ఇసుక రచ్చ ముగిసింది.. ఆ తర్వాత చాలా అంశాల్ని తెరపైకి తెచ్చి రచ్చ చేయాలనుకున్న టీడీపీ, జనసేన.. ఎంత యాగీ చేసినా ప్రయోజనం లేక చేతులెత్తేశాయి. తాజాగా, ఇప్పుడు 'ఉల్లి' పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు షురూ చేసేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉల్లి ధరలు పెరుగుతున్నాయ్ గనుక.. అసెంబ్లీకి, ఉల్లిపాయల దండలతో వెళ్ళాలనుకోవడమేంటి.? చంద్రబాబు మార్క్ పబ్లిసిటీ స్టంట్లు ఇలానే వుంటాయ్.
ఇక, చంద్రబాబు మెప్పు కోసం సోషల్ మీడియాలో ఉల్లి ధరలపై పవన్ కళ్యాణ్ కూడా సెటైర్లు వేసేశారు. అధికార పార్టీ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమంటూ మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని జత చేశారు పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో. ఉల్లిధరలు ఆకాశాన్నంటిన మాట వాస్తవం. అదే సమయంలో రైతు బజార్లలో ఉల్లి ధరల్ని ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం వుంచిన మాట కూడా వాస్తవం.
రైతులు తక్కువ ధరకు ఉల్లిని అమ్మి, మార్కెట్ ధరలో ఉల్లిని వినియోగదారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తోంటే.. విపక్షాలు ఆందోళన చేయాల్సిందే. కానీ, అక్కడ రైతులే అత్యధిక ధరకు ఉల్లిని విక్రయిస్తున్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో రైతులకు ఉల్లి ధర గిట్టుబాటవుతోంది. ఈ పరిస్థితుల్లో ధరల్ని తగ్గించడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఉల్లి లభ్యత తగ్గడమే సమస్యకు కారణం. ప్రతి యేడాదీ ఏదో ఒక సీజన్‌లో ఉల్లిధర అమాంతం ఆకాశాన్నంటేస్తూనే వస్తోంది. ఈసారి రికార్డు స్థాయిలో పెరిగింది. దేశమంతా ఇదే పరిస్థితి.
ఓ పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఉల్లి ధర దిగి వచ్చే అవకాశాలున్నాయి. ఈలోగా ప్రభుత్వం సామాన్యులకి ఉల్లి కష్టాలు కలగకుండా చర్యలు తీసుకుంటోంది గనుక, చేతనైతే ఆ చర్యల్ని అభినందించాలి.. మరింత మెరుగైన రీతిలో వినియోగదారులకు సబ్సిడీ ఉల్లిని అందించాలని డిమాండ్ చేయాలి. అది మానేసి.. ఉల్లి పేరుతో పొలిటికల్ ఫైట్ చేస్తామంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?