క్రికెట్‌కు చెల్లుచీటీ : ఇక బాలీవుడ్‌ ‘భజ్జీ’

మనదేశంలోని క్రికెట్‌ క్రీడాభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుతమైన స్పిన్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌కు ఎప్పటికీ చోటు ఉంటుంది. భజ్జీ చేసే మణికట్టు మాయాజాలం.. జట్టు సభ్యులతో కలివిడిగా ఉండేతీరు, కొండొకచో ఆగ్రహావేశాలను వ్యక్తం చేసే…

మనదేశంలోని క్రికెట్‌ క్రీడాభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే అద్భుతమైన స్పిన్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌కు ఎప్పటికీ చోటు ఉంటుంది. భజ్జీ చేసే మణికట్టు మాయాజాలం.. జట్టు సభ్యులతో కలివిడిగా ఉండేతీరు, కొండొకచో ఆగ్రహావేశాలను వ్యక్తం చేసే దూకుడు, అదే రీతిలో ప్రత్యర్థి జట్టులో గిల్లి కజ్జాలు పెట్టుకుని వివాదాలకే కేంద్రంగా ఉండే శైలి … హర్భజన్‌ పేరు చెప్పగానే ఇవన్నీ సీరియల్‌గా గుర్తుకు వస్తాయి. 

అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హర్భజన్‌ ఇప్పుడు అవుట్‌ డేటెడ్‌ క్రికెటర్‌ అయిపోయాడు. అటు వన్డేలు, ఇటు టెస్టులు ఏ సిరీస్‌కోసం జట్టును ఎంపిక చేస్తున్నా.. కనీసం భజ్జీ పేరును కూడా సెలక్టర్లు పట్టించుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. 100 టెస్టులు ఆడి 413 వికెట్లు తీసిన హర్భజన్‌ నిజానికి లెజెండ్‌గా వెలుగొందుతూ ఉండవలసింది. కానీ హర్భజన్‌కు పరిస్థితి రివర్సు అవుతోంది. ఆయనను క్రికెటర్‌గా ఎవ్వరూ పెద్దగా ఆదరించడం లేదు. అశ్విన్‌ దెబ్బకు కనుమరుగవుతున్నాడు. కనీసం రంజీలు కూడా ఆడడం లేదు. అదేసమయంలో ఫాంను కోల్పోవడం కూడా ఆయనకు పెద్ద దెబ్బ. 

ఇక క్రికెట్‌ కెరీర్‌ పూర్తిగా అంతమైపోయిందని అనుకున్నాడో ఏమోగానీ.. భజ్జీ బాలీవుడ్‌పై కన్నేశాడు. అబ్బే తను హీరోగా అవకాశాలు ట్రై  చేస్తున్నాడని కాదు. పూర్తిస్థాయిలో బాలీవుడ్‌ అవకాశాలను ఎక్స్‌ప్లోర్‌ చేయడానికి ఆ ఇండస్ట్రీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. అక్కడ హర్భజన్‌ ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించాడు. ఆ బ్యానర్‌ మీద రెగ్యులర్‌ చిత్రాలు నిర్మించాలని అనుకుంటున్నాట్ట. మొత్తానికి క్రికెట్‌లో ఫాం కంటె.. మరింత నిలకడ లేని రంగాన్ని హర్భజన్‌ ఎంచుకున్నాడని అభిమానులు అనుకుంటున్నారట.