ఇప్పుడు నడుస్తున్నది థ్రిల్లర్ల సీజన్. అది హర్రర్ థ్రిల్లర్ కావచ్చు..కామెడీ థ్రిల్లర్ కావచ్చు..ఫాంటసీ థ్రిల్లర్ కావచ్చు. కానీ జనాలు ఆదరిస్తున్నారు. ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, దృశ్యం, స్వామరారా, కార్తికేయ..అన్నీ ఇదే తరహా. అందుకే తెలుగు హీరోలు అటు చూస్తున్నారు. మొన్నటికి మొన్న విష్ణు అనుక్షణం చేసాడు. మరోసారి దేవాకట్టాతో కలిసి తమిళ రీమేక్ ఓకె అన్నాడు. అది కూడా ప్రేయసి కనిపించకుండా పోతే జరిగే ఇన్వెస్టిగేషన్.
ఇప్పుడు నాగ చైతన్య కూడా ఓ తమిళ రీమేక్ కు ఓకె అన్నాడట. సిగరం తోడు అనే థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు. వివిధ బ్యాంకుల సొమ్మును ఎటిఎమ్ ల ద్వారా దొంగిలించే కథ తో తయారైన సినిమా ఇది.
అలాగే వెంకీ కూడా మాంచి యంగ్ డైరక్టర్ తో కలిసి ఏదైనా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చేయాలని చూస్తున్నాడట. మలయాళంలో మోహన్ లాల్ ఇలాంటి సినిమాలు చాలా చేసారు. నాగార్జున ఒప్పుకున్న కళ్యాణ్ అనే కొత్త దర్శకుడి సినిమా కూడా ఫాంటసీ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇలా మొత్తం మీద హీరోల చూపంతా ఇటు పడింది.