బొమ్మల కథ సబ్జెక్టు ఏదైనా సరే, అన్నిటినీ కలిపి కామిక్స్ అంటారు. కామిక్స్ రాయడం మాటలు కాదు. మాటలూ, బొమ్మలూ ఉండాలి. వాటి మధ్య తూకం కుదరాలి. కథను నడుపుతూనే ఏ మేరకు దృశ్యపరంగా చూపాలో తెలియాలి. కథలో కూడా కొంత కథకుడి పరంగా, కొంత సంభాషణల పరంగా చెప్పుకురావాలి. వీటన్నిటి మధ్యా సమన్వయం కుదిరినప్పుడే 'బొమ్మలకథ' పండుతుంది.
బొమ్మలు వేసినప్పుడు అన్నీ క్లోజప్ వేసినా బాగుండవు. సినిమా కెమెరాలా ప్రాముఖ్యత బట్టి ఫ్రేములు, షాట్లు మార్చుకుంటూ, వాతావరణాన్ని, కథా నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. చిత్రకారులందరికీ ఈ విద్య పట్టుబడదు.
బాపు గారు తెలుగునాట కామిక్స్‌కి మంచి ప్రచారం తెచ్చారు. బాపు గీసిన రకరకాల కామిక్స్ చూద్దాం. తర్వాతి రోజుల్లో డైరక్టరు కావడానికి బాపుకి యివి బాగా ఉపకరించాయని గమనించవచ్చు. ఆంధ్ర పత్రిక వీక్లీకై బాపు వేసిన మొదటి బొమ్మల కథ 'రాజు-రైతు' ఓ జానపద గాధ. మిస్టరీ, సస్పెన్స్, హారర్ కలిపిన డిటెక్టివ్ కథ – 'లంకెబిందెలు'. ఇతర గ్రహవాసులను కూడా పాత్రలు వేసి రాసిన కామెడీ సీరియల్ 'బంగారం-సింగారం'.
జగత్ప్రసిద్ధమైన ''గలివర్ ట్రావెల్స్'' వేసినపుడు పాత్రలకు యూరోపియన్ ఫీచర్స్ వేశారు చూడండి. ఇవీ, యింకా కొన్ని కామిక్స్ కలిపి 'రచన' శాయిగారు 2007లో ''బాపు బొమ్మల కథలు'' పేర ఓ పెద్ద పుస్తకం వేశారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)