పుస్లకాల కవరు పేజీలు డిజైన్ బాపు ఒక నూతన పంథాను ఆవిష్కరించారు. కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. పుస్తకమంతా పూర్తిగా చదివి, దానిలో ప్రధాన సన్నివేశాన్నో, ప్రధాన రసాన్నో కొన్నిగీతలలోనే వ్యక్తం చేయగల దిట్ట బాపు. బాపు పఠనాసక్తి, చదివినది ఆకళింపు చేసుకునే శక్తి ఆయనకెంతో ఉపకరించాయి. రచయిత చెప్పాలనుకుని చెప్పలేకపోయినది కూడా బాపు కవరు పేజిలో కనబడుతుంది చాలాసార్లు. ఆయన వేసిన కర్ ఇలస్ట్రేషన్స్ ఎన్నో వందలు; ఎన్నో రకాలు. ఈసారికి ప్రబంధ కావ్యలను ఆకర్షణీయంగా అందించిన తీరు చూడబోతే-
ఎమెస్కోవారు 2 రూపాయలకే పుస్తకాలు అందించే రోజుల్లో ప్రబంధాల పునర్ముద్రణ మొదలు పెట్టారు. వాటికి కవరు పేజీలు వేసేటప్పుడు బాపు ఆ కావ్యాలను చదివి, ఆస్వాదించి వాటిలో రసవద్ఘట్టాలను ఎంచుకొని వాటితో ముఖచిత్రాలను అలంకరించా రనిపిస్తుంది. ప్రాచీన సాహిత్యం కాబట్టి చక్కటి లతలు, పూలతో బోర్డర్లు వేశారు.
ఆయా ప్రబంధాల సబ్జక్ట్ గుర్తుచేసుకుంటే కవరు పేజిల విశిష్టత మరింత బాగా తెలుస్తుందన్న నమ్మకంతో కథాంశం గురించి ఒకటి, రెండు లైన్లు…..
'ఆముక్తమాల్యద'లో కథానాయిక గోదాదేవి. దేవుడికై పూలమాలలను కట్టి తాను ధరించిన తర్వాతనే దేవుడికి అర్పిస్తుంది. (ఆ-ముక్త-మాల్య-ద అంటే 'విడిచిన మాలలను ఇచ్చేది' అని అర్థం) అందుకే గోదాదేవి మాలలతో సహా దర్శనమిస్తోంది.
'హర విలాసం' శివలీలలగాథ. తన కోసం ఘోరతపస్సు చేస్తున్న పార్వతిని మారు వేషంలో వచ్చిన శివుడు పరీక్షించే దృశ్యం యిది.
'పారిజాతాపహరణం'- పోరుసలిపి దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకురావడానికి కారణభూతమైన సత్యభామ అలుకను హైలైట్ చేయడం జరిగింది.
'రాధికాసాంత్వనం' – తాను పెంచిన ఇళాదేవిని కృష్ణుడికి యిచ్చి పెళ్లి చేస్తుంది రాధ. ఆ తర్వాత ఇళ-కృష్ణుడి సాన్నిహిత్యం చూసి అసూయ పడి అలుగుతుంది. ఆమెను కృష్ణుడు ఓదార్చడమే కవర్ పేజీపై బాపు చిత్రీకరించారు.
'శృంగారశాకుంతలం'లో దుష్యంతుడు, శకుంతల మొదటిసారి కలుసుకునే దృశ్యం. ఈ కావ్యంలోని నాయికా నాయకుల ప్రథమ సమాగమ దృశ్యం అనేక కావ్యాలలో ఇటువంటి ఘట్టాలకు ఒరవడి అయిం దంటారు. దాన్ని పుస్తకం కవర్‌పై వేశారు. అలాగే 'ప్రభావతీ ప్రద్యుమ్నం' ప్రభావతీ, ప్రద్యుమ్నుల మధ్య ప్రణయగాథ. అదే కవర్‌పై కనబడుతుంది.
'కళాపూర్ణోదయం' – నిజానికి చాలా కాంప్లికేటెడ్ కథ. ఎన్నో పాత్రలు. అయినా కవరుపై ఉయ్యాలలూగే సుందరిని ఎంచుకోవడానికి కారణం – ఆ ప్రబంధంలోని బాపుగారిని ఆకట్టుకున్న ఓ చక్కని పద్యం ! ఉయ్యాల ఊగుతూ ఆకాశం అంచులు తాకి స్వర్గలోక సుందరులపై కయ్యానికి కాలు చాచగల సోయగంగల కథానాయిక కలభాషిణిని వర్ణించే పద్యానికి 'గీత' కల్పన చేశారు బాపు.
'విజయ విలాసం' – విజయుడంటే అర్జునుడు. అతడు మునిలా మారువేషం వేసుకుని వచ్చి సుభద్రను వలచి, వలపింప చేసుకున్న ఘట్టం.
'అహల్యా సంక్రందనము' – అహల్య అనగానే రాయిబొమ్మకై వెతుకుతాం. కానీ ఇక్కడ శపించ బడడానికి ముందున్న శృంగారమూర్తి అహల్య కథ యిది. అహల్యను బ్రహ్మ సృష్టించగానే ఆమెను వలచిన ఇంద్రుడు (సంక్రందుడు అంటే ఇంద్రుడు) తన కిచ్చి వివాహం చేయమంటాడు. ఇలా చాలామంది అడగడంతో ఆమెను గౌతముడికి యిచ్చి పెళ్లి చేస్తారు. అమెను మరువలేని ఇంద్రుడు ఆమె భర్త వేషంలో వచ్చి ఆమెతో రమిస్తాడు. అతను యింద్రుడు కాడని తెలుసుకోలేని అమాయకురాలు కాదు అహల్య. తెలిసే ప్రణయంలో పాల్గొంటుంది. అందుకే యిద్దరూ శాపానికి గురవుతారు. దానికి దారి తీసిన ఘట్టాన్ని – ఇంద్రుడితో ఆమె ప్రణయాన్ని- చిత్రకారుడు చూపుతున్నాడు.
'శశాంక విజయం' – బృహస్పతి భార్య తార. ఆయన కంటె వయసులో చాలా చిన్నది. భర్త వద్ద శిష్యుడిగా చేరిన చంద్రుణ్ని (శశాంకుడంటే చంద్రుడు) వలచి, అతని పొందు కోరుతుంది. చంద్రుడు కూడా స్పందించి చివరకు గురువుచేత శాపం పొందుతాడు. చివరకు శాపవిమోచనం కూడా జరుగుతుంది కాబట్టి 'శశాంక విజయం' అని పేరు పెట్టాడు కవి.
'బిల్హణీయం' – తన కుమార్తెకు పాఠాలు చెప్పడానికి వచ్చిన బిల్హణుడనే పండితుడు సుందరాంగుడు కావడంతో భయపడి, ఏవో అబద్ధాలు చెప్పి మధ్యనొక తెర ఏర్పాటు చేస్తాడు మహారాజు. కానీ విధివిలాసం వల్ల ఒకరినొకరు చూసుకోవడం, మోహంలో పడడం జరుగుతుంది. బిల్హణుడికి మరణదండన పడుతుంది. చివరిలో స్వచ్ఛమైన అతని ప్రేమను గుర్తించి రాజు వివాహానికి సమ్మతించడం జరుగుతుంది. కథకు మూలబిందువైన తెరను తెరపైకి తెచ్చారు బాపు.
'వైజయంతీ విలాసం'- విప్రనారాయణుడనే భాగవతోత్తముడిని దేవదేవి అనే ఒక వేశ్యాంగన పంతం పట్టి హావభావాలతో రెచ్చగొట్టి లొంగదీసుకునే గాథ ఇది. చివరకు యిద్దరికీ మోక్షం కలుగుతుంది. విప్రనారాయణుడు విష్ణువు మెడలో మాలగా (వైజయంతి)గా మారతాడు. ''విప్రనారాయణ'' సినిమాకు ఆధారం యిదే. తపోధనుణ్ని సైతం రెచ్చగొట్టగల ఒంపుసొంపులు దేవదేవి కున్నాయని బాపు తన ముఖచిత్రం ద్వారా నిరూపించారు, మనల్ని ఒప్పించారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)