దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అంటే తొలి తరం నాయకులు ఉన్నత విలువలతో, నైతిక విలువలతో, ప్రజాస్వామిక దృక్పథంతో, ప్రజాసేవ కాంక్షతో ఉండేవారు. నిరాడంబరంగా జీవించేవారు. పదిమందికీ ఆదర్శంగా ఉండేవారు. జ్ఞానంతో వెలిగిపోయేవారు. తాము చేసేదే చెప్పేవారు. తప్పు జరిగిందనే భావిస్తే తమకు తామే శిక్ష విధించుకునే నిబద్ధత ఉండేది. కాని కాలక్రమంలో ఆ తరం కనుమరుగైపోయింది. రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, మాఫియాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అడ్డదారుల్లో సంపాదించేవారు…ఇలా అనేకమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి శాసనకర్తలవుతున్నారు. మంత్రులవుతున్నారు. ముఖ్యమంత్రులూ అవుతున్నారు. పటాటోపాలు ఎక్కువయ్యాయి. ఆడంబరాలు పెరిగిపోయాయి. కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికీ గుడ్డిలో మెల్ల మాదిరిగా తొలి తరం నాయకులవంటి వారు ఉన్నారేమో…! కాని వారు రాజకీయాల్లో ఉన్నా ఫోకస్ కావడంలేదు.
ఈ తరం రాజకీయ నాయకుల్లో కొందరికి సీపీఎం దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య తెలుసు. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం ఎలా పాటుపడ్డారో తెలుసు. ఆయన నిరాండంబర జీవితం తెలుసు. ఆ రోజుల్లో ఆయన పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లేవారు. ఇది చాలా ఆశ్చర్యకరం. 'సుందరయ్య పార్లమెంటుకు సైకిల్‌పై వెళతారు' అని వింతగా చెప్పుకునేవారట. సుందరయ్య తన పనులు తానే చేసుకునేవారు. ఆయన బ్యాగులో రెండు జతల దుస్తులకు మించి ఉండకపోయేవని పెద్దలు చెబుతుంటారు. కమ్యూనిస్టు (సీపీఎం, సీపీఐ) నేతల్లో విలువలకు కట్టుబడినవారు, సింపుల్‌గా జీవించేవారు కొందరు ఉన్నారు. త్రిపుర ముఖ్యమంత్రి ఈ కోవకే చెందుతారు. ఇలా అక్కడక్కడ కొందరు కనబడుతున్నారు.
ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఉన్న భారతీయ జనతా పార్టీలోనూ గతంలో మంచి నాయకులు, నిరాండబరులు, నిస్వార్థపరులు ఉండేవారు. కాని…ఇప్పుడు అదీ అనేక అవలక్షణాలతో ఉంది. ఈ నేపథ్యంలో పుచ్చలపల్లి సుందరయ్య తరువాత ప్రస్తుతం పార్లమెంటుకు సైకిల్ మీద వస్తున్న ఏకైక ఎంపీ భాజపా సభ్యుడు కావడం విశేషం. ఆయన పేరు అర్జున్ రామ్ మేఘవాల్. రాజస్థాన్‌లోని బికనీర్‌లో చేనేత కుటుంబంలో పుట్టిన మేఘవాల్ కష్టపడి చదవుకొని, ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ (కన్ఫర్మ్డ్..డైరెక్టు ఐఏఎస్ కాదు) అధికారి స్థాయికి ఎదిగారు. జిల్లా కలెక్టరుగా కూడా పని చేశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి భాజపా తరపున ఎంపీగా గెలిచారు.
అందరూ స్కూలుకు వెళుతున్న వయసులో తాను కుటుంబానికి అండగా ఉండటం కోసం ఇంట్లో చేనేత పని చేశానని చెప్పారు. ఏడో తరగతి చదివేటప్పుడు వివాహమైంది. పెళ్లయిన తరువాత బిఏ తరువాత ఎల్ఎల్బీ చదవారు. ఆ తరువాత పీజీ చేశారు. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్టుమెంట్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఎదిగారు. పోటీ పరక్షలు రాసి స్టేట్ ఇండస్ట్రియల్ సర్వీసెస్‌లో ప్రవేశించారు. 1994 ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా ఉప ముఖ్యమంత్రి దగ్గర నియమితులయ్యారు. క్రమంగా ఉద్యోగ జీవితంలో ఎదిగి కన్ఫర్మ్డ్ ఐఎఎస్ అయి జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. కలెక్టరుగా ప్రజల ఆదరణ పొందారు.
2009లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ విజయం గత ఎన్నికల్లోనూ రిపీట్ అయింది. ఇంత చరిత్ర ఉన్న మేఘవాల్ సైకిల్ మీదనే పార్లమెంటుకు వస్తారు. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా చీఫ్ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమధ్య సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త అయిన రాబర్ట్ వాద్రాపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కారు. భూకుంభకోణాల్లో ఇరుక్కున్న వాద్రాను వదిలిపెట్టబోమన్నారు. ఈయన వాద్రా భూ కుంభకోణాలపై పోరాటం చేస్తున్నారు. వాద్రాకు బికనీర్, హర్యానా, ఢిలీల్లో భూ లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీతో కాంగ్రెసు వారికి ఉన్న సంబంధాలను బయపెడతామన్నారు.