అన్నదాతలో మౌలికంగా ఉండే ఒక లక్షణం పూర్తిగా చచ్చిపోతున్నది. అభివృద్ధి అనే ముసుగులో.. అన్నదాతలు ఏం నేర్చుకుంటున్నారో.. వారి జీవన ప్రస్థానాలు ఎటునుంచి ఎటుకు మళ్లుతున్నాయో.. లాంటి అవగాహన కలుగుతున్నదో.. ఎలాంటి ఎదురుదెబ్బలకు వారు సిద్ధంగా ఉన్నారో ఏమీ అర్థం కావడం లేదు. వ్యవసాయం చేయడం.. భూమి తల్లిని నమ్ముకున్న బతుకుల్లో ఇలాతలంలో హేమం పండించి.. నలుగురికీ ఆకలి తీర్చే కృషిని కొనసాగించడం అనే అన్నదాతల జీవన మంత్రాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సమూలంగా మార్చేస్తున్నది. ఇలాంటి మాటలు- పాలకులకు ప్రగతి నిరోధకమైన మాటలుగా ధ్వనించవచ్చు. వారు ప్రగతి నిచ్చెన మెట్లు ఎక్కుతూ పైకి పోతోంటే.. కాళ్లు పట్టుకుని వెనక్కు లాగే.. వెనుకబాటు తనపు భావజాలం లాగా అనిపించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే.. అన్నదాతల్లో అసలు వ్యవసాయం పట్ల అనురక్తిని సమూలంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం చంపేస్తున్నది అని అనిపిస్తోంది.
రాజధాని ఏర్పాటుకు అమరావతి ప్రాంత పరిధిలోని అత్యంత సస్యశ్యామలమైన సారవంతమైన భూములను రైతులనుంచి దాదాపు బలవంతంగా లాక్కున్నారు. అందుకు ప్రతిగా వారికి కొంత సొమ్ము ముట్టజెప్పి, కొంత స్థలాలు ఇస్తాం అనే ప్రమాణాలు చేశారు. అయితే అమరావతికి భూములిచ్చిన రైతులందరూ ఆ హోదానుంచి పారిశ్రామికవేత్తలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారంటూ.. చంద్రబాబునాయుడు పదేపదే ప్రకటనలు గుప్పించి.. వారిని ఒక మాయాలోకంలో విహరింపజేశారు. అమరావతి నగరం రాగానే.. తామంతా ఇండస్ట్రియలిస్టులు అయిపోయినట్లు, ఇన్నాళ్లు చిన్న పంచె కట్టుకుని.. మడక దున్నుకుంటూ సేద్యం చేసుకున్న తాము.. సూట్లు వేసుకుని ఏసీ గదుల్లోంచి వ్యాపారాలు నడిపిస్తున్నట్లు … బహుశా వారి కళ్లకు 70 ఎంఎంలో సినిమా కనిపించి ఉంటుంది.
దానికి తగ్గట్లుగా రైతులు కొందరిని సింగపూర్ యాత్రకు కూడా తీసుకువెళ్లారు. తీరా సింగపూర్ వెళ్లి వచ్చిన తర్వాత.. ఈ అన్నదాతలు అక్కడి అనుభూతులను ఇక్కడి మీడియాతోనూ పంచుకున్నారు. ఇంతకూ వారేం గమనించారో చెప్పారు. ‘సింగపూర్ నిర్మాణ శైలి అద్భుతం గా ఉంది… టూరిజం ద్వారా సింగపూర్ అభివృద్ధి వేగంగా జరిగింది… ఏపీ కి అలాంటి అభివృద్ధి సాధ్యమే… వ్యర్దాలను శుద్ధిచేసి ఉపయోగించుకోవడం అద్భుతంగా వుంది… సింగపూర్ లో ప్రతి ఒక్కరికి ఉపాధి ప్రభుత్వం కల్పిస్తుంది…’’ వారికి సింగపూర్ యాత్రలో చూపించిన ప్రపంచం మొత్తం ఇదేనన్నమాట. రైతు అనే వ్యక్తి జీవితంలోంచి వ్యవసాయం అనే సహజాతమైన శరీరభాగాన్ని తొలగించేసి.. వ్యాపారం అనే ఆర్టిఫిషియల్ జైపూర్ లెగ్ లాంటి దానిని తగిలించి.. మీ రూపు చాలా అందంగా ఉంది.. ఇక చెలరేగిపొండి… అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లుగా కనిపిస్తోంది.
సింగపూర్ యాత్ర ద్వారా అమరావతి ఎలా ఉండబోతోందో అర్ధం అయింది… అని వెళ్లి వచ్చిన రైతులు అంటున్నారు. పొలాలు కోల్పోయి తెలియని వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతూ ఈ రైతుల జీవితాలు ఎలా మారిపోబోతున్నాయో అని పలువురు ఆందోళన చెందుతున్నారు.