సినీ భామలు ‘బడా’ బాబులు

ఎంతవారలైన గానీ, వేదాంతులైన గానీ, ఓర చూపు సోకగానే సోలిపోతారు అన్నాడు వెనకటికి సినిమా కవి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మిలియనీర్లను కూడా చేర్చుకోవాలేమో? మన సినిమా తారలంటే, బడా బడా మిలియనీర్లకు…

ఎంతవారలైన గానీ, వేదాంతులైన గానీ, ఓర చూపు సోకగానే సోలిపోతారు అన్నాడు వెనకటికి సినిమా కవి. ఇప్పుడు ఆ లిస్ట్ లో మిలియనీర్లను కూడా చేర్చుకోవాలేమో? మన సినిమా తారలంటే, బడా బడా మిలియనీర్లకు భలే క్రేజ్. ఒక్క సినిమాలో వేసారా, రెండు సినిమాల్లో నటించారా అన్నది కాదు క్వశ్చను..స్టారా కాదా అన్నదే పాయింట్. సాధారణంగా డబ్బున్న మారాజులు ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యత ఇస్తారు, అటాచ్ మెంట్ లకు కాదు అన్నది ఓ వాదన. కానీ మన సినిమా తారల-బడా బిలియనీర్ల ప్రేమ వివాహాలు చూస్తే, ఆ వాదన సరికాదేమో అన్న డవుట్ టక్కున వచ్చేస్తుంది. 

అన్నీ అయిపోయాకే..

మన సినిమా తారలు..తమ గ్లామర్ తో ఓ వెలుగు వెలుగుతారు. హీరోయిన్ గా టాప్ రేంజ్ కు వెళ్లిపోతారు. ఇంక సరుకు, సత్తా అయిపోయింది..ఫేడవుట్ అవుతున్నారు అని అనిపిస్తుండగా, వన్ ఫైన్ మార్నింగ్, షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఫలానా బిజినెస్ మెన్ తో పెళ్లి..అని. సరే ఎవరి పెళ్లి వారిష్టం అనేయచ్చు. కానీ సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్లు..శ్రీశ్రీయే అన్నాడు..పబ్లిక్ లో నిల్చుంటే ఏమైనా అంటాం అని. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఈ మహా మహా మిలియనీర్లు కింద నుంచి కష్టపడి పైకి వస్తారు. తమ తెలివితేటలు అన్నీ వాడి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తారు. ఎవరిని ఎక్కడ వుంచాలో, ఎక్కడ వాడాలో తెలుసుకుని, వ్యాపారాన్ని తెలివిగా విజయవంతం చేసుకుంటారు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి సినిమా స్టార్లకు టక్కున పడిపోతారు. 

కానీ సినిమా తారలు అలా కాదు. గ్లామర్ ఫేడవుట్ కానంతకాలం, సినిమాలు చేతినిండా వున్నంత కాలం, తమ వెంట పడిన వారిని తిప్పుతూనే వుంటారు. పెళ్లి అనే మాటే ఎత్తరు..నాకా..పెళ్లా..అప్పుడేనా అని సంతూర్ యాడ్ టైపు కబుర్లు చెబుతారు. కొత్త హీరోయిన్లు వస్తున్నారు, మన సీజన్ ముగిసింది అనగానే, చుట్టూ తిరుగుతున్న వాడిని టక్కున లాగి, మెడలో ముడేయించేసుకుంటారు. 

నిన్న-నేడు

నిన్నటి తరం హీరోయిన్లు, నేటి తరం హీరోయిన్లు ఉత్తర దక్షిణాలు అని చెప్పుకోవచ్చు. నిన్నటి తరం హీరోయిన్లు చాలా మంది తమ పెళ్లిళ్ల కారణంగా సర్వం కోల్పోయిన వారే. అమాయకంగా రెండు, మూడో పెళ్లి వాడి చేతిలో పడి, తాను ఇన్నాళ్లు సంపాదించింది అంతా వాళ్ల చేతిలో పోసి, తాము కుదేలైపోయిన వారే ఎక్కువ. సావిత్రి సంగతి తెలిసిందేగా. కానీ ఈ తరం హీరోయిన్లు వేరు. వారి తెలివి తేటలు వేరు. తమ పైసా అలా వుంచుకుని, తిరిగి ఎదురు పెట్టుబడి పెట్టగల బడా పెట్టుబడిదారులనే బుట్టలో వేసుకుంటారు. పెళ్లి చేసుకుని, తమంత బుద్ధిమంతులు ప్రపంచంలోనే లేరనిపించుకుంటారు. 

క్రేజ్ తెస్తున్న కిక్కు

సినిమా తారలంటే చాలా బడా బడా పారిశ్రామిక వేత్తలకు మహా క్రేజ్. ఆ క్రేజ్ తోనే ఎక్కడో పార్టీల్లో పరిచయం చేసుకుంటారు. అక్కడి నుంచి మాట మాటా..ఆపై చెట్టా పట్టా..చివరికి చిక్కితే పెళ్లి. ఏ నయా హీరొయిన్ అయినా కూడా సాదా సీదా మగాడ్ని పెళ్లి చేసుకున్న వైనం చాలా అరుదు. లీస్ట్ లో లీస్ట్ అంటే వాడు సినిమా డైరక్టర్ లేదా, నటుడు అయి వుండాలి. ఆ పైకి వెళ్తే నిర్మాత కావచ్చు. ఇంక సినిమా రంగం బయటకు చూస్తే మాత్రం కచ్చితంగా కోటీశ్వరుడై వుండాల్సిందే. ఒకటో రెండో వ్యాపారాలు వుండాల్సిందే. తమ క్రేజ్ ను వాడుకుని తారలు తమ జీవితాన్ని చాలా తెలివిగా సెటిల్ చేసుకుంటున్నారు. అది వారి స్పెషాలిటీ. కానీ వ్యాపారంలో చూపించిన తెలివి తేటలు, నిజ జీవితంలో చూపించలేక, తారల మెళ్లో ముళ్లు వేస్తున్నారు బిజినెస్ మెన్ లు. 

అంటే తారలను పెళ్లి చేసుకోవడం తప్పా? వారు మహిళలు కాదా? ఈ విధమైన ఉమెన్ లిబ్ ఆర్గ్యుమెంట్ లు వినరావచ్చు. కానీ ఇక్కడ విషయం అది కాదు. అదే తారలు, కామన్ మాన్ ను ఎక్కడా ప్రేమించి పెళ్లి చేసుకున్న దాఖలాలు కానరావేమి? అని? ఎక్కడో శివరంజని లాంటి సినిమాల్లో తప్పు. అంటే ఈ పెళ్లిళ్ల వెనుక తెలివితేటలు, బతుకు తెరువు లేవని ఎందుకు అనుకోవాలి?

మేల్ ఇగో ఏమవుతుందో?

సాధారణంగా భర్త అనేసరికి ఓ తరహా మేల్ ఇగో వస్తుంది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, మనం మహా బ్రాడ్ మైండ్ అని భుజాలు చరుచుకున్నా, పెళ్లాం పక్క వాడితో చనువుగా వుంటే సహించే గుణం నూటికి తొంభై తొమ్మిది మగాళ్లకు వుండదు. అది కామన్. కానీ ఈ తారలు-మల్టీ మిలియనీర్ల పెళ్లిళ్లలో అది మాత్రం ఎక్కడికి ఎగిరిపోతున్నట్లో? ఎందుకంటే సినిమా తారలు అందరూ చెడ్డవారు కాదు, చెడిపోయిన వారు కాదు. అయితే వారి వారి ప్రొఫెషన్ లో కొంతయినా చనువు, సాన్నిహిత్యం కొందరితోనైనా ఏర్పడతాయి. మామూలు జనాలకు కూడా ఇది మామూలే. అయితే సెలబ్రిటీలకు వున్న లింక్ లు, ఫ్రెండ్ షిప్ లు ఇట్టే ప్రచారం అయిపోతాయి. పైగా విడియోలు, ఫొటోలు అంటూ తెగ చక్కర్లు కొడతాయి. ఇవన్నీ చూసి కూడా పెళ్లి చేసుకోవడం అంటే నిజంగా బ్రాడ్ మైండ్ అనుకోవాలేమో? ఐశ్యర్యను అభిషేక్ చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు అన్నీ లోక విదితమే. ఇలా అన్నీ తెలిసి చేసుకుంటున్నారంటే వాళ్లు చాలా గొప్పవాళ్ల కిందే లెక్క. 

అందరూ బడా బాడాలే

టీనా మునిమ్..అనిల్ అంబానీని పెళ్లి చేసుకుంది. అప్పటికే అనిల్ వేల కోట్ల ఆస్తిపరుడు. నటి మాధవి బడా విదేశీయుడ్ని పెళ్లి చేసుకుని అక్కడే పేద్ద కోటలో సెటిల్ అయిపోయింది. జెనీలియా ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కొడుకునే కట్టేసుకుంది. రాణిముఖర్జీ..బాంబే డయింగ్ వారసుడిని వెంట తిప్పుకుంది. విద్యాబాలన్ భర్త కూడా పారిశ్రామిక వేత్తనే. దక్షిణాన రంభ తదితరులు కూడా పెళ్లాడింది పారిశ్రామిక వేత్తలనే. ఇటీవల ఆగిపోయింది కానీ, త్రిష పెళ్లి చేసుకోవాల్సింది కూడా బాగా డబ్బు చేసిన ఆసామీనే. అతగాడు నిర్మాత కూడా. ఆ మధ్య టబు ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినవచ్చాయి. ప్రియమణి, ఎమీజాక్సన్ చెరో పారిశ్రామిక వేత్తలను కొంగుకు కట్టేసుకుని, తిప్పుకుంటున్నారని వార్తలు వినవచ్చాయి. యమున అయితే బెంగుళూరులో ఓ సాఫ్ట్ వేర్ పారిశ్రామిక వేత్తతో పబ్లిక్ గా దొరికి పోయింది. 

శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా సంగతి తెలిసిందేగా. కరిష్మా కపూర్ ఢిల్లీకి చెందిన సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. అతగాడు బడా పారిశ్రామిక వేత్తనే. రవీనా టాండన్ బడా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థండానీని రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆసిన్ ఏకంగా మైక్రోమాక్స్ అధినేతనే పెళ్లి చేసుకుంటోంది. ప్రపంచ మొబైల్ కంపెనీలకు దీటుగా భారతీయ కంపెనీని తయారుచేసిన వాడు అతను. మరి ఆసిన్ లో ఏం చూసి పడిపోయాడో? సమంత కూడా ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో వుందని వార్తలు వున్నాయి. అంతకు ముందు హీరో సిద్దార్ధతో పెళ్లి వరకు వచ్చి, ఆగిపోయింది వ్యవహారం. 

సరైన సెటిల్ మెంట్ కోసమే?

సినిమా ఫీల్డ్ లో వున్నపుడు చేతిలో కాసులు గలగల లాడుతుంటాయి. పైగా చాలా వరకు అన్నీ ఫ్రీగా సమకూరతాయి. విమానం టిక్కెట్లు, తిండి ఖర్చులు, వసతి ఖర్చులు, మేకఫ్ ఇలా ఒకటేమిటి అన్నీ ఫ్రీ ఫ్రీనే. వచ్చిన డబ్బులు దాచుకోవడమే. సినిమాలు అయిపోయాక, స్వంత డబ్బులు తీయాలన్నా కష్టమే. ఆర్జనా కష్టమే. అందుకే వీటిని భరించేవారు కావాలి. అంటే సరైన వాడు భర్తగారావాలి. తెల్ల ఏనుగును, సినిమా స్టార్లను సామాన్యులు భరించగలరా? అందుకే బడా పారిశ్రామిక వేత్తలకు తమ అందంతో, చొరవతో గాలం వేయాల్సిందే. పడిన వారు గిలగిల లాడాల్సిందే. ఇంతకు ముందు కథలైనా, నిన్నటి త్రిష అయినా, నేటి ఆసిన్ అయినా అందరిదీ ఇదే తీరు. 

రివర్స్ లూ వున్నాయి

తెలివిగా పారిశ్రామిక వేత్తలను కట్టేసుకునే తారలే కాదు..వీళ్లకి రివర్స్ అనిపించే వ్యవహారాలు కూడా వున్నాయి. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ రెండో పెళ్లి వాడినే చేసుకున్నారు. శ్రీకాంత్ నహతా మొదటి భార్యతో జయప్రద ఇద్దరం కలిసి పంచుకుందామన్న ఒప్పందానికి వచ్చింది. మహిమా చౌదరి ఇద్దరు పిల్లలున్న ఓ ఆర్కిటెక్ట్ ను పెళ్లి చేసుకుంది. లారాదత్తా కూడా అంతే. మహేష్ భూపతికి రెండో భార్యగా వెళ్లింది. షబనా ఆజ్మీ, సంగీతా బిజలానీ, స్మితాపాటిల్, హేమమాలిని కూడా రెండో పెళ్లివాడినే చేసుకున్నారు. మన దగ్గర అమల, విజయనిర్మల,  కూడా అంతే. వీళ్లకు రివర్స్ అన్నట్లుగా నటి రాధిక ఇప్పటి మూడు పెళ్లిళ్లు చేసుకుని, మూడో మగడైన శరత్ కుమార్ తో సెటిల్ అయింది. 

ఆకర్షణ అలాంటిది

అమ్మాయిలో ఆకర్షణ అలాంటిది అనుకోవాలి. లేదంటే వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటూ, వారిని తమ కనుచూపుతూ శాసించుకుంటూ, వ్యాపారాలు నడిపే బడా పారిశ్రామిక వేత్తలు, ఒక్క అమ్మాయి ఓర చూపుకు అలా ఫ్లాటైపోయి, ఆఖరికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటే ఏమనుకోవాలి? డైరక్టర్ చెప్పినట్లు పాత్రల్లో నటించి నటించి, నవరసాలు నేర్చుసుకుని, వాటిని ప్రయోగిస్తే, ఎంత బిలియనీర్ అయితే మాత్రం మగాడేగా..టక్కున పడిపోయి, గింగిరాలు తిరక్క ఏమవుతాడు. 

ఆర్వీ