సంచలన క్రికెటర్ అతను. ప్రపంచ క్రికెట్‌కి పాఠాలు చెప్పిన క్రికెటర్ అతను. టెస్ట్, వన్డే క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు ఆయన సొంతం. పరిచయం అక్కర్లేని ఆయన పేరు సచిన్ టెండూల్కర్. అయినా అభిమానులకు అతను ‘చిన్నోడే’. క్రికెట్ చిన్నోడు.. అంటే సచిన్ టెండూల్కర్ పేరే గుర్తుకొస్తుంది చాలామందికి. ఆ చిన్నోడికి చాలా పెద్ద మనసు వుంది. ఆ పెద్దమనసుతోనే ఓ కుగ్రామాన్ని దత్తత తీసుకున్నాడు.
నెల్లూరు జిల్లాలోని పిఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టనున్నాడు. ఇందుకోసం నవంబర్ 16న పీఆర్ కండ్రిగకు వెళ్ళనున్నాడు సచిన్. ఒకరోజు ముందే కృష్ణపట్నం పోర్టు వద్దకు చేరుకుని, అక్కడే రాత్రికి బస చేసి, పొద్దున్నే.. అంటే నవంబర్ 16న పీఆర్ కండ్రిగ గ్రామానికి వెళతాడు.
మామూలుగా దత్తత తీసుకోవడం అంటే అదో పబ్లిసిటీ స్టంట్. ఇదివరకు చాలామంది రాజకీయ నాయకులు ఇలాంటివి చేశారు. ఎవరూ ఏ గ్రామాన్నీ ఉద్ధరించిన దాఖలాల్లేవన్న విమర్శలు అనేకం. సచిన్ రాజ్యసభ సభ్యుడే అయినా, అంతకన్నా మిన్నగా అతనిలోని క్రికెటర్‌ని చూస్తారు.. తమ అభిమాన హీరోని చూస్తారు అతని అభిమానులు. అందుకే, పొలిటీషియన్స్‌లా కాకుండా, సచిన్ తమ గ్రామాన్ని బాగు చేస్తాడని విశ్వసిస్తున్నారు పీఆర్ కండ్రిగ గ్రామస్తులు.
క్రికెట్ చిన్నోడి పెద్ద మనసు.. నిజమే అయితే రానున్న రోజుల్లో పీఆర్ కండ్రిగ ఆదర్శ గ్రామంగా మారిపోతుంది. లేదూ పబ్లిసిటీ స్టంట్.. అని సచిన్ లైట్ తీసుకుంటే.. చిన్నోడిది పెద్ద మనసు కాదు, చిన్నమనసే అనే మద్రపడిపోతుంది. దత్తత తీసుకోవడం అంటే సాదా సీదా వ్యవహారం కాదు. ఈ విషయం సచిన్‌కి తెలియకుండా వుంటుందా.? రాజకీయ నాయకులందు తాను వేరని సచిన్, తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తాడని ఆశిద్దాం.