ఓ కొడుకు తన తల్లి మరణంపై నెలకొన్న సస్పెన్స్‌కి తెరదించాలని కోరుతున్నాడు.. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ డెత్ మిస్టరీ గురించే ఇదంతా. మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్, అనుమానాస్పందంగా మృతిచెందిన విషయం విదితమే.
‘సునంద చనిపోవడం వెనుక కారణాలు తెలియక ఆందోళన చెందుతున్నా..’ అంటూ పోలీసుల్ని కలిసి, తన తల్లి మృతిపై విచారణను వేగవంతం చేసి, స్పష్టత ఇవ్వాలని ఆమె తనయుడు శివమీనన్ పోలీసులను కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. సునంద పుష్కర్ మోతాదుకి మించి మందులు తీసుకోవడం వల్ల చనిపోయారన్నది తొలుత వచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్. అయితే, అది ఒత్తిడి కారణంగా ఇచ్చిన పోస్ట్ మార్టమ్ అని ఆ తర్వాత డాక్టర్లు స్పష్టం చేయడం వివాదాస్పదంగా మారింది.
తాజా నివేదికలో విష ప్రభావం వల్లనే సునంద పుష్కర్ మృతి చెందారని తేలే సరికి, ఆమెను ఎవరు చంపారు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తన తల్లి మరణం విషయంలో అనుమానాలేవీ లేవని గతంలో వ్యాఖ్యానించిన శివమీనన్, ఇప్పుడు తన తల్లి మరణంపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు నివృత్తి కావాలనడం ఆశ్చర్యకరమే.
సునంద పుష్కర్ ఓ రాజకీయ నాయకుడి భార్య కావడం.. అందునా, ఆమె శశిథరూర్ భార్య కావడానికి ముందే వేరే వ్యక్తితో పెళ్ళి అయి అతని నుంచి దూరంగా వుండడం.. శశిథరూర్‌కి సైతం సునంద పుష్కర్కన్నా ముందు వేరే మహిళతో వివాహమయి, ఆమెకు దూరమవడం.. ఇలా ఇన్ని కథలు తెరవెనుక వుండడంతో.. సునంద పుష్కర్ మరణంపై సహజంగానే అనుమానాలు వెల్లువెత్తుతాయి. అయితే సునంద పుష్కర్ మృతిచెందిన సమయంలో ఆమె భర్త శశిథరూర్ కేంద్రమంత్రి కావడంతో.. అప్పట్లో ఆ కేసు పేలవంగా మూసివేయబడిందన్న విమర్శలున్నాయి.
ఇప్పటికైనా సునంద డెత్ మిస్టరీ వీడుతుందా.? వేచి చూడాల్సిందే.