అనహామ్ కన్వెన్షన్ సెంటర్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. తెలుగునేల నుంచి ఎందరో అతిరథ మహారథులు ఈ సంబరాలకు విచ్చేశారు. తెలుగుజాతి వైభవాన్ని గుర్తుకుతెచ్చేలా ఈ సంబరాలు జరిగాయి. సినీ, రాజకీయ, వ్యాపార, కళా ప్రముఖలెందరో ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా హజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి అమెరికాలోని తెలుగుజాతికి దిశా నిర్థేశం చేశారు. అటు అమెరికాలో ఇటు ఇండియాలోనూ నాట్స్ చేస్తున్న సేవలను వెంకయ్యనాయుడు కొనియడారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ పై ప్రశంసల వర్షం కురపించారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువాడికి నాట్స్ నేనున్నానంటూ భరోసా ఇవ్వడాన్ని బాలకృష్ణ అభినందించారు.
నాట్స్ కు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ సంస్థల ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు కూడా అమెరికా తెలుగు సంబరాలకు విచ్చేసి తన సందేశమిచ్చారు. తెలుగు యువతలో తెలివితేటలు అపారమన్నారు. మన శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను జన్మభూమి కోసం వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నిర్వహించిన షార్క్స్ అండ్ డ్రీమర్స్ కార్యక్రమంలో జి ఎమ్ అర్ , నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తల సరికొత్త ఆలోచనలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. సరికొత్త ఆలోచనలకు తాను పెట్టుబడి పెడతానని స్పష్టం చేశారు. స్వదేశంలో కొత్త వ్యాపారాలు చేసేందుకు ముందుకొచ్చే వారికి తాను కూడా ఆర్థిక మద్దతు అందిస్తానని మరో పారిశ్రామికవేత్త విమల్ కావూరి ప్రకటించారు.
ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన సంబరాలు
సంబరాల్లో భాగంగా తెలుగు సాహితి సంబరం అద్భుతంగా జరిగింది. తెలుగునేల నుంచి ఎందరో కవులు, రచయితలను ఆహ్వనించి నాట్స్ ఈ సాహితి సంబరాన్ని నిర్వహించింది. తెలుగు ఇంగ్లీష్ కలబోసిన పద్యాలు చెప్పి సంబరాల్లో కవులు ఔరా అనిపించారు. తనికెళ్ల భరణి ఆధ్యాత్మిక సాహిత్యం.. శివతత్వం తెలుగు ప్రేమికులను కట్టిపడేసింది. ఆచార్యులు కొలకలూరి ఇనాక్ తెలుగు సాహిత్య పరిణామ క్రమంపై ప్రసంగించారు. తెలుగు సినీ రచయితల పాట.. మంతి కూడా అలరించింది. అన్నమాచార్య కీర్త్తనలను ఆలపిస్తున్న భక్తి గాయకులు పారుపల్లి రంగనాథ్, కొండవీటి జ్యోతిర్మయి తమ పాటలతో, వ్యాఖ్యానాలతో అందరిని భక్తి భావంలోకి తీసుకెళ్లారు. అమెరికాలో షిరిడీ నిర్మాణమే లక్ష్యంలో ముందుకు సాగుతున్న సాయి దత్త పీఠం సాయిపాదుక సేవను సంబరాల్లో భాగంగా నిర్వహించింది. అటు తెలంగాణ పాటతో సర్వక్క, అమ్మపాట తిరుపతన్న కూడా సంబరాల్లో జోష్ నింపారు.
అనూప్ మ్యూజిక్ మ్యాజిక్..
సంబరాల్లో చివర రోజున అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మ్యాజిక్ తెలుగువారిని ఊర్రూత లూగించింది. గుండెజారి గల్లెంతయ్యిందే అంటూ అనూప్ తన పాటలతో అందరిచేత చిందేయించారు. మనం పాటలతో మనమంతా ఒక్కటే అంటూ సందడి చేశారు. వేలమంది అనూప్ ఇచ్చిన సంగీత హోరులో సంబరాలు చేసుకున్నారు. సినీ నటుడు ఆలీ, నటి పింకీ ల స్టెప్పులను సంబరాలకు విచ్చేసిన తెలుగు వారు ఉత్సాహంగా తిలకించారు. జబర్థస్ట్ టీం సంబరాల్లో నవ్వుల పువ్వులు పూయించింది.
సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న నాట్స్
తెలుగువారికి సేవ చేయడమే లక్ష్యంగా నాట్స్ ముందుకు సాగుతుందని నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి అన్నారు. నాట్స్ సంబరాలను ఘనంగా నిర్వహించిన లాస్ ఏంజిల్స్ నాట్స్ ఛాప్టర్ ను మధు కొర్రపాటి ప్రశంసించారు. సంబరాల కన్వీనర్ రవి ఆలపాటి, కో కన్వీనర్ ప్రసాద్ పాపుదేశి, చందు నంగినేని తదితరులు సంబరాల కోసం చేసిన కృషిని నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. నాట్స్ కు విచ్చేసిన తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా వారికి బహుమతులు అందించింది. వారిని సత్కరించుకుంది. 2017లో అమెరికా తెలుగు సంబరాలను చికాగో వేదికగా జరపనున్నట్టు నాట్స్ ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ లో అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించడంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అభినందనలు తెలిపింది. ఇదే స్ఫూర్తితో నాట్స్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నాట్స్ ప్రకటించింది.
సంబరాల కమిటీ డిప్యూటి చైర్మన్ చంగు నంగినేని మాట్లాడుతూ నభూతో న భవిష్యతి అన్న చందాన జరగటానికి కారణమైన ఈ సంబరాలకు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసారు. చివరిగా ప్రసాద్ పాపుదేశి వందన సమర్పణ తో సభ ముగిసింది.