తెలుగుదేశం పార్టీని వీడిపోదలచుకున్న వారికి ఇవాళ వల్లభనేని వంశీ ఒక స్ఫూర్తి అని చెప్పాలి. తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అనుకున్న వంశీ.. మునుగుతున్న నావ లాంటి.. తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టారు. ఆయన ప్రస్తుతం శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు.
ఆ రకంగా ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ఢోకా లేకుండా.. వంశీ జాగ్రత్త పడ్డారు. జగన్మోహన రెడ్డితో సన్నిహితంగా మెలగుతున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకుండా.. ఆయన అప్రమత్తంగానే ఉన్నారని చెప్పాలి.
2019 ఎన్నికల తర్వాత.. తెలుగుదేశం పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా మారిపోయింది. జగన్ గెలుస్తాడని వారు తొలినుంచి ఊహించినదే అయినప్పటికీ.. ఈస్థాయి పరాభవం తమకు దక్కుతుందని అంచనా వేయలేకపోయారు.
ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులకు పార్టీ బలం మీద, చంద్రబాబునాయుడు నాయకత్వ సామర్థ్యం, నిర్ణయాల చాణక్యం మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి. భవిష్యత్తు వారికి మరింత భయంగొలిపేలా కనిపించింది. 2024లోగా నారా లోకేష్ సారథ్యం వహించే రోజులొస్తే గనుక.. పార్టీ ఇంకా గందరగోళంగా మారుతుందని భయపడ్డారు.
అలాంటి నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన నాటినుంచి పలువురు నాయకులు పార్టీ ఫిరాయించే ఉద్దేశంతో ఉన్నారు. గతంలో, ‘మీపార్టీనుంచి ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు.. చేర్చుకోవాలా? పేర్లు చెప్పాలా’ అంటూ జగన్మోహన రెడ్డి శాసనసభలోనే ఎద్దేవా చేశారు కూడా.
తెదేపా ఎమ్మెల్యేలు కొందరు జగన్ పంచన చేరడానికి ఉవ్విళ్లూరుతున్న మాట నిజం. స్థానిక సమీకరణాల వలన.. తాము వైకాపాలోకి వళ్లలేం అనుకుంటున్నవారు.. భాజపాలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటివారికి వల విసిర భాజపా కూడా చోద్యం చూస్తోంది.
అయితే ఫిరాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించం అన్న స్పీకరు తమ్మినేని మాటలే వారిని ఆపుతున్నాయి. అలాంటి వారికి వంశీ ఒక మధ్యేమార్గం చూపించాడు. తెదేపాకు రాజీనామా చేయడం. చేరదలచుకున్న పార్టీతో అనుబంధం కొనసాగించడం.
అధికారికంగా పార్టీలో చేరకపోవడం. పదవి కోల్పోకుండా.. శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా కొనసాగడం.. అనేది ఆ అడ్డదారి. ఈ అడ్డదారి స్ఫూర్తిని అందుకుని ఎందరు శాసనసభ్యులు తెదేపాకు గుడ్ బై చెబుతారో కూడా ఈ శాసనసభ సమావేశాలు ముగిసేలోగా కాస్త క్లారిటీ వస్తుంది.