మండే ఎండల్లో, ఈ వేసవికాలం ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేవి మామిడి పండ్లే. మామిడిని ఇష్టపడని వారుంటారా చెప్పండి. మరీ ముఖ్యంగా రకరకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు తినకుండా ఎవరుంటారు. అత్యథికంగా మామిడిని దిగుబడి చేసే దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. దాదాపు 1500 రకాల మామిడి పండ్లు ఇండియాలో పండుతాయి. ప్రతి రకానిదీ ఒక్కో రుచి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మామిడి దిగుబడి ఎక్కువ. మామిడిపండ్లు మనం ఎంత ఇష్టపడతామో.. అందులో ఉండే అత్యధిక కెలొరీల వల్ల స్థూలకాయం వస్తుందనే వారు కూడా ఉన్నారు. మామిడిలో అధిక స్థాయిలో కేలరీలు ఉంటాయనే మాట నిజమే అయినప్పటికీ ఇందులో ఉండే పోషకాలు, ఖనిజ లవణాల వల్ల ఇది ఆరోగ్యానికి మంచిదే. ఇతర పండ్లతో పోలిస్తే మామిడి పండ్లలో పోషకాల ఎక్కువనే విషయం చాలాచోట్ల ప్రస్తావించారు.
మామిడిలో కెలరీలు అధికమంటే, దానర్థం ఇది అనారోగ్యానికి దారితీస్తుందనా..?
పోషకాహార వైద్యులు డాక్టర్ రూపాలీ దత్తా అభిప్రాయం ప్రకారం.. ''అరటి, పుచ్చకాయ, ద్రాక్షలాంటి పండ్ల రకాలతో పోలిస్తే మామిడి పండ్లలో కేలరీలు అధికమే. అయితే అదే సమయంలో మామిడి పండ్లలో అత్యధిక పోషకాలున్నాయి. అయితే ఆ పోషకాల్ని కేలరీలు కప్పేస్తున్నాయి. మన శరీరానికి అత్యావశ్యకమైన బీటే కెరొటీన్ అనే పోషకం మామిడిలో ఎక్కువ. ఇది యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేసి మనకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది.''
''ఒకపండు ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాన్ని అందులో ఉండే కేలరీల్ని ప్రామాణికంగా తీసుకుని చెబుతారు. మామిడిలో కేలరిఫిక్ వాల్యూ గ్రాముకు 2 కేలరీలుగా ఉంది. అంటే మనం 100 గ్రాముల మామిడి పండ్లు తింటే 2వందల కెలరీల శక్తి అందుతుంది. అంటే 74 కెలరీల 2 అరటిపండ్లను తినడంతో ఇది సమానం. అదే పుచ్చకాయ విషయానికొస్తే, ఇందులో 85శాతం నీరు ఉంటుంది కాబట్టి కెలరీల శాతం ఆటోమేటిగ్గా తగ్గుతుంది. సో.. 100 గ్రామలు పుచ్చకాయలో 30 కెలరీలు మాత్రమే ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు ఉంటాయి. ఇలా చాలా రకాల పండ్లతో పోలిస్తే మామిడిలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, కావాల్సినన్ని పోషకాల్ని ఇది శరీరానికి అందించదని చాలామంది అభిప్రాయపడుతుంటారు'' అని పోషకాహార నిపుణురాలు డాక్టర్ రూపాలీ తెలిపారు.
డీకే పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించిన హీలింగ్ ఫుడ్స్ అనే పుస్తకంలో మామిడి పండుకు విశిష్టమైన లక్షణాలు ఉన్నట్టు పేర్కొన్నారు. మామిడిలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, విటమిన్-సి శరీరానికి ఎంతో మేలుచేస్తుందని.. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటిచూపు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలో కణజాలం ఎక్కువగా నష్టపోకుండా కూడా ఇవి కాపాడతాయి.
మిగతా పండ్లతో పోలిస్తే మామిడిలో పోషకాలు :
1. మామిడిలో సి-విటమిన్ అధికం
పోషకాహార నిపుణురాలు జస్లీన్ కౌర్ (జస్ట్ డైట్ క్లినిక్) అభిప్రాయం ప్రకారం.. '' నారింజతో పోలిస్తే మామిడిలో సి-విటమిన్ ఎక్కువ. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. నారింజలో 70 మిల్లీగ్రాముల సి-విటమిన్ ఉంటే మామిడి పండులో ఏకంగా 122 మిల్లీగ్రాముల సి-విటమిన్ ఉంటుంది. ఇందులో ఉండే జెక్సాంథిన్ అనే ప్రొటీన్ కంటికి మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.''
2. మామిడిలో కావాల్సినంత ఎ-విటమిన్ ఉంది
క్యారెట్‌లోనే ఎ-విటమిన్ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. కానీ మామిడిలో కూడా దాదాపు 35శాతం ఎ-విటమిన్ ఉంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్ ''సెబమ్'' అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసి జుట్టకు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. జుట్టు, చర్మంతో పాటు శరీరంలో ఉన్న చాలా కణజాలాన్ని పరిరక్షించడంలో ఎ-విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది.
3. మామిడిలో పొటాషియం ఎక్కువ
మామిడితో పోలిస్తే అరటి పండులో పొటాషియం ఎక్కువ. మామిడిలో 260 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటే, అరటిపండులో 800 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ విషయంలో అరటిపండు గెలిచినప్పటికీ రోజువారీ మనకు కావాల్సినంత పొటాషియం అందించడానికి మామిడి పండు సరిపోతుంది. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించడంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది.
4. మామిడిలో బి6-విటమిన్ కూడా ఉంది
అవకోడాలో బి6 విటమిన్ ఎక్కువ. మామిడిలో 5శాతం బి-6 విటమిన్ ఉంటే, అవకోడాలో 15శాతం ఉంది. కానీ మామిడిలో ఉన్న బి-6 విటమిన్.. మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు నిద్రా ఆవర్తనాలను, మన మూడ్‌ను ప్రభావితం చేస్తుంది. మామిడి పండ్లు కేన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తాయని జస్లీన్ అంటున్నారు. మామిడిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లతో పాటు ''ఫిస్టన్ అండ్ గాలిక్ యాసిడ్''… బ్రెస్ట్ కేన్సర్‌ను అరికడుతుంది.
సో.. మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే.
మామిడి పండ్లలో కేలరీలు అధికంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ మితంగా తీసుకుంటే ఆరోగ్యమే. రోజుకు 1 లేదా 2 మామిడి పండ్లు తింటే మంచిదే. అంతకంటే ఎక్కువ తింటే మాత్రం స్థూలకాయం, మధుమేహానికి దారితీసే ప్రమాదముంది. షుగర్ ఉన్న వ్యక్తులు డాక్టర్ సలహా మేరకు మామిడిపండ్లు తినడం ఉత్తమం.
-ఎల్.విజయలక్ష్మి