ఇండియన్ సినిమాల కన్నిటికీ పాటలు ప్రాణం. వెస్టర్న్ సినిమాలలో అయితే మ్యూజికల్స్ ఉంటాయి, లేదా పాటల్లేని మామూలు సినిమాలుంటాయి. కానీ ఏ సబ్జక్ట్‌కి సంబంధించినా, మన సినిమాలలో పాటలు తప్పనిసరి. పాటల సాహిత్యం, సంగీతంతో బాటు చిత్రీకరణకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. పాటలు బాగా చిత్రీకరించ గలిగే దర్శకుడిని ప్రత్యేకంగా పేర్కొనడం మన ఆనవాయితీ.
బాపు, రమణల సినిమాలలో పాటలకు ఓ ప్రత్యేకస్థానం ఉంది, వాటి చిత్రీకరణకు కూడా. చిత్రకారుడైన బాపు తొలిసారిగా మెగాఫోన్ చేపట్టినప్పుడు ఎంచుకున్నది పాట చిత్రీకరణే! 'సాక్షి'లోని 'అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా' పాట పిక్చరైజేషన్ తో బాపు చలనచిత్రరంగ ఆరంగేట్రం జరిగింది. రికార్డుటైములో (ఆ రికార్డును బాపు కూడా మళ్లీ బ్రేక్ చేయలేదు) ఆ ఆరు నిమిషాల పాటను మూడుగంటల్లో ఎలా పిక్చరైజ్ చేయగలిగారని అడిగితే 'ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్' అని నవ్వేశారు బాపు.
బాపు తీసిన పాటలు ఎందుకంత బాగుంటాయో క్లూ ఇవ్వడం జరుగుతోంది. ఆయన ప్రతీ ఫ్రేమునూ ముందే ఆర్టిస్ట్ ఎక్స్‌ప్రెషన్‌తో సహా బొమ్మ వేసి పెట్టుకుంటారు. దాన్నే తెరకెక్కిస్తారు. ప్రపంచంలో ఇలా చేశేవారు – రష్యన్ డైరక్టరు ఐసెన్‌స్టీన్, బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రాయ్, బాపు, ఈ ముగ్గురే అట!
ఉదాహరణకి 'మిస్టర్ పెళ్లాం'లోని మొదటిపాట పద్యం తీసుకోండి. దాన్ని బాపు మనసులో ఎలా రూపొందించుకున్నారో ఆయన గీసుకున్న బొమ్మలు చూడండి.
ముఖ్యంగా 5 వ ఫ్రేములో నారాయణుడు ఓరకంట చూడడం, 8 వ ఫ్రేములో చిరాకు, 12 వ ఫ్రేములో చిరాకు చూపు, 19 వ ఫ్రేములో కంగారు, 18 వ ఫ్రేములో లక్ష్మి తెల్లబోవడం, 21 వ ఫ్రేములో చేతులు కట్టుకుని నిలబడడం, నారదుడు 31 వ ఫ్రేములో నారదుడి ఆనందం – ఇవన్నీ తెరపై ఎలా అనువదింపడ్డాయో తెరపై చూడవచ్చు.
ఈ విధమైన పద్ధతుల వల్ల నటీనటులు, టెక్నీషియన్లు దర్శకుని భావాన్ని సులభంగా గ్రహించగలరనీ, అందుకనే బాపు తీసిన పాటలు అంత బాగుంటాయని మనం అనుకుంటాం కానీ బాపుగారు ఒప్పుకోరు. 'తక్కిన దర్శకులు మాత్రం చక్కగా తీయడం లేదా, ఏదో నాకు బొమ్మలు వచ్చు కాబట్టి అలా వేసి చూసుకుంటున్నాను. వాళ్లు ఇటువంటివి ఏవీ అక్కర్లేకుండానే తీసి చూపిస్తున్నారు.'' అంటారు. దటీజ్ బాపు!
ఎమ్బీయస్ ప్రసాద్