ఆ సినిమాలను చూసి ఒక తరం స్ఫూర్తి పొందింది. వాటి ప్రభావం దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా కనిపిస్తోంది. అదీ మణిరత్నం సినిమాల గొప్పదనం. ‘‘ఓకే బంగారం’’ సినిమాకు ముందు కొన్ని సినిమాలతో మణిరత్నం తన అభిమానులను కొంత నిరాశ పరిచిన మాట విషయం నిస్సందేహమైన వాస్తవం. మరి అదే సమయంలో కొంతమంది మణిరత్నం ఏకలవ్య శిష్యులు వచ్చారు. వారు మణిరత్నం సినిమాల స్ఫూర్తితో ఈ తరాన్ని ఎంటర్ టైన్ చేశారు. మణి ప్రత్యక్షంగా కనపడకపోయినా.. ఆయన స్ఫూర్తి మాత్రం మంచి సినిమాలను అందించింది. వందల కోట్ల రూపాయల సినీ వ్యాపారాన్ని చేసింది. ఈ మధ్య కాలంలో మణిరత్నం స్ఫూర్తితో రూపొందిన సినిమాలు రెండున్నాయి. అవే ఒకటి ‘‘దబాంగ్’’ రెండు ‘‘రాజా రాణి’’ ఒకటి బాలీవుడ్ సినిమా, రెండోది తమిళంలో హిట్ అయ్యి తెలుగులోకి డబ్ అయినది.
అసలు దబాంగ్ సినిమాకూ మణిరత్నంకూ ఏ సంబంధమూ కనిపించదు. అయితే కథ జనించడానికి కారణం మణిరత్నమే! ఇది ఎవరో బయటవాళ్లు ఇచ్చే స్టేట్ మెంట్ కాదు. స్వయంగా ఆ సినిమా దర్శకుడు అభినవ్ కశ్యప్ చెప్పే మాట ఇది. దేశవ్యాప్తంగా ‘‘దబాంగ్’’ మానియాలో మునిగితేలుతున్నప్పుడే అభినవ్ ఈ విషయాన్ని చెప్పాడు. దబాంగ్ సినిమా కథను రూపొందించడానికి స్ఫూర్తి మణిరత్నమేనని ఆయన అన్నాడు. ఏ విధంగా అంటే.. మణిరత్నం ‘‘అగ్నినక్షత్రం’’ అనే తమిళ సినిమాను రూపొందించకపోయుంటే తను దబాంగ్‌ను రూపొందించగలిగే వాడనని ఆ దర్శకుడు స్పష్టం చేశాడు. అదెలా అంటే… ‘‘అగ్ని నక్షత్రం’’ సినిమాకూ దబాంగ్‌కు ఎన్నో పోలికలు ఉంటాయి. ఇది పైకి ఏ మాత్రమూ కనిపించని ఒక కాపీ అని కూడా చెప్పాలి!
‘‘అగ్నినక్షత్రం’’ తెలుగులో ఈ సినిమా ‘‘ఘర్షణ’’ పేరుతో విడుదల అయ్యింది. కార్తీక్, ప్రభులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఒక అన్నదమ్ముల కథ. అయితే ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల కథ కాదు.. తండ్రి ఒకడే.. తల్లులే వేరు. ఒకరి ఇంటికి చిన్నిళ్లుగా పేరు, రెండో వాడికేమో అధికారిక గుర్తింపు! ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ యువకులిద్దరి మధ్య జరిగే ‘‘ఘర్షణ’’ను అద్భుతంగా చిత్రకీరించారు మణిరత్నం. దానికి తోడు ఇళయరాజా సంగీతం తోడవ్వడంతో ‘‘అగ్నినక్షత్రం’’ సినిమా ఒక క్లాసిక్‌గా నిలిచింది. ఒక ఎపికల్ మూవీ అనిపించుకొంటుంది. మరి ఆ సినిమా తనపై ఎనలేని ప్రభావం చూపించిందని అంటాడు అభినవ్ కశ్యప్.
మరి ఘర్షణ సినిమాను చూసిన వ్యూతోనే దబాంగ్ పై ఒక లుక్ వేస్తే.. దబాంగ్‌లో కూడా ఇద్దరు అన్నదమ్ములవి ముఖ్య పాత్రలు. వారిద్దరికీ తల్లి ఒకరే.. తండ్రులు మాత్రమే వేరు! ఈ మార్పు చేశాడు. ఇక్కడ కూడా అన్నదమ్ముల మధ్య గొడవే. మణిరత్నం సినిమాలో ఒకటి పోలీసు పాత్ర.. రెండోది ఆకతాయి పాత్ర. దబాంగ్ సినిమాలో కూడా అంతే! పాత్రల ఆటిట్యూడ్ వేరు కానీ… రెండో సినిమాల్లో ఇలాంటి పోలికలుంటాయి. విలన్, కథనాల్లో మాత్రం అభినవ్ చాలా వ్యత్యాసం చూపించాడు. అయితే తను మణిరత్నం సినిమా స్పూర్తితోనే దబాంగ్ కథను తయారు చేశానని స్వయంగా అభినవే ఒప్పేసుకొన్నాడు కాబట్టి.. ఈ విషయంలో మరో వాదనకు అవకాశం లేదు.
2010 సమయంలో దబాంగ్ వచ్చింది. ఆ సమయంలో మణిరత్నం రావణన్ వంటి డిజాస్టర్ పనిలో ఉన్నాడు. మరి ఆయన అప్పటికి ఫామ్ లో లేకపోయినా.. ఆయన పంచిన స్ఫూర్తితో ఒక భారీ సినిమా వచ్చింది. అది అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తోంది. మరి ఇదీ మణిరత్నం కంటెంట్‌కు ఉన్న గొప్పదనం!
తమిళనాడులో మణిరత్నం సినిమాలు ఒక జనరేషన్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. చాలా మంది పిల్లలు ఆ సినిమాలు చూసి సినిమా దర్శకులు అయిపోవాలనే అభిలాషను పెట్టుకొన్నారు. ఆ సినిమాలను చూస్తూనే పెరిగారు. అలాంటివారిలో ఒకడు అట్లీ. మణిరత్నం సినిమాల స్ఫూర్తితోనే దర్శకుడిగా ఎదగాలనే ఆశయాన్ని పెట్టుకొన్నానని అట్లీ చెబుతాడు. విశేషం ఏమిటంటే.. ఇతడు రూపొందించిన సూపర్ హిట్ సినిమాలో కూడా మణిరత్నమే కనిపిస్తారు. ‘‘రాజారాణి’’ యూత్‌తో బాగా కనెక్టివిటీ కలిగిన తమిళ డబ్బింగ్ సినిమా.
మరి ఈ సినిమా మణిరత్నం రూపొందించిన ‘‘మౌనరాగం’’కు ప్యూర్ కాపీ అని చెప్పాలి. రాజారాణిలో మౌనరాగం జాడలు ఎన్నో కనిపిస్తాయి. రాజారాణిలో ఆర్య, జయ్, నయనతార, నజ్రియా రూపంలో నలుగురు పాత్రదధారాలు ఉంటే… ఇదే కథే ‘‘మౌనరాగం’’ సినిమాలో మూడు పాత్రల మధ్య కనిపిస్తుంది. మోహన్, రేవతి, కార్తీక్ లు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘‘మౌనరాగం’’. అప్పటికే ఒక లవ్ స్టోరీ కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడే ఒక హీరో కథే మౌనరాగం. కార్తీక్ ని ప్రేమించి ఉంటుంది రేవతి. అయితే అనుకోని పరిస్థితుల్లో వీళ్ల ప్రేమ కథ ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండానే కార్తీక్ చనిపోతాడు. ఇక ఏం చేయలేని స్థితిలో మోహన్‌ను వివాహం చేసుకొంటుంది రేవతి. అయితే పెళ్లి అయిన తర్వాత కూడా అతడికి దగ్గర కాలేదు. తన పూర్వ ప్రేమకథను అతడికి వివరించి చెప్పి దూరంగా ఉంటుంది. ఆమె ప్రేమ విషయాన్ని పెద్దమనసుతో అర్థం చేసుకొని.. ఆమెను ప్రేమిస్తాడు మోహన్. ఈ ప్రేమతో భర్తగా ఆమె మనసును గెలుస్తాడు. అదీ మణిరత్నం క్లాసిక్ మౌనరాగం సినిమా కథ.
రాజారాణి సినిమా కూడా అచ్చం ఇలాంటి కథే అని వేరే చెప్పనక్కర్లేదు. మౌనరాగం సినిమాకూ.. రాజారాణికి ప్రత్యేకమైన తేడా ఏమిటంటే… ఈ నయా వెర్షన్ లో హీరో, హీరోయిన్లు ఇద్దరికీ పెళ్లికి ముందు వేరే ప్రేమ కథలు ఉంటాయి. నయతార పెళ్లికి ముందు జై ని ప్రేమించి ఉంటుంది.. అతడికి దూరం అయ్యి.. ఆర్యను వివాహం చేసుకొంటుంది. ఇక ఆర్య పాత్ర అంతకు ముందు నజ్రియాను ప్రేమించి.. దూరం అయి ఉంటుంది. ఇలాంటి వారిద్దరూ పెళ్లి చేసుకొని.. తమ తమ ప్రేమకథలను చెప్పుకొని.. చివరకు దగ్గరకావడమే రాజారాణి కథ. సూపర్ హిట్ అయిన ఈ సినిమా వెనుక మౌనరాగం స్ఫూర్తి ఉంది.
ఈ విధంగా మణిరత్నం సినిమాలు మరో రూపంలో వచ్చి పలకరించాయి. గత తరం పాలిట సూపర్ హిట్స్ అయిన సినిమాలు.. ఈ తరాన్ని కూడా అలరించాయి. మరి లెజెండరీ స్థాయి దర్శకుల ప్రభావం అలాగే ఉంటుంది కదా!