ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తెలిసిన దారుల్లో పాలనను సాగించుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో విమర్శలు వచ్చినా, పంచుడు కార్యక్రమాలు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నా, జగన్ తన దారిలో వెనక్కు తగ్గడం లేదు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాది లోపే కరోనా కాటు మొదలైంది. రెండో ఏడాది పూర్తిగా ఆంక్షల మధ్యనే సాగింది. పరిస్థితులు ఇప్పుడప్పుడే సర్దుకుంటాయో లేదో తెలియని పరిస్థితి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని మేలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన, జీతభత్యాలు తగ్గిపోయిన స్థితిలో ఉన్న అనేక మందికి ఈ పథకాలు ఎంతో లబ్ధిని చేకూరుస్తున్నాయి.
పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలు కూడా ఇప్పుడు ప్రజల చేతికి ఉచితంగా నైనా డబ్బులు ఇవ్వాలని, వారు వాటిని ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఎకనమిస్టులు కూడా భారతదేశానికి ఇవే సలహాలు ఇస్తున్నారు. వారి సలహాలతో ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నెలకొక సంక్షేమ పథకంతో ప్రజల ఖాతాల్లోకి డైరెక్టుగా డబ్బులు వేస్తోంది.
మరి ఈ సంక్షేమ పథకాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయా? లేక అనవిగాని రీతి సంక్షేమ పథకాలు మొదటికే మోసం తెస్తాయా? అనేది ముందు ముందు స్పష్టత వచ్చే అంశం. వచ్చే ఎన్నికలతో కానీ.. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకదు. వాటికి ఎలాగూ ఇంకా చాలా సమయం ఉండనే ఉంది.
ఇక ఇదే సమయంలో.. ఏపీలో ప్రతిపక్ష పార్టీల పనేలా ఉంది? అనే ప్రశ్నను వేస్తే మాత్రం, ఒక ఆశ్చర్యకరమైన సమాధానమే వినాల్సి వస్తుంది. రెండేళ్లు గడిచిపోయినా తెలుగుదేశం పార్టీ ఇంకా గోదాలోకి దిగలేదు! ఆ పార్టీ ప్రజల మధ్యన తన ఉనికిని కోల్పోయేంత పరిస్థితి వచ్చిందప్పుడు. అయితే.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం చాలా బిజీగా కనిపిస్తుంటారు. అనునిత్యం జూమ్ మీటింగులతో బిజీగా ఉండే ఆయన, మరో రకంగా కూడా బిజీగా ఉన్నట్టున్నారు.
అదే.. కుట్రలూ, కుతంత్రాలను పన్నడంలో! సూటిగా చెప్పదగిన అంశం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు ప్రజా పోరాటాలను వదిలి వేశారు. అసలుకు ఆయన చరిత్రలోనే ఎప్పుడూ అలాంటి పోరాటాలను చేసిన నేపథ్యం లేదనుకోండి. వెన్నుపోటుతో అధికారాన్ని సంపాదించుకున్న చంద్రబాబు నాయుడుకు ఆ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాత్రమే తెలుసు అనే స్పష్టత ఇప్పుడు పూర్తిగా వస్తోంది.
ఎంతసేపూ చంద్రబాబు నాయుడు వీటినే నమ్ముకున్నారు. దాదాపు వృద్ధాప్యంలో చంద్రబాబు నాయుడుకు చాలా పెద్ద బాధ్యతలు పడ్డాయి. ఒకవైపు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి, మరోవైపు తన తనయుడిని తన వారసుడిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి. తనయుడిని బాధ్యతను ఏ తండ్రి అయినా.. ఏ యాభై యేళ్ల వయసు వరకో, లేదా అరవై ఏళ్ల వయసు వరకో భరించగలడు.
ఆ తర్వాత ఆ తండ్రి బాధ్యతనే తనయుడు తీసుకోవాలి. కానీ.. చంద్రబాబుకు 70 దాటేసినా.. ఇప్పుడు ఆయన తన తనయుడి బాధ్యతలను కూడా మోస్తున్నారు. ఇప్పుడు ఏరు దాటడానికి తనకు అలవాటైన వక్రమార్గాలను, వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలనే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నారు. గతంలో వీలైనన్ని సార్లు చంద్రబాబు కుట్రలకు కాలం కలిసొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు వేస్తున్న పాచికలు తిరగబడుతున్నాయి. కుట్రలన్నీ ఇట్టే బయటపడుతున్నాయి. చంద్రబాబు ఔట్ డేటెడ్ వ్యూహాలు, కుట్రలు అబాసుపాలవుతున్నాయి. అడ్డం తిరుగుతున్నాయి.
ఒకటని కాదు.. అన్నీ అవే!
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ల పై జెరుసలేం యాత్రకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీకి సంబంధించిన యాడ్ వ్యవహారంతో మొదలుపెడితే.. అన్నీ అడ్డగోలు వ్యూహాలే కనిపిస్తాయి. ఆ టికెట్లు ప్రచురించింది చంద్రబాబు హయాంలో, ఆ టికెట్ల వ్యవహారాన్ని జగన్ – క్రిస్టియానిటీ అనే ప్రచారానికి అంటగట్టింది తెలుగుదేశం పార్టీ.
పథకం చంద్రబాబుది, ప్రచారం చంద్రబాబుది.. అయితే ఆ వ్యవహారంలో కూడా జగన్ మత మార్పిడిలకు పాల్పడుతున్నాడనే ప్రచారాన్ని పొందాలని టీడీపీ వ్యూహం రచించింది. చివరకు ఆ ప్రచారం గుట్టు బయటపడటంతో కిక్కురమనలేకపోయారు. అక్కడ నుంచి మొదలుపెడితే.. గత రెండేళ్లలో అన్నీ ఇలాంటి అడ్డగోలు, అర్థంలేని వ్యూహాలను, కుట్రలను-కుతంత్రాలను నమ్ముకుని వస్తోంది తెలుగుదేశం పార్టీ.
వీటిని అడ్డం పెట్టుకుని స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగుతున్నారు. ఆయనే నోటికొచ్చింది చెబుతున్నారు. అంతిమంగా ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు. దీంతో ఈ కుట్రలకూ, కుతంత్రాలకూ కాలం చెల్లిపోయిందని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సింది. కానీ, ఆయనకు మరో తరహా రాజకీయాలు తెలియవు కదా, దీంతో వాటినే నమ్ముకుని వస్తున్నారు.
ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని ముద్ర వేయాలి, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజమనిపించాలి.. ఇవే చంద్రబాబు నాయుడు నమ్ముకున్న రాజకీయ సిద్ధాంతాలు. ఈ విషయాల్లో హిట్లర్ అనుంగు అనుచరుడు జోసెఫ్ గొబెల్స్ కు మించిన వ్యూహకర్త చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని అంతా ఒప్పుకుని తీరాలి ఆయన రాజకీయ చరిత్రను గమనిస్తే.
చంద్రబాబు అనుకుంటే తిమ్మిని బమ్మిని చేసే ప్రచారాన్ని ఇట్టే చేయగలరు. ఎన్టీఆర్ వంటి ప్రజా నాయకుడినే పదవీభ్రష్టుడిని చేసిన చంద్రబాబుకు మిగతా వారెవరైనా దూది పింజల కిందే లెక్క. అయితే చంద్రబాబు నాయుడు వెనక నుంచి మాత్రమే పొడవగలరు. కాబట్టి.. ప్రత్యర్థులను అంత తేలికగా ఓడించలేరు. సొంత మామ కాబట్టి, తనను నమ్మాడు కాబట్టి ఎన్టీఆర్ ను దించేయడం చంద్రబాబుకు తేలికైంది.
ఇక మీడియా ఇంత విస్తృతంగా లేని సమయంలో, ఆ రెండు పత్రికలే రాజ్యం ఏలుతున్న సమయంలో అంతా తన వల్లనే అనిపించుకోగలిగారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ను దించేసినా, మరేం చేసినా.. చంద్రబాబును ఒక స్టేట్స్ మన్ గా చూపించగలిగాయి ఆ రెండు పత్రికలూ. ఒక చంద్రబాబు, మరో రెండు పత్రికలు కలిసి యేళ్లకు యేళ్లు ఏలేయడం అంత ఈజీ కాలేదు. చివరకు ప్రజలు మేల్కొన్నారు. చంద్రబాబు ప్రొపగండా గల్లంతయ్యింది.
తెలుగుదేశం పార్టీ 2004లోనే తీవ్రమైన తిరస్కరణ పొందింది. వరసగా రెండోసారి కూడా భంగపాటు తప్పలేదు. అయితే వైఎస్ మరణం, మారిన రాజకీయ సమీకరణాలు.. చంద్రబాబు నాయుడు తన కుతంత్రాలకు పదును పెట్టడం, వాళ్ల కాళ్లూ, వీళ్ల గడ్డాలు పట్టుకోవడంతో.. 2014 నాటికి ఐదున్నర లక్షల ఓట్ల అదనపు ఓట్లతో మళ్లీ చంద్రబాబుకు అధికారం దక్కింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు తీరులో మార్పు లేదు.
తనకు అధికారం తెచ్చి పెట్టిన వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకున్నట్టుగా ముందుకు సాగారు, సాగుతున్నారు. ఈ ప్రయాణంలో 2019లో ప్రజలు మరోసారి షాక్ ను ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి చరిత్రలో ఎరగని ఓటమిని మిగిల్చారు. స్వయంగా చంద్రబాబు తనయుడిని కూడా ఓడించారు. మరి ఆ తర్వాత అయినా.. టీడీపీ తీరులో మార్పు ఏమైనా కనిపిస్తోందా? అంటే అలాంటి అవకాశమే లేదన్నట్టుగా ఆ పార్టీ ప్రస్థానం సాగుతోంది.
ఊసులో లేని ప్రజా పోరాటాలు!
సాధారణంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? పెరుగుతున్న ధరల గురించి పోరాడుతుంది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో తప్పొప్పులను ప్రజల మధ్యకు తీసుకు వస్తుంది. అదీ కాదంటే.. అధికారంలో ఉన్న వారు అవినీతి చర్యలకు పాల్పడితే వాటినీ ప్రస్తావిస్తుంది. ఒకటని కాదు.. ప్రతిపక్షమే అనుకోవాలి కానీ, ప్రభుత్వాన్ని స్తంభింపజేయగలదు. అది ప్రజల మధ్య నుంచి జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తన బాధ్యతను నెరవేర్చినట్టు!
మరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీరును గమనిస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయడం అటుంచి, ఒక రాజకీయ పార్టీగా కూడా తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది! అటు కరోనా పరిస్థితులు, ఇటు చంద్రబాబుకు వయసు మీద పడటం, లోకేష్ కు జనాకర్షణ అథమ స్థాయిలో ఉండటం.. చంద్రబాబు నాయకత్వం మీదే తెలుగుదేశం పార్టీలో ఒక విశ్వాసం లేకపోవడం.. ఈ పరిణామాలతో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షం అంటే నచ్చని ఓటు బ్యాంకు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఓటర్లకు బాసటగా నిలిచే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు టీడీపీ లేదు! అనేక నియోజకవర్గాలకు ఇన్ చార్జిలు లేరు, కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు పచ్చ జెండా పట్టే వాడు లేడు. క్యాడర్ కు పూర్తిగా కాన్ఫిడెన్స్ పోయింది.
ఇక తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారాన్ని అందుకుంటుందన నమ్మకం ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది. తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఉంది టీడీపీనే నమ్ముకున్న క్యాడర్. ఇదీ ఎన్నికలైన రెండేళ్ల తర్వాత టీడీపీ పరిస్థితి. అటు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ఇటు పార్టీ క్యాడర్ విశ్వాసాన్నీ కోల్పోయిన స్థితిలో ఉంది చంద్రబాబు నాయకత్వం.
ఏం చేస్తున్నారంటే.. కుట్రలు!
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి, తమ వారి అవినీతి- అక్రమాలపై విచారణలు జరగకూడదు, పాత స్కామ్ లలో అరెస్టులు జరగకూడదు, తన హయాంలో అడ్డగోలుగా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం పాస్ చేసేయాలి… ఇవీ చంద్రబాబు నాయుడు బాహాటంగా చేస్తున్న డిమాండ్లు! రెండేళ్లలో చంద్రబాబు నాయుడు పోరాడినది, పోరాడుతున్నది వీటి గురించే! లేదంటే మతం అంశాన్ని రెచ్చగొట్టడం.
లేని పోని కలహాలను సృష్టించే ప్రయత్నం చేయడం.. ఇదే వరస! అయితే చంద్రబాబు నాయుడు తన, తన సామాజికవర్గ ఆర్థిక ప్రయోజనాలున్న అంశాల గురించి రోడ్ల మీదకు వచ్చారు. జోలె పట్టారు. మిగతా ప్రాంతాల వాళ్లంతా మంచి వాళ్లు, రాజధానిని అమరావతికి వదిలిపెట్టాలన్నారు. రాష్ట్రమంతా పన్నులు కట్టి అమరావతిని డెవలప్ చేయాలన్నారు.
చివరకు ఆ ఎత్తులేవీ ఫలించకపోవడంతో.. గుంటూరోళ్లకు సిగ్గుందా? విజయవాడోళ్లకు ఎగ్గుందా? అని స్థానిక ఎన్నికల సమయంలో ప్రశ్నించారు. ఆ రెండు నగరాల వాళ్లూ తమ సిగ్గు, పౌరుషాలు ఏమిటో చూపించే సరికి చంద్రబాబుకు షాక్ తగిలింది. అమరావతి సెంటిమెంట్ అణువంతైన లేదు, కనీసం ఆ రెండు జిల్లాకూ కూడా అనే స్పష్టతను ప్రజలే ఇచ్చారు.
అయినా చంద్రబాబు ఆటలైతే ఆగడం లేదు! అమరావతి భూ కుంభకోణం గురించి విచారణ జరగకూడదంటూ కోర్టులో పిటిషన్లు వేయించారు. ఈ తరహా స్టేలు చంద్రబాబుకు కొత్త కాదనే విషయం తెలుగు ప్రజానీకానికి తెలియనిది కాదు,. మరో స్టే, మరోసారి సేఫ్. అవతలి వారి గురించి చంద్రబాబు చేసే ఆరోపణలకు వాళ్లు విచారణలు ఎదుర్కొనాలి, సచ్ఛీలతను నిరూపించుకోవాలి, సీబీఐ ఎంక్వైరీలకు తలొగ్గాలి.. ఈ నీతులు, డిమాండ్లు రొటీనే.
అయితే తమ హయాం వ్యవహారాల్లో వేటి మీది విచారణలు ఉండకూడదు. ఇదీ చంద్రబాబు నాయుడు బోధించే తత్వం. ఈ తీరుతో ఆయన వ్యక్తిగతంగా కేసులను ఎదుర్కొనకపోవచ్చు, ఏవైనా కేసులు వస్తే స్టేలు తెచ్చుకోవచ్చు, తన జీవితంలో జైలు మొహం చూడకపోవచ్చు. అయితే.. ఒక నాయకుడిగా మాత్రం అడుగడుగునా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కుట్రలు, కుతంత్రాలు తప్ప చంద్రబాబుకు మరేం తెలియవు అనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఏర్పడుతూ ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడే పెంచి పోషించుకుంటున్నారు.
ఎన్నో పాత్రలు వస్తుంటాయ్, పోతుంటాయ్!
చంద్రబాబు ఆడే కుటిలమైన ఆటలో ఎన్నో పాత్రలు ప్రాణం పోసుకు వస్తుంటాయి, అనూహ్యంగా అవి తమ ఆటను ముగించుకుని కూడా వెళ్తుంటాయి. ఇందులో సొంత పార్టీ, పక్క పార్టీ, వేరే పార్టీ అంటూ తేడాలుండవు. అనేక సందర్భాల్లో అనేక పాత్రలు తెరపైకి వస్తుంటాయి. చంద్రబాబు ఆడమన్నట్టుగా ఆడి వెళ్తుంటాయి. ఒక శంకర్రావు, ఇంకో మోత్కుపల్లి తో మొదలుపెడితే.. ఎన్నో పాత్రలు, మరెన్నో ఆటలో అరటిపండ్లు.
ఎవరో వస్తారు.. చంద్రబాబు అజెండాను చదివి వెళతారు. ఆ తర్వాత ఆ నాటకంలోకి చంద్రబాబు నాయుడు ఎంటరవుతారు. గోబెల్స్ ప్రచారం సాగుతుంది. అంతిమంగా ప్రయోజనం దక్కితే ఓకే, దక్కకపోతే.. మరో పాత్ర, మరో నాటకం! ఈ కుట్రకుతంత్రాల్లో బాగు పడినోడు ఎవ్వరూ ఉండరు ఒక్క చంద్రబాబు తప్ప. అయినా ఈ ఆటకు ఆయనకు ఎప్పుడూ పావులు లభిస్తూనే ఉంటాయి.
చంద్రబాబు కుట్రల పరంపరలో ఒక దానికి గురించి సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్.. చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయో మరోసారి చాటుతూ ఉంది. జగన్ పార్టీ తరఫున నెగ్గిన ఒక ఎంపీ- నారా లోకేష్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్.. చంద్రబాబు వ్యూహాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ తరానికి కూడా చంద్రబాబు కుటిల రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనే స్పష్టతను ఇస్తోంది.
గతంలో ఇలాంటి బయటపడేవి కావు. అలాంటివి బయటపడని సమయంలో చంద్రబాబు ఆట సాగేది. అలాంటి ఆటలు బయటపడకపోవడం వల్లనే 2014లో చంద్రబాబు తన బోనస్ పిరియడ్ అధికారాన్ని పొందారు. అయితే ఎంతసేపూ ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలనే నమ్ముకుని చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవిత చరమాంకంలో భంగపడుతున్నారు. ఆయన సిలబస్ పూర్తిగా తెలుగు ప్రజలకు తెలిసిపోవడంతో, కుట్రలు కుంటుబడుతున్నాయి. చంద్రబాబు ఆట కట్టు అవుతోంది. అయినా ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదు, రాకపోవచ్చు కూడా!
చంద్రబాబు చూపిన దారిలో!
విశేషం ఏమిటంటే.. చంద్రబాబును బాగా అభిమానించే పవన్ కల్యాణ్ కూడా అదే దారిలో నడుస్తూ ఉండటం. చంద్రబాబు మాటలు మారిస్తే, కుట్రలు పన్ని అడ్డంగా దొరికితే ఆయనను కవర్ చేయడానికి ఆయనకు సొంత మీడియా ఉంది. అయితే పవన్ కల్యాణ్ పలు రకాలుగా మాట్లాడి, థర్డ్ గ్రేడ్ కుట్రలు పన్ని అడ్డంగా దొరికిపోతుంటారు పాపం! ఈ విషయంలో తన అభిమాన నాయకుడిని అనుకరించే ప్రయత్నం చేసినా పవన్ కల్యాణ్ విజయవంతంగా బయటపడుతున్నాడు.
వెనుకటికి ఒక రచయిత తన బుక్ లో రాసుకొచ్చారు.. ఏమనంటే, నక్క తెలివి, పిల్లి గడ్డం ఉన్న వాళ్లంతా చంద్రబాబు కాలేరని! బహుశా పవన్ కల్యాణ్ అది తెలుసుకోవాలి. చంద్రబాబులా పార్టీల ఫ్రెండ్షిప్ లను మార్చేయడం, కమ్యూనిస్టులతో అయినా, కాషాయవాదులతో అయినా అవసరానికి అంటకాగడం, కాంగ్రెస్ తో అయినా బీజేపీతో అయినా చేతులు కలపడం, ముస్లింలా వేషమేస్తే అరబ్బుల డ్రస్ వేసుకోవడం, క్రిస్మస్ పండగొస్తే.. క్రిస్మస్ తాత వేషయేడం.. దేన్ని చూసినా అతిగా చేసి, మళ్లీ అవసరానికి అడ్డగోలుగా మాట మార్చడం.. ఇవన్నీ చంద్రబాబుకు తప్ప మరొకరికి సాధ్యం కావు.
కుట్రలు, కుతంత్రాలే ఊపిరిగా, విలువలు అనే వాటిని మాట మటుకైనా పాటించకుండా, తెగించినోడికి తెడ్డే లింగంలా ముందుకు సాగడం ఒక్క చంద్రబాబుకు తప్ప మరొకరికి సాధ్యం కాదని పవన్ కల్యాణ్ గ్రహించగలగాలి. చంద్రబాబు మార్కు వ్యూహాలకూ, చంద్రబాబు కుట్రలకూ కాలాతీతం అయ్యిందని ఆయన పార్ట్ నర్ గా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి. అంతే కానీ.. చంద్రబాబు ఆ రూట్లో వెళ్లి 14 యేళ్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. తను కూడా కావొచ్చని పవన్ కల్యాణ్ అనుకుంటే, ఆయన జీవితంలో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోవచ్చు.
ముందు ముందు కూడా అవే ఉంటాయ్!
చంద్రబాబు తనయుడు ఆయనకు తగిన రూట్లోనే వెళ్తున్నారు. అయితే చంద్రబాబు కెరీర్ బిగినింగ్ లోనే ఆయన అసలు రూపాన్ని చూపడానికి మీడియా లేకపోయింది. అయితే లోకేష్ కెరీర్ మొదటి నుంచి అపస్వరంలోనే సాగుతోంది. ఆ అపస్వరానికి తోడు చంద్రబాబు మార్కు వ్యూహాలు! ఇక లోకేష్ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు.
ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా.. అన్నట్టుగా ఉంది వీళ్ల కథ. అయితే లోకేష్ వాట్సాప్ చాట్ హిస్టరీలోని ఒక విండో బయటపడితేనే అది చాలా కంపు కొడుతోంది. దీన్ని అర్థం అవుతున్నది ఏమిటంటే, ఒళ్లు కదల్చకుండా, ప్రజల తరఫున పోరాడకుండా.. కేవలం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తో, కుటిల కుతంత్రాలతో మళ్లీ అధికారాన్ని సంపాదించుకోవడం లేదా, ప్రభుత్వానికి అడ్డుపుల్లలు వేస్తూ ఉండటాన్నే తెలుగుదేశం నమ్ముకుంది.
రాబోయే రోజుల్లో కూడా టీడీపీ పాలిటిక్స్ ఇదే తరహాలో ఉండబోతున్నాయని మాత్రం స్పష్టం అవుతోంది. కాలం చెల్లిన ఈ వ్యూహాలతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏపీలో కూడా కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు.