నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందకు తాగా అన్నది సామెత. వైఎస్ ఒక మంచి ఉద్దేశంతో ఫీజుల చెల్లింపు పథకం ప్రవేశ పెడితే బడాబాబులు అంతా దాన్ని తమ జేబులు నింపుకునేందుకు వాడుకున్నారు..దాదాపు ప్రతి ఎమ్మెల్యే ఓ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేసి పబ్బం గడుపుకున్నారు. ఈ పరిస్థితి గమనించే ఇప్పుడు కేసిఆర్ ఇటు వంటి వ్యవహారానికి తెరదించాలని చూస్తున్నారు. కానీ అంతకు ముందు స్థానికత అనే అంశంపై ,ఇరు రాష్ట్రాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. అసలు ఫీజుల చెల్లింపు పథకానికే మంగళం పాడేందుకు ఫాస్ట్ అనే నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ఇలా చెల్లించే ఫీజును విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తామని చెప్పింది. ఇది ఎవరూ కూడా తప్పు పట్టని నిర్ణయం అన్నది వాస్తవం.
కేవలం ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌పైనే మనుగడ సాధిస్తున్న కాలేజీలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో టి సర్కార్ ఈ నిర్ణయనం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.. కళాశాలలకు రాకుండానే ప్రభుత్వం నుంచి ఫీజులు పొందాలనుకునే విద్యార్థులకు చెల్లించకూడదని కమిటీ నిర్ణయించింది. ఇక ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక విధంగా సాధారణ ప్రతిభ చూపే వారికి మరోరకంగా చెల్లింపులుంటాయి. దీనివల్ల విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగే అవకాశముంటుందనేది అక్కడి ప్రభుత్వ ఆలోచన. ఫీజులు కాలేజీ ఖాతాలోగాక విద్యార్థి ఎకౌంట్‌లో జమ చేస్తారు. నిబంధనలు పాటించని కళాశాలలకు దీంతో అడ్డుకట్ట పడే అవకాశముందని సర్కార్ అభిప్రాయపడుతోంది.
ఇదిలావుంటే స్థానికత వ్యవహారం ఎలా వున్నా ఈ ఫీజుల చెల్లింపుపై సీమాంధ్రలో కూడా ఇదే విధానం అమలు చేసే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది. రీయింబర్స్‌మెంట్ విధానంలో పలు అక్రమాలు జరుగుతున్నాయని గతంలో చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. ఆ పథకాన్నే పూర్తిగా ప్రక్షాళన చేయాలని అనేవారు. మరి కెసిఆర్ మాదిరే చంద్రబాబు కూడా ఫాస్ట్ లాంటి ఆలోచనే చేస్తారా లేక ఇంచుమించు ఇలాంటి సవరణలనే అమలు చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఫీజురీయింబర్స్‌మెంట్, 1956 స్థానికత వివాదం, అడ్మిషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు, కేంద్రం వద్దకు చేరాయి. మరి కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆగస్ట్ 4 తర్వాత సుప్రీంకోర్టులో జరిగే వాదోపవాదనలు ఏ మలుపు తిరుగుతాయో పరిశీలించాలి.
బహుశా ఆ తరువాత చంద్రబాబు కూడా ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల చెల్లింపుపై ఓ సమగ్ర విధానాన్ని ఫ్రకటించే అవకాశం వుంది. గతంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రి కాగానే (ఎన్టీఆర్ హయాంలో) తాను లెక్చరర్ ను కాబట్టి, వారి బలాలు, బలహీనతలు తనకు తెలుసు కాబట్టి, వారికి చెక్ చెప్పే పని చేసారు. ఇప్పుడు నారాయణ విద్యాశాఖకు కాకున్నా మంత్రి అయ్యారు. గంటా విద్యశాఖకు మంత్రిగా వున్నారు. ఆయనకు కూడా స్వంత కాలేజీలు రాష్ట్ర్రం బయట వున్నాయని అంటారు.
మొత్తానికి ఆయనకూ ఈ రంగం లోటు పాట్లు తెలుసు. అందుకే ఇద్దరూ కలిసి, ఈ రంగంలో మిగిలిన జనాలకు చెక్ చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వైఎస్ హయాంలో కాలేజీలు పోందిన చాలా మంది కాంగ్రెస్ వారున్నారు. వాళ్లకు కూడా పనిలో పనిగా చెక్ చెప్పినట్లు అవుతుంది. అన్నింటికి మించి రాష్ట్ర పభుత్వంపై ఆర్థిక భారం తగ్గడం అన్నది అంతకన్నా కీలకం. అందువల్ల చంద్రబాబు కూడా త్వరలో ఈ పీజుల చెల్లింపును సమీక్షించడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.
చాణక్య