సంబంధం ఉన్నవి, లేనివి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ముడిపెట్టి తండ్రీకొడుకులు నారా చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ నిత్యం విమర్శిస్తుంటారు. కానీ ఏలూరు కార్పొరేషన్లో ఘోర ఓటమిపై మాత్రం బాబు, లోకేశ్ మాత్రమే కాదు… టీడీపీ నేతలెవరూ నోరు తెరవడం లేదు. ఇదేదో ఎన్నికలతోనూ, ఓటమితోనూ తమకెలాంటి సంబంధం లేదన్నట్టు ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి నగర పీఠాన్ని దక్కించుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ కేవలం మూడు డివిజన్లతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ గురించి ఏమీ మాట్లాడుకోకపోవడమే మంచిది.
కోస్తా ప్రాంతంలో ప్రధానమైన ఏలూరు కార్పొరేషన్లో కేవలం మూడు డివిజన్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ల వద్ద సమాధానం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసమస్యలను విడిచి పెట్టి, ఇతరేతర అంశాల్ని ప్రధానంగా చేపట్టి టీడీపీ అభాసుపాలవుతోంది. దీనికి నిలువెత్తు ఉదాహరణ … రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్లో టీడీపీ చేసిన కుట్రలే.
రఘురామకృష్ణంరాజుది పార్టీ అంతర్గత సమస్యగా టీడీపీ విడిచి పెట్టి ఉంటే గౌరవంగా ఉండేది. కానీ అనవసరంగా తలదూర్చి… చివరికిగా సీఐడీ దర్యాప్తులో జగన్ బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకోవడం, ఇతరత్రా సహాయ సహకారాలు అందించిన విషయం వెలుగు చూసింది.
ఇలాంటి చర్యలన్నీ టీడీపీ పరపతిని మరింత తగ్గిస్తాయో తప్ప, రాజకీయంగా ఉపయోగపడవు. చివరికి తాము గెలవాల్సింది ప్రజాకోర్టులోనే తప్ప, ఇతరత్రా రాజ్యాంగ వ్యవస్థల్లో కాదనే సత్యాన్ని ఇప్పటికైనా టీడీపీ గ్రహించి మసలుకుంటే మంచిది.