ప్రతిసారీ పద్మ పురస్కారాల్లో సినీ ప్రముఖుల పేర్లు గట్టిగానే విన్పిస్తాయి. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ కూడా కాస్తంత గట్టిగానే పోటీ పడుతూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి పద్క పురస్కారాన్ని దక్కించుకోలేకపోయారు. బాలీవుడ్ నటీనటుల్ని కూడా ఈసారి పద్మ పురస్కారాలకి పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. తెలుగు సినీ సంగీతాభిమానులకు సుపరిచితుడైన ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్ 'పద్మ' పురస్కారాల లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం గమనార్హం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది కేంద్రం ఆయనకు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడి మరీ పలువురు ప్రముఖుల పేర్లను కేంద్రానికి 'పద్మ పురస్కారాల' కోసం పంపినా, వాటిల్లో చాలావరకు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందికి మాత్రమే 'పద్మ' పురస్కారాల్లో అవకాశం దక్కింది. వీటిల్లోనూ ఏపీకి దక్కిన ప్రాధాన్యం చాలా చాలా తక్కువ. కేవలం ఇద్దరే ఏపీ నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మాత్రం ఆరుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 'వనజీవి' రామయ్య, చింతకంది మల్లేశం, చంద్రకాంత్ పిత్వా, డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్, వి.కోటేశ్వరమ్మ, త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రొఫెసర్ యెక్కా యాదగిరిరావు తదితరులు పద్మ పురస్కారాల్ని గెల్చుకున్నవారిలో వున్నారు.
మొత్తమ్మీద, ఈసారి పద్మ పురస్కారాల్లో తెలుగు సినీ పరిశ్రమకు అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యకరమే. దాంతోపాటుగా, ఆంధ్రప్రదేశ్‌కి పద్మ పురస్కారాల్లో పెద్దగా చోటు లేకపోవడం కూడా అందర్నీ విస్మయానికి గురిచేసింది.
గత కొన్నాళ్లుగా పద్మ పురస్కారాలపై 'కొనుక్కుంటున్నారు' అనే విమర్శలు ఎక్కువైపోయాయి. సినీ, వ్యాపార రంగాలకు చెందినవారూ పద్మ పురస్కారాల్ని దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయానికి వచ్చేశారు. ఆ ట్రెండ్‌కి ఇప్పుడు కేంద్రం ముగింపు పలికిందనే అనుకోవాలి. అయితే, రాజకీయ ప్రముఖుల్లో శరద్ పవార్, మురళీమనోహర్ జోషీలను పద్మ పురస్కారాలకు ఎంపిక చేయడంతో షరామామూలుగానే వివాదాలు తెరపైకొస్తున్నాయి.