రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటివివాదాలు వచ్చినపుడల్లా కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు కలహించుకోవడం అందరికీ గుర్తు వస్తూనే వుంటుంది. సాధారణ వర్షపాతం పడినపుడు ఏటా కర్ణాటక ప్రభుత్వం 192 టిఎంసిల నీరు వదలాలని కావేరి ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చింది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు ఏం చేయాలో చెప్పలేదు. అనుకున్నదాని కంటె తక్కువ వర్షాలు పడితే తమిళనాడుకి అంత నీరు వదిలితే బెంగుళూరు ప్రజలు దాహంతో అలమటించాలి. మాకు అదేమీ తెలియదు, మీరు నీరు యివ్వకపోతే మా రైతులు మూడు పంటలు వేసుకోలేరు అని వాదిస్తుంది తమిళనాడు ప్రభుత్వం. ''ఈ ట్రైబ్యునల్‌తో పని జరగటం లేదు, అందుకే కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ వేసి వారికే యీ నీటి నిర్వహణ అప్పగించాలి.'' అంటూ జయలలిత సర్కార్ సుప్రీం కోర్టులో అప్లికేషన్‌్ వేసింది. ట్రైబ్యునల్ ఆర్డరును ఛాలెంజ్ చేసిన కేసుతో బాటు దాన్ని విచారిస్తానని కోర్టు అంది. అది కోర్టు పరిశీలనలో వుండగానే రాజకీయంగా దాన్ని సాధిద్దామని జయలలిత ప్రయత్నాలు మొదలుపెట్టింది. జూన్ 13 న 31 పేజీల ఉత్తరం రాసి ప్రధాని మోదీకి స్వయంగా అందచేసింది.
మోదీ ప్రభుత్వం ఎన్నో చట్టాలకు సవరణలు, సంస్కరణలు తలపెట్టింది. కానీ రాజ్యసభలో దానికి కేవలం 42 మంది సభ్యులు మాత్రమే వున్నారు. 10 మంది సభ్యులున్న ఎడిఎంకె కలిసివస్తే వాటిని అమలు చేయవచ్చు. ఈ ట్రంప్ కార్డు చేతిలో పెట్టుకుని జయలలిత ఈ కోరిక కోరారు. అంతా బాగానే వుంది కానీ ఆ ఉత్తరంలో జయలలిత ''మాకు ఎగువ నున్న రాష్ట్రం చెప్పిన మాట వినకుండా ప్రవర్తించే రకం (రికాల్సిట్రాంట్) అని రాయడం కర్ణాటక నాయకులను మండించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిజెపితో సహా రాష్ట్రంలోని పార్టీలన్నిటిని సమావేశ పరచి జయలలిత ప్రతిపాదన వ్యతిరేకిస్తూ మోదీకి ఉత్తరం యిచ్చారు. ''వర్షాలు పడితే ఏడాది పూర్తయ్యేలోగా 192 టిఎంసిలు యిస్తాం. నెలకింత యివ్వాలని పట్టుబడితే మాత్రం అది మా వల్ల కాదు'' అంటోంది కర్ణాటక. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు కేంద్రం చేతిలో వున్నాయి కాబట్టి రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయని మనం గోలపెడుతూ వుంటే జయలలిత కావేరీ బోర్డు కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు? కేంద్రం తను చెప్పిన మాట వింటుందన్న ధైర్యం! రేపు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ఆమె లెక్కలు తారుమారు కావచ్చు కదా!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)