వెనకటికి ఒకడు 'ఎద్దు ఈనిందిరో..' అనంటే, ఏమాత్రం తడుముకోకుండా 'దూడని కట్టెయ్రో..' అని సమాధానమిచ్చాడట. ఎద్దు ఏంటి.? ఈనడమేంటి.? అన్న ఆలోచన ఏమాత్రం రాలేదాయనగారికి.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హైద్రాబాద్‌లో వానలు – వరదలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాగే వున్నాయ్. భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్‌లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నగరం నడిసంద్రమయ్యింది. రోడ్లు.. అంటే ఏమిటి.? అని నగరవాసి ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. కానీ, ఇదంతా బూతద్దంలో చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి గుస్సా అయ్యారు. అంతేనా, అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామంటూ 20 వేల భవనాల లెక్క తేల్చారాయన.
హైద్రాబాద్ వరదలకీ అక్రమ కట్టడాలకీ సంబంధం లేకపోలేదు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా అక్రమ కట్టడాల కూల్చివేత అంశం ఎందుకు తెరపైకి వచ్చినట్లు.? ముందుగా, వరద ముంపు ప్రాంతాల్లో వున్నవారికి సహాయక చర్యలు అందించాలి. వరదల కారణంగా మునిగిపోయిన కాలనీల్లో నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించాలి. రోడ్లను తక్షణం మరమ్మత్తులు చేయాలి. ఇవీ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు.
విశ్వనగరంగా హైద్రాబాద్.. అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేస్తే హైద్రాబాద్ విశ్వనగరమైపోదు. విశ్వనగరం కాదు కదా, మూడేళ్ళ క్రితం భాగ్యనగరం వున్న పరిస్థితులు కూడా లేవిప్పుడు. అంతకన్నా దయనీయంగా తయారయ్యాయి పరిస్థితులు. కేవలం 10 శాతం రోడ్లు మాత్రమే పాడయ్యాయట హైద్రాబాద్‌లో.. కేసీఆర్ సెలవిచ్చారు. ముఖ్యమత్రి కదా, అందునా టీఆర్ఎస్ అధినేత.. కాబట్టి, ఆయన వ్యాఖ్యల్ని ఎవరైనా ఖండిస్తే.. ఖబడ్దార్.!
కానీ, నిజం నిప్పులాంటిది. 10 శాతం రోడ్లు పాడైపోవడం కాదు, 90 శాతం రోడ్లు నాశనమైపోయాయి. అసలు హైద్రాబాద్‌లో రోడ్లు ఎక్కడ మిగిలాయి గనుక.? ఆఖరికి ఫ్లై ఓవర్ల మీద రోడ్లు కూడా నాశనమయ్యాయి. చరిత్రలో ఎక్కడన్నా ఫ్లై ఓవర్ మీద నీళ్ళు నిలవడం చూశామా.? ఇదిగో కేసీఆర్ జమానాలో చూస్తున్నాం.
'మేం అక్రమ కట్టడాల్ని కూల్చేస్తాం.. రాజకీయ నాయకులవి వున్నా.. ఇంకెవరివి వున్నా.. విపక్షాలకు చిత్తశుద్ధి వుంటే కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయకూడదు..' అని కేసీఆర్ సవాల్ విసిరారు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. గతంలో ఓ సారి కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. కొన్ని భవనాల్ని కూల్చేశారు కూడా. ఆ తర్వాత అక్కడితో ఆ కూల్చివేతల ప్రసహనం ముగిసింది. ఎందుకు.? అనడక్కండి. అదంతే.
ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించి మరీ, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చేస్తారు కేసీఆర్. విపక్షాలు రాద్ధాంతం చేశాయని మానేశారా.? మరి, కూల్చివేతలపై విపక్షాలు ప్రశ్నించకూడదని కేసీఆర్ అనడమేంటి కామెడీ కాకపోతే.!
దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్నట్టు.. నగరం నడి సంద్రంగా మారిన నాలుగైదు రోజులకు మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి, నగరవాసికి భరోసా ఇచ్చేలా మాట్లాడలేదు. ఇంకా భయపెట్టేలా మాట్లాడారు. వర్షాలు అప్పుడే తగ్గవు గనుక, ఇప్పట్లో రోడ్లు బాగు చేసే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపేశారు. 20 వేల భవనాల్ని కూల్చేస్తామన్నారు. అందులో ఇప్పుడు మునిగిపోయిన అపార్ట్మెంట్లు వున్నాయా.? ఇంకేమన్నా వున్నాయా.? అన్న భయాందోళనలు మొదలయ్యాయి.
తప్పనిసరైతే ఏ భవనమైనా కూల్చేయాల్సిందే. కానీ, అంతకన్నా ముందు రోడ్లు బాగుపడాలి. ప్రజలకు భరోసా ఇవ్వాలి. ప్చ్.. ఇక్కడా కేసీఆర్, సగటు రాజకీయ నాయకుడిలా మాత్రమే మాట్లాడారు. ముఖ్యమంత్రినన్న బాధ్యతను విస్మరించారు. ఇదా విశ్వనగరంగా మారబోయే హైద్రాబాద్‌పై కేసీఆర్‌కి వున్న చిత్తశుద్ధి.?