దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టకముందే ఎన్కౌంటర్ పేరిట హతమార్చారు పోలీసులు. ప్రజల కోణంలో ఇది కరెక్టు. చట్టం, న్యాయ వ్యవస్థ కోణంలో ఇది తప్పు. అలాగే మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాల కోణంలోనూ ఇది చట్టవిరుద్ధం. ప్రస్తుతం ఈ రెండు వాదనల మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్-పిల్) దాఖలైంది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశాడు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారని అందులో పేర్కొన్నాడు. నలుగురు నిందితుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరాడు. ఈ ఎన్‌కౌంటర్‌ను 'ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్' గా పేర్కొన్నాడు.
అంటే పోలీసులు న్యాయ వ్యవస్థకు లోబడి వ్యవహరించకుండా, అందుకు అతీతంగా వ్యవహరించారు. నిందితులను ఇలా చంపేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, నిష్పాక్షిక న్యాయ విచారణ) కి విరుద్ధం. కోర్టులో ఎలాంటి విచారణ జరగకుండానే పోలీసులే వారు నేరం చేశారని భావించి శిక్ష విధించారు. కాబట్టి ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులను, పోలీసులను వెంటనే అరెస్టు చేసి విచారణ జరపాలని ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టును కోరాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్-సిట్) ఏర్పాటు చేయాలన్నాడు. గతంలో ఇలాంటి కేసులను సుప్రీం కోర్టు విచారించింది కాబట్టి ఈ కేసునూ విచారించే అవకాశముంది.
పిల్ విచారణకు స్వీకరిస్తే ఎన్కౌంటరుకు నేతృత్వం వహించిన సజ్జనార్, అందులో పాల్గొన్న పోలీసులు విచారణకు హాజరుకాక తప్పదు. సజ్జనార్ సీనియర్ పోలీసు అధికారి. కాబట్టి ఆయనకు ఈ విషయం తెలియకుండా ఉండదు. ప్రజాగ్రహం కారణంగా తమపై ఒత్తిడి పెరిగిందని, అందుకే ఎన్కౌంటర్ చేశామని వారు లోలోపల సమర్థించుకోవచ్చు. పైకి ఎప్పటిమాదిరిగానే రొటీన్ ఎన్కౌంటర్ కథ వినిపించినా సుప్రీం కోర్టు దాన్ని నమ్మదు. పైగా తెలంగాణ మంత్రులు సీఎం కేసీఆర్ అంగీకారంతోనే ఎన్కౌంటర్ జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎన్కౌంటర్ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పైగా న్యాయ వ్యవస్థలో కేసు విచారణ ఏళ్ల తరబడి సాగుతుంది కాబట్టి ప్రజల ఒత్తిడి మేరకు ఎన్కౌంటర్ చేసినట్లు చెప్పాడు. దేశానికి ఇదొక సందేశం అని కూడా అన్నాడు.
సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోకుండా ఉండదు. కేసుల్లో నిందితులను, దోషులను హింసిస్తే, వేధిస్తే అందుకు కారకులైన పోలీసులకు కఠిన శిక్షలు విధించాలని 1860 నాటి చట్టం చెబుతోంది. న్యాయ వ్యవస్థలో బ్రిటిషు హయాంనాటి చట్టాలు కొన్ని ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. దోషులను హింసిస్తే ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే హత్యలు (ఎన్కౌంటర్లు లేదా మరోవిధంగా) చేసినా శిక్షించే అధికారం కోర్టులకు ఉంది. అన్ని నిజమైన ఎన్కౌంటర్లు కాదు కదా. సాధారణంగా పోలీసులు చెప్పేదేమిటి? వాళ్లు (నిందితులు) మా మీద కాల్పులు జరిపితే లేదా దాడులకు దిగితే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెబుతారు. ఏ ఎన్కౌంటర్ జరిగినా ఇదే కథ వినిపిస్తారు.
ఈ కథలను నమ్మొద్దని సుప్రీం కోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. ఎన్కౌంటర్లపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలంది. అయితే ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా దాఖలయ్యే ప్రతి కేసులో పోలీసులకు శిక్షలు పడుతున్నాయా? అని ప్రశ్నించుకుంటే లేదని సమాధానం వస్తుంది. ఎక్కువ కేసుల్లో న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకొని పోలీసులు తప్పించుకుంటున్నారని సమాచారం. ఛతీస్‌గఢ్‌లో 2012లో జరిగిన ఓ ఎన్‌కౌంటరులో అమాయకులను పోలీసులు చంపారు.దర్యాప్తు కమిటీ ఈ విషయం తేల్చినా ఇప్పటివరకు కోర్టులో విచారణే ప్రారంభం కాలేదు. న్యాయ వ్యవస్థ ఇలా ఉండబట్టే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి ఏపీ విడిపోయిన కొద్దికాలానికే అంటే 2015లో ఏపీలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్న తమిళనాడుకు చెందిన 20 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసు ఏపీ హైకోర్టులో పెండింగులో ఉంది. చట్టాల్లో కఠిన శిక్షలుంటాయి. కాని ఆచరణలో పరిస్థితి ఇలా ఉంటుంది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగితే పోలీసులకు శిక్షలు పడతాయని గట్టిగా చెప్పలేం. బహుశా ఆ ధైర్యంతోనే ఎన్కౌంటర్ చేశారేమో…! ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి తెలిసే ఎన్కౌంటర్ జరిగినా సర్కారు తన బాధ్యతగా సిట్ ఏర్పాటు చేసింది.