బాపు, రమణలకు పిల్లలంటే మహా ప్రేమ. బుడుగును సృష్టించటమే కాదు, వారి సినిమాలన్నిటిలోను పిల్లలకు ప్రముఖపాత్ర నిచ్చారు. ''బాలరాజు కథ'' (1970), ''స్నేహం'' (1977) అచ్చగా పిల్లల సినిమాలే. వారి సినిమాలలో పిల్లలు 'అతి'కి పోకపోవడం వలన మనకు అత్యంత ఆప్తులవుతారు. 1992లో బాలల అకాడెమీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపుకు 'బాలబంధు' బిరుదు ప్రదానం చేసింది.
బాపురమణలు రూపొందించిన వీడియో పాఠాలు తెలుగుపిల్లలకు వరదానమనే చెప్పాలి. బోధనా పద్ధతులకు దృశ్య, కావ్య విధానం అనువైనదని తెలిసిన ఎన్.టి.రామారావుగారు 5 వ క్లాసు వరకు పాఠాలు రూపొందించే బాధ్యతను బాపు, రమణలకు అప్పగించారు. ఆ ప్రతిపాదన రాగానే సినిమాలు పక్కన పెట్టేసి, పారితోషికం కూడా అడగకుండా వీళ్లు పని మొదలుపెట్టారు. రామారావుగారే నచ్చచెప్పి పారితోషికం యిప్పించారు.
3 వ తరగతి వరకు పాఠాలు తయారయ్యేక ప్రభుత్వం మారడం, పథకాన్ని అటకెక్కించడం జరిగింది. సంక్లిష్టమైన గణిత సూత్రాలను సైతం దృశ్యరూపంలో బాపు, రమణలు ఎలా విశదీకరించారో చూసినవారు ఆ నేర్పుకు ముగ్ధులయిపోతారు. ఆ పాఠాల రూపకల్పనకు 1987లో బాపు, రమణలను రాష్ట్రప్రభుత్వం సన్మానించింది. ఆ వీడియో పాఠాలలో కొన్ని దృశ్యాలను రేఖల్లో చూడండి.
అక్షరాలన్నిటిలో పిల్లలు, వాళ్లకు ఆత్మీయులైన పిల్లి, మేక యిత్యాదులే పాత్రధారులు చూడండి. 'ఆ'లో దీర్ఘం చూపడానికి మేక నోటితో పట్టుకు లాగడం, 'ఎ'లో ఎక్కడం, ఝంకారం చూపడానికి 'ఝ' కీటకం కావడం, 6 ని తిరగేస్తే 9 అవుతుందని చూపడానికి పిల్లవాడు తలకిందులుగా చూడడం – యివన్నీ ఆ యా అక్షరాల స్వభావం పిల్లల మనసుల్లో నాటుకునేట్లు చేసేవే!
'ఱ'ను 'బండీ ర' అంటారని తెలిసినవారికి 'ఱ' బొమ్మ అర్థం తెలుస్తుంది.
చదువు ప్రాధాన్యత చెప్పడానికి వేసిన బొమ్మ చూడండి. చదువుకున్నవాడికి అంబారీ, ..కోనివాడికి చాకిరీ. చదువుకోవడానికి వేళాపాళా అక్కరలేదు.
తల్లి పాలు పితికే టప్పుడూ పక్కన కూర్చుని చదువుకోవచ్చు.
తండ్రితో పాటు పొలానికి వెళ్లి అక్కడా చదువుకోవచ్చు.
పిల్లలు ముగ్గులు వేసే టప్పుడు అక్షరాల తో ముగ్గు వేసి పనిలో పనిగా చదివేసుకోవచ్చు.
అలాగే. తొక్కుడు బిళ్ల ఆడుకుంటూ కూడా కూడికలూ, తీసివేతలూ నేర్చుకోవచ్చు.
తమ కాన్వెంటు పిల్లలకు వేసవి సెలవులలో తెలుగు అక్షరాలు నేర్పించాలంటే ప్రభుత్వం అలసత్వం వలన వీడియో పాఠాల సిడిలు దొరకటం లేదని వాపోయే తలిదండ్రులు బాపు బొమ్మలు వేసిన 'అందాల అఆలు' (మాస్కో ప్రచురణ) పిల్లల కివ్వండి. అక్షరాలలో తమలాటి పిల్లల బొమ్మలు చూసి, మురిసి మీరు చెప్పకుండానే మీ పిల్లలు వెంటనే అక్షరాలు దిద్దడం మొదలుపెడతారు.
ఎమ్బీయస్ ప్రసాద్