పేరు పొన్నాల లక్ష్మయ్య
దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీలకు మాజీ. (అంటే మాజీ మంత్రినని కాదు. పి.సి.సి.చీఫ్ చేసిన వారు ఎందరో మాజీలుగా మిగిలిపోయారు. కానీ తెలంగాణ రాష్ట్రంఏర్పడ్డాక తొలి చీఫ్ నీ నేనే. తొలి మాజీ చీఫ్ నీ నేనే. తర్వాత ఎందరూ మాజీలయినా, వారిలో ప్రథుముడిగా నేనే వుండిపోతాను.)
ముద్దు పేర్లు : ‘మూణ్నాళ్ళ’ లక్ష్మయ్య ( ఏ పదవీ శాశ్వతం కాదు. అందులోనూ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి అస్సలు కాదు. అందుకే ఎవరు నా అసమ్మతి వ్యక్తంచేసినా, నేను ఫీలవను.)
‘విద్యార్హతలు : విదేశీ చదువే. కానీ స్వదేశానికి పనికి వస్తుందో, లేదో ఇప్పటికీ తెలీదు. ప్రయోగించి చూశాను. ఎన్నికలలో వికటించింది.
హోదాలు : ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు అధికార హోదా ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము తెలంగాణలో తెచ్చుకున్న హోదా.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను సీరియస్ గా చెబితే కామెడీగా వుంటుంది కామెడీగా చెబితే సీరియస్ గా వుంటుంది. (ఇంకా చెప్పాలంటే, హీరోల్లో కమెడియన్నిÑ కమెడియన్లలో హీరోని.)
రెండు: నేను ఏది చెబితే, దానికి భిన్నంగా జనం చేస్తారు. ( తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించండీ` అంటూ జనం దగ్గరకు వెళ్ళాను. ఓడించేశారు. అలాకాకుండా, కాంగ్రెస్‌ను ఓడించండీ` అని వెళ్ళి ఉండాల్సింది. గెలిపించేవారేమో!)
సిధ్ధాంతం : నేనొక్కణ్ణే గాంధీ గారి అన్ని సూత్రాలనూ పాటిస్తాను. కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరున్నారు: వారీ గాంధీ విధానాల్లో ఒకే ఒక్క విధానాన్ని అమలు జరుపుతారు: అదే ‘సహాయ నిరాకణోద్యమం’. నేను పీసీసీ పీఠం ఎక్కానో లేదో, మిగిలిన నేతలందరూ ఈ ఉద్యమాన్నే చేపట్టారు. ఆ రోజుల్లో గాంధీ బ్రిటిష్ వారి మీద ప్రయోగిస్తే, నా తోటి కాంగ్రెస్ నేతలు నా మీదనే ఈ ఉద్యమాన్ని ప్రయోగించారు. ఫలితంగా ఓడింది నేను కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే.
వృత్తి : వ్యాఖ్యలు చేయటమూ, వివాదాలు తెచ్చుకోవటమూ.
హాబీలు :1.కవిత్వం రాస్తాను, కానీ దాన్ని రాజకీయాలకు ఎలా వాడుకోవాలో తెలీదు. (కేసీఆర్ అలా కాదు, రాసింది (ఒక్క పాట మినహా) పెద్ద ఏమీ లేదు. అయినా సాహిత్యాన్ని సైతం రాజకీయం చేసేయగలడు. ఆదికవి నన్నయ కాడనీ, పాల్కురికి సోమనాథుడనీ చెప్పెయ్యగలడు. నేను చెప్పగలనా? తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కాదనీ, సోనియా గాంధీ అనీ తెలిసినా కూడా బలంగా చెప్పలేను. ఎందుకంటే నేను కవిత్వాన్ని కవిత్వంలాగా, రాజకీయాన్ని రాజకీయం లాగా చూస్తాను.
2. ఏ విషయంలో అయినా ముందు వుంటాను. కానీ పిటీ ఏమిటంటే కాంగ్రెస్‌లో ఎవరూ వెనక వుండటానికి సిధ్ధపడరు. అందరూ నా కన్నా ముందుంటారు.
అనుభవం : ‘జల యజ్ఞం’ నేనే దగ్గరుండి చేయించాను. కానీ చుక్క నీరు వృధా కానివ్వలేదు. అంటే అనవసరంగా బీడు పొలాల్లోకి వెళ్ళనివ్వలేదు. టీఆర్‌ఎస్ వారు అర్థం చేసుకోరూ..?
మిత్రులు : మీకు తెలీదా? కాంగ్రెస్ పార్టీలో మిత్రులూ, శత్రువులూ అంటే వేరే ఎవరూ వుండరు. ఉంటే, సమ్మతి వాదులూ, అసమ్మతి వాదులూ వుంటారు. అంతే.
శత్రువులు : చెప్పాను గా వుండరని. కాక పోతే ఒక్కొక్క పోస్టుకీ వంద మంది ఆశావహులుంటారు. ముఖ్యమంత్రి పోస్టు వుండేది` ఒక్కటేనా? అయినా సరే, పొరపాటును కాంగ్రెస్ గెలుస్తుందేమో నన్న అనుమానంతో,ఎవరికి వారు ప్రమాణ స్వీకారోత్సవానికి వేసుకునే దస్తులు కుట్టించేసుకున్నారు. వారిని శత్రువులని నేను అనలేను.
మిత్రశత్రువులు : మీ మీడియా వారే. ఎప్పుడు ఆకాశంలోకి ఎత్తుతారో.. ఎప్పుడు పాతాళంలోకి తోసేస్తారో ఎవరికీ తెలీదు!
వేదాంతం : ఆటకీ, స్టేటుకీ సంబంధం వుండదు. లేకుంటే సానియా మీర్జా, తెలంగాణ అంబాసిడర్ ఎలా అవుతుంది? ఈ ముక్క అన్నందుకు నా మీద విరుచుకు పడుతున్నారు.
జీవిత ధ్యేయం : నాలుగేళ్ళ పది మాసాలు ఆగండి చెబుతాను. ఇప్పుడే చెబితే.. అసలే కాంగ్రెస్. ముందే చెప్పాను కదా! ఆశావహుల బెడద ఎక్కువని. ఇప్పుడు చెబితే, పొడుచుకుని తినేస్తారు.
-సర్