రివ్యూ: కరెంట్ తీగ
రేటింగ్: 3/5
బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
తారాగణం: మంచు మనోజ్, జగపతిబాబు, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోని, పృధ్వీ, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సుప్రీత్, తనికెళ్ళ భరణి, పవిత్ర తదితరులు
మాటలు: కిషోర్ తిరుమల
సంగీతం: అచ్చు
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్ (శివ)
ఛాయాగ్రహణం: ముత్యాల సతీష్
నిర్మాత: విష్ణు మంచు
కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2014
మంచు మనోజ్ హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కరెంట్ తీగ’ కథాకమామీషు..
కథేంటి?
పార్వతీపురం అనే ఊరి పెద్ద అయిన శివరామరాజు (జగపతిబాబు) తన ముగ్గురు కూతుళ్లకీ తాను కుదిర్చిన సంబంధాలే చేస్తానని, తన కూతుళ్లలో ఎవరైనా ప్రేమలో పడితే రెండు చెవులు కోసుకుంటానని శపథం చేస్తాడు. శివరామరాజు మూడో కూతురు కవిత (రకుల్) అదే ఊరిలో జులాయిగా తిరిగే రాజు (మనోజ్) ప్రేమలో పడుతుంది. తన శపథం నెరవేర్చుకోవడానికి దేనికైనా తెగించే శివరామరాజుని కాదని ఈ ప్రేమ జంట తమ ప్రేమని ఎలా విజయవంతం చేసుకుంటుంది?
కళాకారుల పనితీరు:
మంచు మనోజ్ ఇందులోని రాజు పాత్రకి అతికినట్టు సరిపోయాడు. పల్లెటూరి జులాయి పాత్రకి తగ్గ వేషధారణ, వస్త్రధారణతో పాటు తనదైన శైలిలో పండిరచిన వినోదం ఈ చిత్రానికి ప్లస్ అయింది. స్క్రిప్ట్ చాలా సాదా సీదాగా ఉన్నా కానీ మనోజ్ కరెంట్ తీగని షోల్డర్ చేసాడు. యాక్షన్ సీన్స్‌లో బాగా రాణించాడు. సెంటిమెంట్ సీన్లలోను మంచి పర్‌ఫార్మెన్స్‌తో నటుడిగా బాగా స్కోర్ చేసాడు.
జగపతిబాబు పాత్రని సరిగా డెవలప్ చేయలేదు. ఇది సీరియస్ క్యారెక్టరా లేక కామెడీ క్యారెక్టరా అనే కన్‌ఫ్యూజన్ అడుగడుగునా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌ని కరెక్ట్‌గా రాసుకుని.. మనోజ్‌కి, జగపతిబాబుకి మధ్య రక్తి కట్టించే సన్నివేశాలు పెట్టినట్టయితే ద్వితీయార్థంలో చాలా హెల్ప్ అయి ఉండేది. అవకాశం ఉన్నా కానీ జగపతిబాబుని వాడుకోలేకపోయారు.
రకుల్ ప్రీత్ సింగ్ స్కూల్ పిల్ల గెటప్‌లో అంత బాలేదు కానీ సెకండాఫ్‌లో పరికిణీలు, చీరల్లో ఆకట్టుకుంటుంది. సన్నీ లియోని నటన గురించి మాట్లాడుకోనవసరం లేదు. తాను చేసిన ఒకే ఒక్క పాటలో తనకి బాగా తెలిసింది మాత్రం ఒళ్లు దాచుకోకుండా చేసింది. ‘లౌక్యం’లో బాయిలింగ్ స్టార్ బబ్లూగా అదరగొట్టిన పృధ్వీ ఇందులో కూడా ఒక నవ్వించే క్యారెక్టర్ చేసాడు. సెకండ్ హాఫ్‌లో పృధ్వీ కామెడీ మంచి రిలీఫ్. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ధనరాజ్ వినోదానికి దోహదపడ్డారు. తనికెళ్ళ భరణి, పవిత్ర పెద్ద తరహా పాత్రల్లో తమ ముద్ర చాటుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
కామెడీ సీన్స్‌లో డైలాగ్స్ బాగున్నాయి. అచ్చు సంగీతం అదనపు ఆకర్షణ. ‘పదహారేళ్లయినా..’ మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ. నేపథ్య సంగీతం కూడా మంచి స్టాండర్డ్స్‌లో ఉంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఫైట్స్ అన్నీ పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ గిమ్మిక్స్ లేకుండా ప్లెజెంట్‌గా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో గ్రీనరీ బాగా క్యాప్చర్ చేసారు. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో బాగుంది కానీ సెకండ్ హాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉంది. ఒక పది నిముషాల నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. విష్ణు మంచు ఈ చిత్రానికి అవసరమైన ఖర్చు పెట్టాడు. స్టార్ కాస్ట్ విషయంలో అసలు రాజీ పడలేదు.
ఇంతకుముందు పలు డీసెంట్ మూవీస్ తీసిన హిస్టరీ ఉన్న జి. నాగేశ్వరరెడ్డికి కామెడీ బాగా తీస్తాడనే పేరుంది. ఈ చిత్రంలో కూడా కామెడీ సీన్స్ చాలా బాగా తీసాడు. తమిళ సినిమాని మనకి తగ్గట్టుగా మార్చి మాస్ ఆడియన్స్ అభిరుచికి తగ్గ వినోదాన్ని పండిరచాడు. కథలో విషయం లేకపోయినా కానీ ప్రథమార్థం సాఫీగా సాగిపోతుంది. కానీ ద్వితీయార్థంలో మాత్రం ఆ బలహీనత కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్నంత ఎంటర్‌టైన్‌మెంట్ సెకండాఫ్‌లో లేకపోవడం కరెంట్ తీగ పవర్ తగ్గిస్తుంది. అయినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలున్న మసాలా సినిమాగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దగలిగారు.
హైలైట్స్:
- మ్యూజిక్
- మంచు మనోజ్
- ఎంటర్‌టైన్‌మెంట్
డ్రాబ్యాక్స్:
- ద్వితీయార్థంలో వినోదం తగ్గింది
- జగపతిబాబు క్యారెక్టర్‌ని సరిగా డెవలప్ చేయలేదు
విశ్లేషణ:
రూరల్ ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా వారినే టార్గెట్‌గా పెట్టుకుని చేసినట్టు ఉన్న ‘కరెంట్ తీగ’ ఆ ఎటెంప్ట్‌లో చాలా వరకు సక్సెస్ అయింది. ప్రథమార్థంలో వినోదం బాగా పండిరది. సన్నీ లియోనితో సన్నివేశాలు, మనోజ్`ఫ్రెండ్స్ గ్యాంగ్.. మనోజ్`రకుల్ మధ్య సీన్స్ సరదాగా సాగుతాయి. వినోదంతో పాటు రొమాన్స్, యాక్షన్ కూడా సమానంగా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు ఇది రైట్ మిక్స్‌లో ఉండడంతో కరెంట్ తీగ ఇంటర్వెల్ వరకు ఎంటర్‌టైన్ చేస్తుంది.
సెకండ్ హాఫ్‌లో మాత్రం అదే రీతిన వినోదాన్ని పండిరచడంలో విఫలమయ్యారు. జగపతిబాబు తనని ద్వేషిస్తున్నాడని తెలిసినపుడు అతడిని ఇంప్రెస్ చేసే పని ఏదీ మనోజ్ చేయడు. జులాయిలా తిరుగుతూనే తనకి ప్రేమించే హక్కు ఉందని, పెద్ద మనసులో అర్థం చేసుకోవాలని అడుగుతుంటాడు. అతనికి జగపతిబాబు కానీ, తన తండ్రి క్యారెక్టర్ చేసిన తనికెళ్ళ భరణి కానీ కర్తవ్యం బోధించరు. తనలోని లోపాల్ని ఎత్తి చూపించరు. చివరకు కూడా హీరో పాత్ర అలాగే బాధ్యత లేకుండా ఉండిపోతుందే తప్ప పనికొచ్చే పనేదీ చేస్తున్నట్టు కనిపించదు. అయినప్పటికీ హీరోని అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు. ఆవుని కాపాడాడని హీరోయిన్ తల్లి, తన కూతురిని తిరిగి తీసుకొచ్చేసాడని జగపతిబాబు అతడికి ఓకే చెప్పేస్తారు. ఈ పార్ట్‌లో జాగ్రత్త తీసుకుని, వినోదాత్మకంగానే హీరోపై అందరికీ మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చూపించినట్టయితే బాగుండేది.
అయితే ఈ చిత్రంతో టార్గెట్ చేసిన ఆడియన్స్‌లో ఎక్కువ మంది ఇలాంటి లాజిక్కులేమీ ఆలోచించరు. తమకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయా లేదా అని చూసుకుని కాలక్షేపమైపోయిందని సరిపెట్టుకుంటారు. క్లాస్ కామెడీని ఇష్టపడే అర్బన్ ఆడియన్స్‌కి కరెంట్ తీగ పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ ఇలాంటి రూరల్ కామెడీస్ అప్పీల్ అయ్యే ఆడియన్స్ మాత్రం శాటిస్‌ఫై అయిపోతారు. వారికి ఏ రేంజ్‌లో నచ్చుతుంది అనేదానిపై కరెంట్ తీగ బాక్సాఫీస్ పర్‌ఫార్మెన్స్ ఆధారపడుతుంది.
బోటమ్ లైన్: టైమ్ పాస్ రూరల్ కామెడీ!
-గణేష్ రావూరి