తెహెల్కా బాగోతం.. ఇక్కడ కూడానా.?

తెహెల్కా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీడియా సంస్థ ఇది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతోన్న బంగారు లక్ష్మణ్‌ని జైలు పాలు చేసింది ఈ సంస్థ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషనే. ఆ ఆపరేషన్‌…

తెహెల్కా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీడియా సంస్థ ఇది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతోన్న బంగారు లక్ష్మణ్‌ని జైలు పాలు చేసింది ఈ సంస్థ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషనే. ఆ ఆపరేషన్‌ తెహెల్కా దశ మార్చేసింది. తెహెల్కా ఎడిటర్‌గా తరుణ్‌ తేజ్‌పాల్‌ పేరు మార్మోగిపోయేలా చేసింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా తెహెల్కా.. ఇండియాలోని టాప్‌ మీడియా సంస్థల్లో ఒకటిగా ఓ వెలుగు వెలిగిన విషయం అందరికీ తెల్సిందే.

అయితే, ఏ ఆయుధం పట్టుకు తిరిగేవాడు ఆ ఆయుధానికే బలైపోతాడన్నట్టు.. తరుణ్‌ తేజ్‌పాల్‌, స్టింగ్‌ ఆపరేషన్‌కే బుక్కయిపోయారు. ఓ జర్నలిస్టు, తనను తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగికంగా వేధించారంటూ ఆధారాలతో సహా, పోలీసులను ఆశ్రయించింది. అంతే తేజ్‌పాల్‌ పరువుతోపాటు, తెహెల్కా పరువు కూడా బజార్న పడిపోయింది. ఇదేమీ ఆషామాషీ విషయంగా ఎవరూ లైట్‌ తీసుకోలేదు. తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ పోస్ట్‌కి షోమా చౌదరి రాజీనామా చేయడంతో, తెహెల్కాపై దేశమంతా దృష్టి సారించింది.

ఇప్పుడిప్పుడే తెహెల్కా గురించి అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అతి తక్కువ కాలంలో సంచనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెహెల్కా ఎలా ఎదిగింది.? తెహెల్కా షేర్స్‌ పది రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలదాకా ఎలా ఎగబాకాయి.? ఇవన్నీ ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. బీజేపీ నేతపై స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంలో, కాంగ్రెస్‌ పెద్దల నుంచి సహాయ సహకారాలు అందాయనీ, ఆ కారణంగానే తెహెల్కా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి, ఇప్పుడా ఆరోపణలే తెహెల్కా ఇమేజ్‌ని డ్యామేజీ చేస్తున్నాయి.

2005-2006 సమయంలో తెహెల్కా సంస్థలో పనిచేస్తోన్న సిబ్బందికి రెండు నెలలపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయనీ, ఆ తరువాత అనూహ్యంగా 10 రూపాయల విలువ వుండే ఒక్కో షేర్‌నీ 13 వేల రూపాయలకుపైగానే కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయనీ ఆ సంస్థలో అప్పట్లో పనిచేసిన వ్యక్తే వెల్లడిరచాడంటే తెరవెనుక బాగోతం ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

తెహెల్కాలో ప్రధాన భాగస్వాములైన తరుణ్‌ తేజ్‌పాల్‌ కుటుంబం, షోమా చౌదరి కుటుంబంతోపాటు, రామ్‌ జెఠ్మలానీ, కపిల్‌ సిబాల్‌ వంటివారికీ షేర్లు వున్నాయి. లండన్‌ బేస్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రియాంకా గిల్‌కి ఏకంగా 4242 షేర్లు వుండడం గమనార్హమిక్కడ. విచిత్రమేంటంటే, తనకు తెహెల్కాలో షేర్లు వున్నట్లు కపిల్‌ సిబాల్‌కి తెలియకపోవడం. ఏదో ఓ సందర్భంలో డొనేషన్‌గా ఐదు లక్షలు ఇస్తే, తన పేరుతో షేర్లు ఎలా సృష్టించారో తనకే అర్థం కాలేదంటున్నారాయన.

డొనేషన్ల రూపంలో బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచీ తరుణ్‌ తేజ్‌పాల్‌ సుమారు రెండు కోట్లు దండుకున్నారనీ, అమీర్‌ఖాన్‌ వంటి తారలు లక్ష రూపాయల చొప్పున తెహెల్కాకి డొనేట్‌ చేశారనీ ఆ విషయాలన్నీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వారిలో ఎంతమంది తెహెల్కాలో షేర్‌ హోల్డర్స్‌గా వున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

2006లో తన వద్దనున్న 1500 షేర్స్‌లో 500 షేర్స్‌ని, ఒక్కోఓతీ 13,189 రూపాయలకు అంటే మొత్తంగా 66 లక్షల రూపాయలకు షోమా చౌదరి అమ్ముకున్నారు. తరుణ్‌ తేజ్‌పాల్‌ భార్య, 2 వేల షేర్స్‌ అమ్మితే, సుమారు రెండున్నర కోట్లు ఆర్జించగలిగారు. తరుణ్‌ తండ్రి, సోదరుడు, తల్లి, సోదరి.. ఇలా వీరందరూ తమ తమ షేర్లను అమ్ముకోవడం ద్వారా కోట్లు వెనకేసుకున్నారు.

విచిత్రమేంటంటే, తరుణ్‌ తేజ్‌పాల్‌ కుటుంబం షేర్స్‌ అమ్మిన సమయంలోనే ఆయన సుమారు 4125 షేర్లను సొంతం చేసుకున్నారు. అది కూడా ఒక్కోటీ కేవలం పది రూపాయలకు మాత్రమే. అంటే ఒక చోట పది రూపాయల షేర్‌ వాల్యూ, ఇంకో చోట 13,185 రూపాయలన్నమాట. అంటే ఇదంతా.. కార్పొరేట్‌ మాఫియా తరహాలో సాగుతోందన్నమాట. చెప్పుకుంటూ పోతే తరుణ్‌ తేజ్‌ పాల్‌, షోమా చౌదరి.. తెహెల్కాని ఏ రేంజ్‌లో నిర్వహించారో అర్థమవుతోంది. దేశంలో ఇబ్బడి ముబ్బడిగా మీడియా సంస్థలు పెరిగిపోవడానికి కారణం, తెరవెనుక రాజకీయ నాయకుల సహాయ సహకారాలేననడానికి ఇదో నిదర్శనం మాత్రమే.

మన రాష్ట్రం విషయానికొస్తే, ఇక్కడా ఇలాంటి వ్యవహారాలకి సంబంధించి పలు మీడియా సంస్థలపై ఆరోపణలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. కొన్ని పత్రికలు రోడ్డెక్కి మరీ ఒకదాని బాగోతం ఇంకోటి రచ్చకీడ్చుకుండటం చూస్తూనే వున్నాం. నెలకో ఛానల్‌, వారానికో పత్రిక కొత్తగా పుట్టుకొస్తున్నట్లు తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. వీటిల్లో పెట్టుబడులు ఎలా, ఎవరు పెడ్తున్నారు.. బ్లాక్‌ మనీ వైట్‌ మనీగా ఎలా మారుతోంది? లాంటి అంశాలేవీ ప్రభుత్వాలకి పట్టడంలేదు.

ఏమన్నా అంటే, పత్రికా స్వేచ్ఛ అనీ ఇంకోటనీ ముసుగు వేసేసి, దానికి రాజకీయ ప్రాబల్యాన్ని అడ్డం పెట్టి, తెరవెనుక బాగోతాల్ని ఎంచక్కా నడిపేస్తున్నారు. దేశంలో తెహెల్కా.. మన రాష్ట్రంలో తెహెల్కాని పోలిన మీడియా సంస్థల సంగతేంటి.? తరుణ్‌ తేజ్‌పాల్‌లా.. మీడియా చాటున కార్పొరేట్‌ బిజినెస్‌ చేస్తోన్న వారి మాటేమిటి.? ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే, మీడియా లాభసాటి బేరం.. అనే మాటేమోగానీ, మీడియా మాఫియా.. దేశాన్ని అధోగతిపాల్జేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.