బాపు తెలుగమ్మాయిని 'చిత్రీ'కరించడం చూసి 'బాపు అంటే తెలుగుతనమే' అని ఛట్టున అనేస్తాం. మరి 'అరబ్బీ అమ్మాయిని కూడా అంత సొగసుగానూ గీస్తే..!? '..అరబ్బీతనం కూడాను…' అని చేర్చాలా?
దాశరథి గారి 'గాలిబ్ గీతాలు' తెలుగు పాఠకులకు గాలిబ్‌ను పరిచయం చేశాయి, వాటికి బాపు అద్భుత చిత్రరాజాలు 'అక్షరాలా' ఆ ముస్లిం వాతావరణాన్ని ఎంతో అందంగా ప్రతిఫలింప చేశాయి.
గాలిబ్, ఉమర్ ఖయ్యాం కవితలకు పర్షియన్లు, ఇంగ్లీషువాళ్లు వేసిన బొమ్మలు ఒకసారి చూస్తే వాటి కంటె బాపు బొమ్మలు ఎంత హృద్యంగా వున్నాయో మీకే అర్థమవుతుంది.
గాలిబ్ గీతాల బొమ్మలు అందరూ చూసే వుంటారు. అంతగా ప్రాచుర్యం పొందని ఆరుద్రగారి 'అరబ్బీ మురబ్బాలు'కు గీసిన బొమ్మలను యిక్కడ యిస్తున్నాను. అవి చూస్తే ఆ దేశవాసుల రూపురేఖలు, ముఖకవళికలు ప్రదర్శించేందుకు బాపు ఎంత అధ్యయనం చేసి వుంటారా! అని అబ్బురపడతాం. అవధులు లేని చిత్రకారుడు బాపు అని తీర్మానిస్తాం.
హకీము చేతిలోని కత్తులు
ఆరోగ్యం ప్రసాదించవచ్చును
సఖీ! నీ కళ్ళలోని కత్తులు
సుఖమిచ్చినా తాపం హెచ్చును
నల్లని నిద్దుర నా మీద పడినప్పుడు
'నాకు నీవెవ్వరో తెలియద' న్నానా?
తెల్లని తొడల చెలి వాలినప్పుడు
'తెలుసులే తెలుసులే నీ సంగత'న్నాను.
నా మరణం జవాబు అయితే
నా మనుగడ సరాగమైతే
నీ కంటికి విందులు చేస్తా
నీ యింటికి అతిథిని అవుతా
ఇలలో నువ్వు గాలించేది
ఇంట్లోనే వుంటుంది
కలలో నువ్వు ఆశించేది
కష్టపడితే వస్తుంది
రాను రాను రానంటూ బిత్తరి
రాస్తున్నది ప్రేమలేఖ హత్తెరి!
అయిదు వేళ్ళతో పట్టుకొంటుంది కలం
అయిదు ప్రాణాలూ తీస్తుంది సత్వరం
వెలది నయనాల వెలువడె
వేనవేల జాబిల్లి కూనలు
దరి చేరలేని నా దీన నేత్రాలు
కురియ సాగెను కన్నీటి వానలు
(సశేషం) – ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)