ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ హడావుడితో ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడి అక్కౌంట్లు అక్కడ గప్ చుప్ అయిపోతున్నాయట. ఆదాయపన్ను శాఖ బడా బాబులపై కన్నేసిందని వార్తలు గుప్పుమనడంతో, నల్లధనంతోనే ఎక్కువగా లావాదేవీలు నడిచే సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడుతోంది. టాలీవుడ్ బడా హీరోల దగ్గర వున్నంత బ్లాక్ మనీ మరెక్కడా వుండదు.
ఎందుకంటే సగానికి పైగా పారితోషికం బ్లాక్ లోనే తీసుకుంటారని వినికిడి. టాప్ హీరోల పారితోషికం పది కోట్ల నుంచి పాతిక కోట్ల వరకు వుంది. ఇందులో సగానికి పైగా నల్లధనమే అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే బడా నిర్మాతలు ఛాలా మంది వున్నారు. ఇప్పుడు ఆదాయపన్ను శాఖ దాడుల నేపథ్యంలో చాలా మంది తమ తమ ఆఫీసులను మార్చేసారు. అక్కౌంట్స్ ను వేరే చోటకు చేర్చి, పక్కగా చేసుకునే పనిలో పడ్డారు.
ఆదాయపన్ను శాఖ కూడా భలే చిత్రంగా వ్యవహరించింది. పది నుంచి పాతిక కోట్లు తీసుకునే హీరోలను, భారీ సినిమాలు అనేకం తీసే నిర్మాతలను పక్కన పెట్టి, రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యి, ఆర్థికంగా కాస్త దెబ్బతిని వున్న సాయి కొర్రపాటి లాంటి నిర్మాతపై తొలి దాడి చేసింది. అంతే మిగిలిన పెద్ద చేపలన్నీ గప్ చుప్ అయిపోయాయి. ఆ మధ్య ఓ సినిమా 66 కోట్లు, ఈ మధ్య ఇంకో సినిమా 76 కోట్లు, ఓ సంక్రాంతి సినిమా 55 కోట్లు,టాప్ హీరో ఫ్లాప్ సినిమా 70 కోట్లు (బిజినెస్) ఇలా ఎన్ని భారీ సినిమాలు వున్నాయి కళ్లెదుట.
కానీ చిత్రంగా మనమంతా, రాజా చేయి వేస్తే వంటి విఫలయత్నాలు చేసిన నిర్మాత మీద దాడి జరిగింది. ఇప్పుడు టాలీవుఢ్ మొత్తం అక్కౌంట్ల సర్దుబాటు, ఇళ్లలో, కార్యాలయాల్లో లెక్క లేని క్యాష్ లేకుండా చూసుకొవడం, ఇత్యాది వ్యవహారాల్లో బిజీ అయిపోయింది.