దెబ్బ.. దెబ్బమీద దెబ్బ.!

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై కమలదళం చేసే కామెంట్లు ఎలా ఉంటున్నాయో చూస్తూనే వున్నాం కదా. 'పార్టీ ఫిరాయింపులు అనైతికం.. పార్టీ ఫిరాయించడంతోనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడాలి.. ఆ దిశగా చట్టాన్ని బలోపేతం…

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై కమలదళం చేసే కామెంట్లు ఎలా ఉంటున్నాయో చూస్తూనే వున్నాం కదా. 'పార్టీ ఫిరాయింపులు అనైతికం.. పార్టీ ఫిరాయించడంతోనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడాలి.. ఆ దిశగా చట్టాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..' అని పలు సందర్భాల్లో బీజేపీ నేతలు లెక్చర్లు దంచేస్తూ వస్తున్నారు.

లెక్చర్లు దంచడమెందుకు, బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లోనే పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. అయినా, బీజేపీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇక్కడ బీజేపీ మౌనం దాల్చడమంటే, పరోక్షంగా పార్టీ ఫిరాయింపుల్ని పెంచి పోషిస్తున్నట్లే భావించాలి. అయినా, బీజేపీ ఈ విషయంలో తక్కువ తినలేదు.

ఉత్తరాఖండ్‌లో ఏం జరిగిందో చూశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకుగాను, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోనే పార్టీపై తిరుగుబాటు చేయించింది. ఇంతా చేసి, బీజేపీ ఏం బావుకుంది.? ముందు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు.. దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. అంతే, కుక్కిన పేనులా మారిపోయింది బీజేపీ. బీజేపీ పెత్తనానికి సుప్రీంకోర్టు చెంపపెట్టు.. అంటూ కాంగ్రెస్‌ పార్టీ నినదించడం సంగతి అటుంచితే, దేశవ్యాప్తంగా బీజేపీ పరువు పోయిందన్నది నిర్వివాదాంశం.

ఇక, తాజాగా మరోసారి బీజేపీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఈ సారి అరుణాచల్‌ప్రదేశ్‌ లో బీజేపీ పరువు పోగొట్టుకుంది. గవర్నర్‌ అండదండలతో బీజేపీ విర్రవీగింది.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది.. మళ్ళీ వ్యవహారం కోర్టుకు చేరింది. జరిగిన ప్రహసనాన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు తేల్చేసింది. గవర్నర్‌కి తలంటు పోసింది. దాంతో, తిరిగి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమం అయ్యింది.

తాను ప్రధాని అయ్యాక దేశం వెలిగిపోతోందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకుంటున్నారు. కానీ, తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసేస్తోందన్న విషయాన్ని ఆయన విస్మరిస్తే ఎలా.? బీజేపీ అంటే నరేంద్రమోడీ.. నరేంద్రమోడీ అంటే బీజేపీ. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం, గవర్నర్‌ పాలన.. ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. సో, ఉత్తరాఖండ్‌ విషయంలోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలోనూ తగిలిన దెబ్బలు బీజేపీకి మాత్రమే కాదు, నరేంద్రమోడీకి కూడా అని భావించకతప్పదు.

ఒక్కటి మాత్రం నిజం.. దేశం వెలిగిపోవడం కాదు, దేశాన్ని బీజేపీ భ్రష్టుపట్టించేస్తోంది. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ, పైకి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమంటూ 'నంగనాచి' కహానీలు విన్పిస్తున్న బీజేపీ – నరేంద్రమోడీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఝలక్‌ల మీద ఝలక్‌లు ఇవ్వకపోతే, దేశం భ్రష్టుపట్టిపోవడం ఖాయమని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడ్తున్నారు.