ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి సరిగ్గా నేటికి ఏడాది…
ఉత్త చేతుల్తో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, వెళ్ళిన ఆ నాటి అద్భుత ఘట్టానికి నేటితో ఏడాది…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తొలిసారి అమరావతిలో అడుగు పెట్టి నేటికి ఏడాది…
అదిరిందయ్యా చంద్రం.. ఇన్ని గొప్ప విశేషాలు సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున జరిగినప్పుడు, బీభత్సమైన ఈవెంట్ ఒకటి చేయాలి కదా.? ప్చ్, చెయ్యలేదెందుకట.! అప్పటి ఈవెంట్‌కి చేసిన ఖర్చే తడిసి మోపెడయిపోయింది మరి. చారాణా కోడికి, బారాణా మసాలా.. అన్నట్టుగా కూడా కాదు.. ఉత్త చేతుల్తో ప్రధాని నరేంద్రమోడీ వచ్చిన కార్యక్రమానికి కోట్లు ఖర్చు చేసేసి, చతికిలపడిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ లెక్కన, ఆంధ్రప్రదేశ్‌కి అది చీకటి రోజుగా భావించాలేమో.!
తిరుపతి వెంకన్న సాక్షిగా, నరేంద్రమోడీ ప్రత్యేక హోదా పేరుతో మోసం చేశారు.. విజయదశమి రోజున అమరావతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచించారు.. ఆ మోసానికీ, ఆ వంచనకీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంతపాడుతున్నారు. ఇదీ జరిగిందీ, జరుగుతున్నదీ.!
ఏడాది పూర్తయ్యింది. ఏదీ ఎక్కడ.? అభివృద్ధి ఊసే లేదు. తాత్కాలిక సచివాలయాన్ని చూపిస్తే సరిపోతుందా.? రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయిన దరిమిలా, ఒక్కటంటే ఒక్క అధికారిక భవనం రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించగలరా.? ఛాన్సే లేదు. అందుకే ఆయన మొహం చాటేస్తున్నారు. పోనీ, ఆ తాత్కాలిక సచివాలయంలో అయినా, రాజధాని శంకుస్థాపనకు ఏడాది పూర్తయిన సందర్భంలో చిన్నపాటి కార్యక్రమం కూడా నిర్వహించలేని దయనీయ స్థితి చంద్రబాబుది. మొన్నటికి మొన్న ఆగస్ట్ 15వ తేదీన తాత్కాలిక సచివాలయంపై జాతీయ జెండా ఎగురవేసే దిక్కులేదు మరి.!
త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అమరావతిలో పర్యటిస్తారట.. పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేస్తారట. అవును మరి, అప్పుడు నరేంద్రమోడీ వచ్చి, జనం నోట్లో మట్టి కొట్టారు.. ఇప్పుడు అరుణ్ జైట్లీ వచ్చి, మళ్ళీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టికొడతారు. అంతకు మించి, కొత్తగా ఏమన్నా జరుగుతుందని ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు.