ఎమ్బీయస్‌ : బాపు విశ్వరూపం- 7

పోర్ట్రయిట్లు వేసినవాళ్లు మనిషి పోలికలు అచ్చుగుద్దేట్లా వేయగలిగితే మెచ్చుకోవలసినదే. కానీ ఆ పని ఫోటో స్టూడియోలో కెమెరా కూడా చేస్తుంది. సినిమా కెమెరా అయితే అతని వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ప్రదర్శించడానికి కొన్ని యాంగిల్స్‌ను వెతుక్కుంటుంది.…

పోర్ట్రయిట్లు వేసినవాళ్లు మనిషి పోలికలు అచ్చుగుద్దేట్లా వేయగలిగితే మెచ్చుకోవలసినదే. కానీ ఆ పని ఫోటో స్టూడియోలో కెమెరా కూడా చేస్తుంది. సినిమా కెమెరా అయితే అతని వ్యక్తిత్వాన్ని, గుణగణాలను ప్రదర్శించడానికి కొన్ని యాంగిల్స్‌ను వెతుక్కుంటుంది. అదీ చాలక లైటింగ్‌, నేపథ్యసంగీతం వంటి యితర ప్రక్రియల సహాయం తీసుకుంటుంది. కానీ బాపు కొన్ని లైన్లలోనే ఆ డైమన్షన్‌లన్నీ చూపగలరు. అలా చేయగలగాలంటే ఆ వ్యక్తి గురించి అధ్యయనం చేయాలి. చేయగల శ్రద్ధ, ఆసక్తి ఆయనకున్నాయి కాబట్టి ఎంతటి మహామహులైనా బాపుగారి చేత తన పోర్ట్రయిట్‌ వేయించుకోవాలని తహతహ లాడతారు.

ఇక్కడ కొన్ని రేఖాచిత్రాలు యిస్తున్నాను. ఆ యా వ్యక్తుల గురించి తెలియనివారికి యీ బొమ్మలు చూపి వారెలాటి వారో వూహించమనండి. వారి అంచనాలు ఎందుకు నిజమవుతున్నాయో మీరూహించండి. అప్పుడు అర్థమవుతుంది – బాపు రేఖలలోని మహాత్మ్యం!

పట్టుదల, ధైర్యం, సాహసం ఉన్న మహిళ అని యీవిడని వర్ణిస్తారు. తననుకున్న లక్ష్యం వైపు చూపు సారించడం, ఒక భుజం పైకి లేచి వుండడం, ముఖంలో దృఢత్వం! అవును, ఈవిడ దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌! స్వాతంత్య్ర యోధురాలు. ఉప్పు సత్యాగ్రహం మద్రాసులో చేసి తీరాలని ప్రకాశంగారితోనే పోట్లాడింది. ఇరవై ఏళ్లు రాకుండానే 'జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌' వంటి వీరవనితగా పేరుబడ్డారు. చిన్నవయసులోనే హిందీ నేర్చుకుని హిందీ పాఠాలు చెప్పేది. వైధవ్యం ప్రాప్తించాక, చిన్నప్పుడు మానేసిన చదువు మళ్లీ మొదలుపెట్టి ఎం.ఎ.బి.ఎల్‌. వరకు చదివింది. రాజ్యాంగ నిర్మాణసభ సభ్యురాలైంది. మద్రాసులో ఆంధ్ర మహిళా సభ స్థాపించి ఎందరికో ఆశ్రయం కల్పించింది. మహిళల చదువు కోసం, స్వావలంబన కోసం నిరంతరం శ్రమించింది. ప్రముఖ ఆర్థికవేత్త సి.డి. దేశ్‌ముఖ్‌గార్ని పునర్వివాహం చేసుకుంది. ఆవిడ ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి. ఇది 1960ల్లో బాపు వేసిన బొమ్మ.

 

 

రెండు, మూడేళ్ల క్రితం మళ్లీ ఆవిడ బొమ్మ వేయవలసి వచ్చినపుడు ఆమె చూపుల్లోని పట్టుదలకు కరుణ కలిపి, మహిళాశిశుసంక్షేమానికై ఆమె చేసిన కృషిని గుర్తు చేస్తూ యింకో బొమ్మ వేశారు.

 

 

 

 

 

 

 

 

''నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు'' అని చెప్పుకున్న కవి బొమ్మను గుర్తుపట్టు అని మీ తెలుగేతర స్నేహితుణ్ని అడిగి చూడండి – ఛట్టున యీ బొమ్మ కేసి చూపి రొమాంటిక్‌ పొయట్‌లా వున్నాడే అంటారు. నున్నటి ముఖం, సన్నటి ఫ్రేమున్న కళ్లజోడు, కోమలత్వం, కుదురుగా దువ్వుకున్న గిరజాల జుట్టు – ''అమృతం కురిసిన రాత్రి'' ఫేమ్‌  (దేవరకొండ బాల గంగాధర) తిలక్‌. ఆయన వచనరచనల్లో కూడా లాలిత్యం వుంటుంది. పిన్నవయసులోనే పోయారు. 

 

 

 

తెలుగుసినిమాలు చూడని వారు కూడా యీయనెవరో ధీరోదాత్తుడైన నాయకుడిలా, స్వాష్‌బక్లింగ్‌ హీరోలా వున్నాడంటారు. ఆ బలమైన భుజాలు, కండలు, మగటిమి, ముఖంలో ఆత్మీయత ఉట్టిపడే చిరునవ్వు, ఎన్‌ టి రామారావు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్న ధీరుడు. జనసామాన్యానికి చేరువయిన ప్రజా నాయకుడు. 

 

 

తాత్త్వికుడైన రచయిత అనిపిస్తారీయన. నిశితంగా విశ్లేషిస్తున్నట్టున్న ఆ దృష్టి, ఆ  లావు ఫ్రేము కళ్లజోడు, ఆ సైడు పోజు అవునంటాయి. ''మన తత్త్వవేత్తలు'' అని వివిధ రకాల ఫిలాసఫీల గురించి రాయడంతో బాటు కాల్పనిక రచనలు చేశారు, సినిమాలూ తీశారు. ఏం చేసినా తన రచనల్లో మామూలు కథ కంటె తత్త్వ విచారానికి, మనస్తత్వ విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యం యిచ్చిన గోపీచంద్‌ (''అసమర్థుని జీవితయాత్ర'' రచయిత) బొమ్మ యిది. 

 

 

 

 

 

 

వేదాంతంలోకి వెళ్లిన మేధావి అని యీయన్ని ఊహిస్తారు. ఈ ఊర్ధ్వదృష్టి స్వామీజీలకు వుండవచ్చు. కానీ కొద్దిపాటి గడ్డం, బనియన్‌ ఆయన మామూలు సంసారి అని తెలియ పరుస్తాయి. జీవితాన్ని మధించిన ఆలోచనా సరళి ఆయన ముఖకవళికల్లో కనిపిస్తుంది. తన రచనల ద్వారా స్త్రీలోకాన్ని మేల్కొలిపి, వారి మస్తిష్కాన్ని పాఠకులకు ఆవిష్కరించిన చలం జీవిత చరమాంకంలో రమణ మహర్షి శిష్యులై తిరువణ్ణామలైలో స్థిరపడ్డారు.

 

 

స్వయంకృషితో అనేక అడ్డంకులు, పరిమితులు అధిగమించి ఎదిగిన కథానాయకుడు అని వర్ణిస్తారు యీ బొమ్మ చూడగానే. నిటారుగా నిలబడ్డ తీరు, శిఖరాన్ని చేరి లోకాన్ని పరిశీలిస్తున్నట్లు చూసే ఆ చూపు అటువంటి అభిప్రాయాన్నే కలిగిస్తాయి. పట్టుదలతో తానెక్కలేని ఎత్తులు లేవని నిరూపించుకున్న అక్కినేని నాగేశ్వరరావు ''కథానాయకుని కథ''కు యింతకు మించిన రూపచిత్రణ దొరుకుతుందా!

 

 

 

 

 

 

 

చివరగా ఓ జంట – యిద్దరూ కవిపండితులే, సాహిత్యసముద్రాన్ని ఔపోసన పట్టినవారే. ఇద్దరికీ పోలికలతో బాటు తేడాలూ వున్నాయి. ఒకరిది అభ్యుదయ మార్గం, మరొకరది సంప్రదాయమార్గం. పోలికలు, తేడాలు సులభంగా తెలిసేట్లా యిద్దర్నీ కలిపి వేశారు బాపు – ఆరుద్ర, విశ్వనాథ. చూడండి ఆయన చమత్కారం!  (సశేషం) 

 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6