ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 60లక్షల హ్యాండ్ సెట్స్ ను తమ కస్టమర్లకు అందించింది జియో. కానీ డెలివరీ విషయంలో మాత్రం మాట తప్పింది. దాదాపు 3 వారాలు ఆలస్యంగా వినియోగదారులకు జియో 4జీ హ్యాండ్ సెట్స్ అందాయి. దీనికి కారణం చైనాలో ఉత్పత్తి మందగించడమే.
4జీ హ్యాండ్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ ను చైనాకు చెందిన ఓ సంస్థకు అప్పగించింది జియో. కానీ విడిభాగాల సప్లయ్ లో జాప్యం కారణంగా ఉత్పత్తి తగ్గిపోయింది. ఇది ఇలానే కొనసాగితే.. 2018చివరి నాటికి 20కోట్ల హ్యాండ్ సెట్స్ అందించాలనే టార్గెట్ ను జియో అందుకోలేకపోవచ్చు. అందుకే ఇప్పుడీ సంస్థ రూటు మార్చింది.
4జీ హ్యాండ్ సెట్ల తయారీని చైనా నుంచి చెన్నై కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉంది జియో. ఈ మేరకు జియో ఉన్నతస్థాయి అధికారులు పలు మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ ఒప్పందానికి రాబోతున్నారు.
ప్రస్తుతం జియో 4జీ హ్యాండ్ సెట్లకు భారత్ లోని పల్లెలు, సెమీ-అర్బన్ లో మంచి గిరాకీ ఉంది. 1500రూపాయలకే ఈ ఫోన్ దొరుకుతోంది. పైగా మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి వినియోగదారుడికే ఇస్తారు. వీటికి తోడు రీచార్జీల రేట్లు కూడా తక్కువే.
రాబోయే 3నెలల్లో కనీసం 2కోట్ల హ్యాండ్ సెట్స్ కావాలి. అందుకే జియో ఇప్పుడు వేగంగా పావులు కదుపుతోంది. దేశీయ మొబైల్ తయారీ సంస్థలకు ఇదో పెద్ద అవకాశం.