ప్రేమ ఖరీదు పగ చౌక.
ఎప్పుడూ, ఎవర్నీ ప్రేమించని వారికి, ఇది చిన్న విషయంలాగానే అనిపిస్తుంది. కానీ ప్రేమించిన వాడికి తెలుస్తుంది: అది ఎంత ఖరీదయిందో. గంటలకు గంటలు కాలాన్నీ, వేలకు వేలు ధనాన్నీ ఖర్చు పెట్టాల్సి వుంటుంది. మెక్డీలూ, కాఫీడేలూ, మల్టీప్లెక్స్‌లూ, లాంగ్ డ్రైవ్‌లూ… దాదాపు ఓ డిగ్రీచేయటానికో, పీజీ చేయటానికో పట్టినంత సమయం పడుతుంది. అంతిమంగా ప్రేమ పరీక్షలో గెలుస్తామన్న హామీ వుండదు. ఒక వేళ గెలిచి ప్రేమ, పెళ్ళిగా మారినా, ప్రేమకు ‘డైలీ టెస్ట్’ లు వుంటాయి. ‘ఇంత చీప్ క్వాలిటీ చీర కొన్నారంటే, నా మీద ఎంత చౌకబారు ప్రేమ వుందో అర్థమవుతుందిలే’ అన్న టైప్ ‘ఎత్తిపొడుపు’లు ప్రతీ రోజు వుంటాయి. ఎప్పటికప్పుడు ప్రేమను నిరూపించుకుని అనునిత్యమూ నిరపరాధిగా సదరు ప్రేమించిన భర్త బయిట పడుతూ వుండాలి.
ఇంత కష్టపడకుండా కూడా ఆమెను జయించవచ్చు. అదే పగ. అంటే ఆమెమీద కక్ష పెంచుకోమని కాదు. ఆమె కక్షను ప్రియుడు తన కక్షగా మార్చుకోవాలి. ఆమె ఎవరిని చూసి ఈర్ష్యపడటానికి అవకాశం వుందో చూడాలి. ఆమెను తిడుతూ వుండాలి. ‘ఆమె అందగత్తెనని తెగ ఫీలవుతుంది కానీ, సిటీలో బ్యూటీ క్లినిక్‌లు ఒక్క వారం బంద్ చేస్తే చాలు, ఆమె అసలు రంగు బయిటకు వచ్చేస్తుంది’ అంటూ ఓ తీవ్ర వ్యాఖ్య చేస్తే చాలు, మహదానందంతో ప్రియురాలు వచ్చి,ప్రియుడి ఒడిలో పడిపోతుంది. పక్కింటామె మీద ఇదే పగను ఎప్పటికప్పుడు రగిలిస్తూ వుంటే, ఎంచక్కా పెళ్ళయ్యాక కూడా కాపురం దర్జాగా చేసుకు పోవచ్చు.
ఇదే ‘షార్ట్‌కట్’ రాజకీయాల్లోకి వచ్చేసి కూడా, చాలా కాలమయిపోయింది. ప్రజాస్వామ్యంలో ‘మెజారిటీ’ మీద వున్న మోజు, ఇంతా అంతా కాదు. మోజు పడినంత మాత్రాన ఏ పిల్లా, ప్రియురాలిగా మారిపోదు. దానికీ రెండే మార్గాలు: బుజ్జగింపూ, ద్వేషమూ. ఇందిరా గాంధీ హయాం నుంచీ కాంగ్రెస్ వారు ‘బుజ్జగింపు’ మీ ఎక్కువ ఆధారపడే వారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వోట్ల కోసం వారికి వరాలిచ్చి ‘బుజ్జగించే’ వారు. అలా ఒక్కొక్క వర్గానికి ఒక్కో రకమైన బుజ్జగింపును ప్రయోగించాల్సి వచ్చింది. ఇదంతా దీర్ఘ ప్రక్రియలా వుందని అనుకున్నారో, ఏమో, కొన్ని ఇతర పక్షాల వారు ‘ద్వేషాన్ని’ ఈ స్థానంలో వాడారు. అందుకు మతం కీలకమయిపోయింది. ‘మైనారిటీ మతస్తుల’ మీద ద్వేషాన్ని పెంచింతే, ‘మెజారిటీ మతస్తులను’ ఇట్టే, కూడగట్ట వచ్చు. ద్వేషాన్ని ఎక్కడయినా చూపించ వచ్చు. ‘మందిరం పై మసీదు’ కట్టారనీ చెప్పవచ్చు లేదా మతానికో చట్టమెందుకూ..? ‘కామన్ సివిల్ కోడ్’ కావాలనీ చెప్పవచ్చు. ఇంకో చిత్రం. ద్వేషాన్ని ఒక్కొక్క సారి ‘దేశభక్తి’ లా కూడా చూపించ వచ్చు, దేశభక్తి కార్గిల్ యుధ్ధంలోనే వుండాలన్న రూలు లేదు క్రికెట్ బ్యాట్‌లో కూడా వుండవచ్చు. అయితే చిన్న షరతు: ప్రతీ యుధ్ధంలోనూ ‘దేశభక్తి’ పుట్టదు. ఉదాహరణకు సరిహద్దుల్లో మనసైనికులకు చైనా వారితో ఇబ్బంది వచ్చిందనుకోండి. మరీ ఎక్కువ కోపం రాదు. అదే పాకిస్తాన్ తో వచ్చిందనుకోండి. దేశభక్తి ‘ఇన్స్టెంట్ ఎనర్జీ’ లాగా వచ్చేస్తుంది. ఆటయినా అంతే. ఏ న్యూజిలాండ్తోనో ఆడుతుంటే అంత కోపం రాదు పాకిస్తాన్ తో భారత్ జట్టు ఆడుతున్నప్పుడే వస్తుంది. కారణం పాకిస్తాన్ ‘ముస్లిం దేశం’ కావటం. వారి మీద మన ప్రతాపం చూపిస్తే, ఈ దేశంలో ముస్లింల మీద పగ పెంచినట్లవుతుంది. ఈ చిన్న లాజిక్కు మీద బీజేపీ, శివసేన లాంటి పార్టీలు బతికేస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, దేశవ్యాపితంగా ‘మైనారిటీ మతస్తులు’ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవించాల్సి వస్తుంది.
మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో ‘శివసైనికుల’కు మైనారిటీ మతస్తుల మీద కోపం పొడుచుకు రావటమన్నది ఆశ్చర్యం కాదు. ఢల్లీలోని మహరాష్ట్ర భవన్లో శివసేన ఎం.పి రాజన్ విచారేకి వడ్డించిన రోటీ నచ్చలేదు. ‘ఇది నువ్వయితే తింటావా?’ అని, కేటరింగ్ మేనేజర్ నోట్లో బలవంతంగా కుక్కబోయాడు. అతను ముస్లిం మతస్తుడు. పైపెచ్చు రంజాన్ ఉపవాసంలో వున్నాడు. ఆ విషయం చెప్పాలంటే ‘నోరును(రోటీతో) నొక్కేశాడు’ ఆ ఎంపీ. అప్పుడు తన చొక్కాకు అతికించి వున్న పేరును చూపించాడు. ఆగుతాడా ఆ ప్రతినిథి. ఈ చర్యను ఎవరయినా ఖండిరచవచ్చు. కానీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సమర్ధించారు. విషయం అర్థమయింది కదా! మైనారిటీ మతస్తుల మీద ‘ద్వేషం’ పెంచుకుంటే, రేపు ‘మెజారిటీ మతస్తుల’ వోట్లు దండుకోవచ్చు.
సరిగా ఇదే సమయంలో టెన్నిస్ క్రీడాకారిడి సానియా మీర్జాను తెలంగాణ ఆంబాసిడర్‌గా ప్రకటించారు. ఈ ఘటనకు కోపం అంటూ వస్తే, హైదరాబాద్ కు చెందిన నేతకే రావాలి. కారణం త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అలాగే మెజారిటీ మతస్తుల వోట్ల మీద ఆధారపడే పార్టీ నేతకే రావాలి. అలాగే వచ్చింది. హైదరాబాద్ కు చెందిన బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ కు కోపం వచ్చింది. ముస్లింను ‘బుజ్జగించటానికే’ ఆమెను తెలంగాణ ఆంబాసిడర్ చేశారన్నారు. ( ‘బుజ్జగింపు’ పాత టెక్నిక్ అని కేసీఆర్‌కు తెలియదు కాబోలు.) అక్కడితో ఆగారా? ఆమె పాకిస్తాన్ దేశానికి కోడలు. ఆమె పాకీస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్ళిచేసుకున్నారు లెండి. కానీ, కోడలు కావటానికన్నా ముందు ‘తాతల, ముత్తాతల నుంచీ తాను హైదరాబాద్‌లోనే వున్నానని’ ఆమె సానియా మీర్జా తన సంక్షిప్త జీవిత చరిత్రను బయిట పెట్టారు. ఇలా నిండా దొరికి పోయాక, మద్దతు ఇస్తే బాగుండదని బీజేపీ జాతీయ నేతలు జవదేకర్ లాంటి వాళ్ళు ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారు కానీ, లక్ష్మణ్ ‘ద్వేష ప్రకటన’ కు రాలబోయే ‘మెజారీ వోట్ల’కు మురిసిపోయే వారే!