జరగాల్సింది పునర్‌నిర్మాణమే.!

ఉత్తరాంధ్ర సర్వనాశనమైపోయిందన్న మాట చిన్నదేనేమో. తుపాన్లు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌.. కోస్తా జిల్లాల్లో తుపాన్లు సర్వసాధారణమే కావొచ్చుగానీ, హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం మాత్రం అత్యంత భయానకం. ఐటీ రాజధాని విశాఖ అతలాకుతలమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద…

ఉత్తరాంధ్ర సర్వనాశనమైపోయిందన్న మాట చిన్నదేనేమో. తుపాన్లు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌.. కోస్తా జిల్లాల్లో తుపాన్లు సర్వసాధారణమే కావొచ్చుగానీ, హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన బీభత్సం మాత్రం అత్యంత భయానకం. ఐటీ రాజధాని విశాఖ అతలాకుతలమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం చిగురుటాకులా వణికిపోయింది. విశాఖ అందాలు.. అన్న మాట ఇప్పుడు నిజం కాదు. ఎందుకంటే, ఆ అందాలన్నీ తుపాను కొట్టుకుపోయాయి.

విశాఖ బీచ్‌రోడ్‌ ఇదివరకు చూసినవారు ఇప్పుడు మళ్ళీ చూస్తే కంటతడి పెట్టక మానరు. కైలాసగిరి తదితర ప్రాంతాల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితీ అత్యంత దారుణంగా తయారైంది. విశాఖ విమానాశ్రయం ధ్వంసం కావడం మరింత దారుణమైన విషయం. మొత్తంగా మూడు జిల్లాల్లో ప్రకృతి విలయతాండవానికి సర్వం నాశనమైపోయిందన్నమాట అతిశయోక్తి కాదేమో.

కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందోగానీ, యుద్ధ ప్రాతిపదికన ఉత్తరాంధ్ర పునర్‌నిర్మాణం జరగాల్సిన పరిస్థితైతే కన్పిస్తోందిప్పుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, చివరి బాధితుడికి సహాయం అందించేదాకా ఉత్తరాంధ్రని విడిచిపెట్టేది లేదంటూ.. విశాఖకు పయనమవుతున్నారు. మరి, ఆయన తన మాట మీద ఎంతవరకు నిలబడ్తారన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.