పక్కదేశంలో రూపొంది, పక్కదేశం టీవీ చానళ్లలో ప్రసారం అయ్యే సీరియల్స్ ను చూసినందుకు ఎనిమిది మంది ప్రజలకు మరణ శిక్ష విధించింది ఉత్తరకొరియన్ నియంతృత్వ ప్రభుత్వం. ఈ దేశాన్ని ఏలుతున్న నియంత కిమ్ జాంగ్ ఉన్ పక్కదేశం ప్రభావం తమ దేశంపై పడకుండా ఉండటానికి ఇటువంటి “జాగ్రత్తలు'' తీసుకొంటున్నాడు. దక్షిణ కొరియాలో రూపొందిన టీవీ సీరియళ్లను చూస్తూ ఉత్తరకొరియాలోని ఎనిమిది మంది ప్రజలు పట్టుబడ్డారు. దేశంలో విదేశీ టీవీ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉన్నా.. వీళ్లు దాన్ని ఖాతరు చేయక ఆ సీరియళ్లను చూశారు. విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకొంది.
ఏకంగా పదివేల మంది ప్రజలను పిలిపించి స్టేడియంలో కూర్చొబెట్టి వారందరి మధ్య నా వీరిని కాల్చి చంపించారు. తద్వారా అందరికీ కచ్చితమైన హెచ్చరిక జారీ చేశారు. పక్కదేశాల సీరియళ్లు చూస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో… తెలియజెప్పారు!
ప్రభుత్వం అంత స్ట్రిక్ట్ గా విదేశీ సీరియళ్లను నిషేధించడానికి కారణం ఏమిటి? అంటే… ఇలా సీరియళ్లు చూసే జనాలు ఎక్కడ తన నియంతృత్వంపై పోరాటం మొదలు పెడతారో.. అనేది కిమ్ భయం. అందుకే వినోదం కోసం రూపొందినవే అయినా… విదేశీ సీరియళ్లను చూడటానికి అక్కడ వీలు లేదు. నిషేధం విధించారు. అయినా కూడా స్మగ్లింగ్ రూపంలో అప్పుడప్పుడు అక్కడక్కడ సౌత్ కొరియా నుంచి వచ్చిన డీవీడీలు దొరుకుతున్నాయి. వాటిని ఎవరైనా చూస్తూ పట్టుబడితే.. ఇదీ పరిస్థితి!
తాజాగా ఎనిమిది మందిని కాల్చి చపండంతో… విదేశీ సీరియళ్లు, ఇతర వినోద కార్యక్రమాలను చూసి శిక్షకు గురైన వారి సంఖ్య 50కి చేరింది. వీరిలోచాలా మందికి మరణశిక్షలు పడగా… కొంతమంది జైళ్లలో ఉన్నారు! మొత్తానికి దేశంపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి.. దానికి కించిత్ ప్రమాదంకూడా రాకుండా ఉండటానికి … కిమ్ జాంగ్ చాలా జాగ్రత్తలే తీసుకొంటున్నాడు. ఇది వరకూ కూడా కిమ్ జాంగ్ చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. కుట్ర చేస్తున్నాడనే భయంతోనే.. సొంత మేనమామను వేట కుక్కలను వదిలి చంపించిన వ్యక్తి కిమ్. అయినా ఇప్పటికీ అలాంటి నియంతృత్వం కొనసాగుతుందంటే.. అది అక్కడి ప్రజల చేతగాని తనమో.. కిమ్ లాంటి చక్రవర్తి క్రూరత్వ ప్రభావమో!