు రేపు నరరూపరాక్షసుడని బయట పడుతోంది. ఇవాళ ప్రజలకోసం ఎంతో పాటు పడ్డాడు అని మనం సిన్సియర్‌గా ఫీలైన తర్వాత వాడే ప్రజలందరినీ ముంచేసి, దేశాన్ని లూఠీ చేసాడని రుజువులు బయటపడుతున్నయ్. దాంతో ఎవడు దుర్మార్గుడో ఎవడు లుచ్చాయో ఎవరికీ తెలీకుండా పోతోంది. సమాజం కోసం నిజంగా పాటు పడేవాళ్ళు మరుగున పడిపోతున్నారు. మంచి సమాధి అయిపోతోంది.
ఈ గందర గోళానికి మెయిన్ కారణం ఛానలోళ్ళూ, న్యూస్ పేపరోళ్ళూనూ.
హటాత్తుగా ఒక దిక్కు మాలిన ఛానెల్ వాడు ఒక స్టోరీ రన్ చేయటం మొదలు పెడతాడు.
ప్రేక్షకులకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ రాజకీయ నాయకుడూ, నూట డెబ్బయ్ హత్యారోపణలూ, రెండు లక్షలకోట్ల ప్రజాధనం లూటీ చేసినట్లు ఎనోే్నకసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీ దుమ్ములాల్ గారికి మరోసారి బెయిల్ లభించింది. ఈవిధంగా ప్రపంచంలోనే అతి ఎక్కువ బెయిల్లు పొందిన మహానాయకుడిగా ఆయన గిన్నిస్ బుక్‌లో కెక్కారు.
మా క్రైమ్ విలేఖరి మహేష్ ఇప్పుడు ఆయన ఈ అద్బుత విజయం గురించి ఆయనతోనే మాట్లాడి ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటారు.
చెప్పండి దుమ్మూలాల్ గారూ.. ఇలా రికార్డ్ బద్దలుకొట్టి గిన్నిస్‌బుక్ లోకెక్కటం మీకెలా అనిపిస్తోంది?
సూపరుగా ఉంది. నాకు ముందే తెలుసు మన దేశంలో ఇలాంటి రికార్డ్ నేనే చేస్తానని, కాకపొతే ఇంత త్వరగా చేస్తానని అనుకోలేదు.
ఈ రికార్డ్ సాధించడానికి మీరు ఎవరెవరికి కృతజ్ఞతలు తెలియజేస్తారు?
ఒకరనేమిటి? నాకు ఎన్నో కేసుల్లో ఎన్నో శిక్షలు పడినా ఒక్కరోజు కూడా నేను జైలుకి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు నాకేదో లేని జబ్బు ఉందని దొంగ టెస్ట్ రిపోర్ట్లు చూపించి ఆదుకున్న మార్స్ ఇంటర్ నేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికీ, డబ్బు ఖర్చు చేస్తే బెయిల్ బాధ్యత మాదీ అని ఎప్పటికప్పుడు బెయిల్ మ్యానేజ్ చేస్తున్న మాటీమ్ ఆఫ్ లాయర్స్కీ, ఎప్పటి కప్పుడు నాపై ఉన్న కేసులకు సంభందించిన అఫీషియల్ రికార్డ్స్ అన్నీ అగ్ని ప్రమాదంలో తగల బెడుతూ గానీ లేదా ఫైల్స్ అన్నీ మిస్ అయిపోయాయని మాయం చేసి రుజువులు దొరక్కుండా నన్నాదుకుంటున్న బ్యురోక్రసీకీ, నామీద ఎన్ని క్రిమినల్ కేసులున్నా, ఎన్ని లక్షల కోట్లు తింటున్నా నువ్వే కావాలి అంటూ నన్ను అదేపనిగా ఎన్నుకుంటున్న నా నియోజకవర్గం ప్రజలకీ పైకి తెలీకుండా నన్ను అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికీ, మా పార్టీకీ ఇలా ఎంతోమందికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారందరి రుణం వాళ్ళు ఊహించిన దానికంటే ఎన్నోరెట్లు అధికంగా, వీలయినంత త్వరలో తీర్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను.
మరి దుమ్మూలాల్ గారి తల్లి దండ్రులేమంటున్నారు ?
వారిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు వెంగమాంబా.. వారినే అడుగుదాం. చెప్పండి అసురమ్మ గారూ మీ కొడుకు దుమ్మూలాల్ గురించి మీరేమంటారు?
నా కొడుకు శ్రీరామచంద్రుడి లాంటివాడు. ఒకేబాణం ఒకేమాట ఎవర్నైనా నరికేస్తా అని మాటిస్తే తన ప్రాణాలకు కూడా తెగించి ఇచ్చిన డేట్ లోపల నరికేసేవాడు. వాడికెంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని జ్యోతిష్యులు ఎప్పుడూ చెప్తూండే వారు.
నరకాసుర్ గారూ.. మీ అబ్బాయి దుమ్మూలాల్ గురించీ ఈ శుభసమయంలో మీరేం చెప్తారు?
వాడు కారణజన్ముడు. రాజకీయాల్లోకి రాకముందు ఒక్కపైసా కూడాలేదు. అలాంటిది ఇప్పుడు చూడండి. లక్షలకోట్ల ఆస్తి రాత్రింబగళ్ళు ఎంతో కష్టపడితేనే ఇది సాధ్యమయింది.
ఇలా రోజంతా సాగి పోతుందా చానల్ కవరేజ్.
అదే ఓ సంఘసంస్కర్త ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నోప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి జీవితమంతా గడిపినందుకు ప్రజలు అతనిని సత్కరిస్తూన్న సందర్భంలో అదే చానల్ ఇలా
మల్లేష్ అనే సంఘ సంస్కర్తకు వరంగల్‌లో ప్రజలు సన్మానం జరుపుతున్నారు. అయితే ఆయన గురించి వివరాలన్దించే ముందు తొక్కగాడు అనే యాక్షన్ చిత్రం గురించి విశేషాలు.
అరగంట సేపు ఆ సినిమా గురించి, వాళ్ళ యూనిట్ గురించీ యాంకర్ మోతెక్కిన్చేస్తుంది.
ఈ చిత్రానికి మహా దర్శకుడిగా పేరు గాంచిన బురిడీ గారు పద్దెనిమిదేళ్ళుగా ఈ చిత్రానికి కథ తయారు చేస్తున్నారు. ఎంతో రిస్క్ తీసుకుని ఎనిమిది ఐటం సాంగ్స్‌తో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ చిత్రం గురించీ ఆయన మాటల్లో..
యూనిట్ వాళ్ళందరూ ఆ సినిమా గొప్పతనం గురించి బాదేసాక మళ్ళీ సంఘ సంస్కర్త మీద కొస్తుంది కవరేజ్.
ఇప్పుడు మల్లేష్ గారు చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ఆ ఊరి పెద్ద తిరుమల గారు మాట్లాడుతారు.
ఆయన ఎప్పటినుంచో ఈ కార్యక్రమాలు నడుపుతూ ఎంతో మందికి కొత్త జీవితం ప్రసాదించారు 196లోనే ఆయన.
చాలా థాంక్స్ తిరుమలగారూ.. ఎన్నో విషయాలు వివరించారు. ఇప్పుడు ఒక ‘‘బ్రేకింగ్ న్యూస్’’ ఒక యువతిని నలుగురు యువకులు రేప్ చేసినట్లు ఇప్పుడే మాకు తెలుస్తోంది చెప్పు రాజేష్ ఆ యువతి ఎవరు?
ఆ వివరాలు ఇంకా పోలీసులు తెలియ చేయలేదు వెంగమాంబా. కానీ ఆ రేపిస్ట్స్ నలుగురూ ఇప్పుడు మన స్టూడియోలోనే ఉన్నారు. మీ పేరేంటండీ చాణక్య గారూ?
చాణక్య
మిమ్మల్ని అరెస్ట్ చేయక ముందే బెయిల్ ఎలా సంపాదించ గలిగారు? రేప్ చేసిన సమయంలో మీరెలా ఫీలయ్యారు?
ఈ రేప్ గురించి రాత్రి ఏడూ గంటల నుంచీ పది గంటల వరకూ ప్రత్యేకచర్చా కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. ఈ చర్చా కార్యక్రమంలో ఇంతకూ ముందు జరిగిన రేప్‌ల పైన ఓ విశ్లేషణ ప్రతేె్యక ఆకర్షణ అంతేకాకుండా ఇంతవరకూ వచ్చిన రేప్ సినిమాల్లోని దృశ్యాలు వాటి వల్ల యువత పెడత్రోవ పడుతోందా అనే అంశం గురించి ప్రముఖ సైకాలజిస్ట్లతో మరో ఆకర్షణ.
యర్రంశెట్టి సాయి