యంగ్ హీరో ఉదయ్‌కిరణ్, అర్థాంతరంగా తనువు చాలించాడు. ఏం కష్టమొచ్చిందో, ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 'చిత్రం', 'నువ్వునేను', 'మనసంతా నువ్వే' తదితర చిత్రాలతో ఉదయ్‌కిరణ్, యంగ్ హీరోల రేస్‌లో టాప్ పొజిషన్‌కి చేరుకున్నాడు. కానీ, ఆ తర్వాతే సరైన విజయాలు దక్కలేదు. దాంతో, మానసికంగా కుంగిపోయాడు. అయితే, ప్రాణాలు తీసుకునేంత 'కుంగుబాటు' అతనికి కలగడానికి చాలా చాలా కారణాలున్నాయనే వాదన వుందనుకోండి.. అది వేరే విషయం.
సినీ పరిశ్రమలోనే కాదు, ఆత్మహత్యల గురించి నిత్యం ఎక్కడబడితే అక్కడ వింటూనే వున్నాం. బుల్లితెర నటీనటులు ఇందుకు మినహాయింపేమీ కాదు. తాజాగా, బుల్లితెర నటుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ విస్మయానికి గురిచేసింది. చిత్రంగా, 'గ్లామరస్' ఇండస్ట్రీలో ఈ తరహా ఆత్మహత్యలు అనేక అనుమానాలకు తావిస్తుంటాయి. ఉదయ్కిరణ్ది నిజంగా ఆత్మహత్యేనా.? అన్న అనుమానాలు ఇప్పటికీ విన్పిస్తూనే వున్నాయి.
ఇక, బుల్లితెర నటుడి ఆత్మహత్య విషయానికొస్తే, పలు సీరియల్స్‌లో నటిస్తూ కెరీర్లో బిజీ బిజీగా వున్న ఓ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షూటింగ్లో చాలా సరదాగా వుండడమే కాదు, జీవితం పట్ల ఖచ్చితమైన అవగాహన, ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనే ధైర్యం వున్నవాడంటూ అతని గురించి తోటి నటీనటులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రదీప్, షూటింగ్ ముగిశాక, ఇంటికి వచ్చి, బర్త్ డే వేడుకల్లో పాల్గొని, అందులో తలెత్తిన ఓ చిన్న గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఇప్పటిదాకా విన్పిస్తోన్న వెర్షన్. ఆత్మహత్య చేసుకున్న గదిలో వస్తువులు చిందరవందరగా పడి వుండడం చూస్తే, ఇది ఆత్మహత్యేనా.? కాదా.? అన్న అనుమానాలు కలగడం సహజమే.
బుల్లితెర మీద ఓ వెలుగు వెలుగుతూనే, వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రదీప్ బలవన్మరణానికి పాల్పడటం అటు తెలుగు టీవీ రంగాన్నీ, ఇటు తెలుగు సినీ రంగాన్నీ విస్మయానికి గురిచేసింది. గ్లామరస్ ప్రపంచమే అయినా, ఈ ప్రపంచం వేరు.. ఇందులో వ్యక్తులు పైకి ఎంత ధైర్యంగా కన్పిస్తారో, తెరపై ఎంత గ్లామరస్‌గా వెలిగిపోతారో.. తెరవెనుక వాళ్ళూ సామాన్య మానవులే. వారికీ భావోద్వేగాలుంటాయి.. వారికీ సమస్యలుంటాయి.. ఆ సమస్యలే, ప్రాణాన్ని చాలా చులకనగా మార్చేస్తుంటాయి. ప్రదీప్ విషయంలోనూ జరిగింది అదే.!
ఒక్కటి మాత్రం నిజం. ప్రాణం విలువైనది. ఎంత విలువైనదంటే, ఆర్థిక ఇబ్బందులకన్నా, కుటుంబ సమస్యల కన్నా.. ఇంకా ప్రపంచంలోని చాలా చాలా విషయాలకన్నా కూడా చాలా చాలా చాలా విలువైనది.