అబద్ధాలు బాగా చెప్పేవాళ్లలో, అరచేతిలో స్వర్గం చూపించేవారిలో ముందు వరుసలో ఉండేది ఎవరు? ఇంకెవరు? రాజకీయ నాయకులే. కొంతమందికి కొన్ని మానసికమైన జబ్బులుంటాయి. వారికి మెదడు సరిగా పనిచేయదు. ఇలాంటివారు వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. కంప్యూటర్లో ప్రోగ్రాం చేసి పెట్టినట్లుగా ఎప్పుడూ అదే మాట మాట్లాడుతుంటారు. రాజకీయ నాయకులు కూడా ఇలాంటివారే.
ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు. తమిళనాడులో జల్లికట్టుకు కేంద్రం, సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వగానే కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, పవర్‌స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నడూ లేనంత స్ఫూర్తి కలిగింది. 'వీడేరా పోలీస్' అనే సినిమా టైటిల్ మాదిరిగా 'ఇదిరా పోరాటమంటే' అనుకున్నారు. ఈవిధంగా ప్రత్యేక హోదా కోసం ఏపీలో కూడా పోరాటం జరగాలని ఆకాంక్షించారు. వెంటనే స్ఫూర్తి పొందినవారంతా పోరాటానికి పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోరాటం చేయాలని, ఇందుకు తాము సహకరిస్తామని కేవీపీ బాబుకు బారెడు లేఖ రాశారు. ఇదో రాజకీయం. హోదా కోసం ఏ పార్టీ పోరాడినా మద్దతు ఇస్తామని రఘువీరా రెడ్డి అన్నారు. ఇది అయ్యేది కాదు. అప్పుడప్పుడు సభల్లో మాట్లాడటం, ట్విటర్లో ఏవో కామెంట్లు పోస్టు చేయడం తప్ప జనంలోకి వచ్చి పోరాడాలనే ఆలోచన లేని పవన్ కళ్యాణ్ జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధించాలని పిలుపునిచ్చారు.
జల్లికట్టు ఉద్యమం నుంచి నేర్చుకోవల్సింది ఎంతో ఉందని, కాని మన నాయకుల్లో నిబద్ధత తక్కువని, ఈ ఉద్యమం నుంచి ఎంతవరకు స్ఫూర్తి పొందుతారో సందేహమేనని చెప్పారు పవర్ స్టార్. మిగతావారి సంగతి పక్కన పెడితే అసలు ఈయన ఎంతవరకు స్ఫూర్తి పొందాడు? ఈయనకు ఎంతవరకు నిబద్ధత ఉంది? అనేది ముందుగా వివరిస్తే బాగుంటుంది. సగం సినిమా హీరోగా, సగం రాజకీయ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ జనాలకు 'పిలుపు' ఇవ్వడం కాకుండా ఏదైనా ప్రాక్టికల్‌గా చేస్తే బాగుండేది.
'ప్రత్యేక హోదా కోసం జనసేన మూడంచెలుగా పోరాటం చేస్తుంది' అని ఓ సభలో ఆవేశంగా చెప్పారు. ఇప్పటివరకు అంచెలు లేవు. పోరాటమూ లేదు. తాను సభ పెట్టి మాట్లాడితే ఎంతమంది జనం వస్తారు? తనకు ఎంత ఫాలోయింగ్ ఉంది? అనేది తెలుసుకోవడానికే సభలు పెట్టినట్లుగా కనబడుతోంది. ఆ సభల్లోనూ అస్తవ్యస్తంగా మట్లాడి అపహాస్యం పాలైన పవన్ కళ్యాణ్ ప్రత్యేక తాను ఎందుకు పోరాటం ప్రారంభించడలేదు? ఓ సభలో 'కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వను అని కచ్చితంగా చెప్పలేదు. ఒకవేళ అలా చెబితే అప్పుడు చూద్దాం'…అన్నారు. కేంద్రం కుండ బద్దలుకొట్టినట్లు చెబితే అప్పుడు తాను ఎంటర్ అవుతాననే అర్థంలో మాట్లాడాడు. తానొక్కడినీ ఏమీ చేయలేనన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం కచ్చితంగా చెప్పలేదని పవన్ ఎలా అన్నాడో ఆయనకే తెలియాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ పని చేసి చాలా కాలమైంది.
దాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. ఆ ప్యాకేజీనే పవన్ 'పాచి లడ్డూలు' అన్నాడు. ఇప్పుడేమో పోరాటం చేయాలంటున్నాడు. సరే…ఇదలా ఉంచి అధికార పార్టీ విషయానికొస్తే మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పచ్చి అబద్ధాలేమిటో చూద్దాం. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కాంగ్రెసు నాయకులు, పవన్ అనగానే ఈ మంత్రి 'ప్రత్యేక హోదా ఎలా సాధించాలో చంద్రబాబుకు తెలుసు' అని కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా వచ్చేవరకు కేంద్రం ఇచ్చే సాయాన్ని కాదనలేమని, ప్రత్యేక ఆర్థిక సాయం తీసుకున్నప్పటికీ ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతామని పల్లె చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీపడలేదని, రాజకీయ దురంధరుడైన బాబుకు హోదా ఎలా సాధించాలో తెలుసునని అన్నారు.
'పచ్చ' మంత్రి పల్లె పచ్చి అబద్ధాలు చెప్పినట్లు అర్థమవుతోంది కదా…! ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని స్పష్టంగా ప్రకటించిన కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పేరు పెట్టి ప్రత్యేక ఆర్థిక సాయం చేసింది. చంద్రబాబు దానికి సంతోషంగా అంగీకరించారు. ఇంకా ప్రత్యేక హోదా ఆయన ఎందుకు పోరాటం చేస్తారు? ఎలా సాధిస్తారు? దాని ఛాప్టరే క్లోజ్ అయ్యాక 'పచ్చ' నాయకులు ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? వీరు చెప్పింది నమ్మడానికి జనం పిచ్చోళ్లు కారు. సమయం వస్తే ఏం చేయాలో అదే చేస్తారు.