హాలీవుడ్ లో అతిపెద్ద సంస్థగా పేరుపొందిన 'ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్' సంస్థను డిస్నీ దక్కించుకునేందుకు రంగం సిద్ధమైంది. వీలైతే మొత్తం సంస్థను లేదా అందులో మేజర్ వాటాను దక్కించుకునేందుకు డిస్నీ పావులు కదుపుతోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య దాదాపు 33వేల కోట్ల రూపాయల డీల్ కుదిరింది.
తాజా వ్యాపార ఒప్పందం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన అవతార్, డెడ్ పూల్ మూవీ సిరీస్ లతో పాటు ఎఫ్ఎక్స్ నెట్ వర్క్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెళ్లు డిస్నీ ఖాతాలోకి చేరబోతున్నాయి. ఈ డీల్ ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది. భారత్ లో లీడింగ్ లో ఉన్న స్టార్ నెట్ వర్క్ డిస్నీ చేతికి మారనుంది. అటు యూరోప్ లోని స్కై నెట్ వర్క్ లో కూడా మేజర్ వాటా డిస్నీకి చెందుతుంది.
ప్రస్తుతం భారత్ లో లీడింగ్ లో కొనసాగుతున్న హాట్ స్టార్ మూవీ యాప్ తో పాటు మరో కొత్త స్ట్రీమింగ్ యాప్ ను కూడా తీసుకురాబోతోంది డిస్నీ. సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలన్నింటినీ అందులో అందించనుంది. అది కూడా భారతీయ భాషల్లో.
తాజా విలీన ప్రక్రియతో డిస్నీ సంస్థ ఛైర్మన్, సీఈవో బాబ్ ఐగర్ మరోసారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 2019జులై లో సంస్థ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. 66ఏళ్ల బాబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం ఇది మూడోసారి.