మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ సినీ జీవితంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ‘సైరా’ రూపొందుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు ప్లాన్ చేసిన దాన్ని బట్టి కనీసంగా 200కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏ రకంగా చూసినా సరే.. చిరు జీవితంలో ఇది అతిపెద్ద బడ్జెట్ కింద లెక్క. 150వ చిత్రానికి కూడా భారీ బడ్జెట్ అనే ప్రచారం ముమ్మరంగా సాగింది గానీ.. నిజానికి అయిన ఖర్చు కంటె చెప్పుకున్న ఖర్చు ఎక్కువ అని తర్వాత గుసగుసలు వినిపించాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చారిత్రాత్మకమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథాంశంతో రూపొందుతున్న ‘సైరా’ చిత్రానికి సంబంధించి.. కథ డిమాండ్ ను బట్టే బడ్జెట్ భారీగా అవుతుందని ముందే అనుకున్నారు. అయితే వారి ఊహలకంటె ఎక్కువగా 200కోట్ల వరకు అంచనా వేశారు. ఇప్పుడు ప్రొడక్షన్ పరంగా యూనిట్ మధ్య నడుస్తున్న మీమాంస ఏంటంటే.. ఇంత భారీ బడ్జెట్ భారాన్ని నిర్మాతగా రామ్ చరణ్ ఒక్కడే మోయగలడా? అని ఆలోచిస్తున్నారు. అలాగే.. దాదాపు బాహుబలి రేంజిల్లో నిర్మాణానికి బడ్జెట్ పెట్టేసిన తర్వాత.. అదే రేంజిలో సినిమా కలెక్షన్లు రాబట్టడం సాధ్యమవుతుందా? తేడా కొడుతుందా? అనే భయాలు కూడా వారిలో వ్యాపిస్తున్నాయి.
నిర్మాణ భారం మొత్తం రామ్ చరణ్ ఒక్కడిమీదనే మోపకుండా మరికొందరు బడా నిర్మాతల్ని ఈ ప్రాజెక్టులో కలుపుకోవాలనే ఆలోచన మెగా కాంపౌండ్ లో నడుస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి అగ్రశ్రేణి నిర్మాతలు, తెలుగునుంచి అల్లు అరవింద్ లాంటి వారిని కూడా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసినట్లయితే.. బడ్జెట్ తో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా పంచుకుంటారని.. ప్రాజెక్టు సవ్యంగా సాగుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
బడ్జెట్ కు సంబంధించిన మీమాంసతోనే సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్ విషయంలోనూ ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నడో మెగాస్టార్ పుట్టినరోజు అయిన ఆగస్టు 22న కొబ్బరికాయ కొట్టుకున్న ఈ చిత్రం ఇప్పటిదాకా సవ్యంగా షూటింగ్ పట్టాలెక్కలేదు. నిర్మాణానికి సంబంధించి కొత్త భాగస్వాముల్ని కూడా జత చేసుకున్నాక గానీ.. రెగ్యులర్ వర్క్ మొదలు కాదని తెలుస్తోంది.