అదేదో అక్కడికి అంతా రెడీ అయిపోయింది, అనవసరంగా పవన్ సినిమా వల్ల విడుదల సమ్మర్ కు వెళ్లిపోయింది అనుకుంటున్నారంతా. ఇదంతా రంగస్థలం సినిమా గురించే. ఈ సినిమాను గత ఏడాది నుంచి ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాను 2018సంక్రాంతికి విడుదల అన్నారు. కానీ ఈ లోగా పవన్-త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి డేట్ ప్రకటించడంతో, సమ్మర్ కు వాయిదా వేసారు.
ఇదిలా వుంటే ఇప్పటికిప్పుడు సంక్రాంతి డేట్ వచ్చేసినా కూడా రంగస్థలం సినిమా ఏమీ రెడీ కాలేదని తెలుస్తోంది. ఎందుకుంటే రంగస్థలం టాకీనే ఇంకా కొద్దిగా వుందని వినికిడి. దానికి తోడు పాటల చిత్రీకరణ కాలేదు. దర్శకుడు సుకుమార్ కు ఇష్టమైన అయిటమ్ సాంగ్ సంగతి అలాగే వుంది.
ఇంకా గమ్మత్తు ఏమిటంటే, అసలు రంగస్థలం సినిమాకు సంబంధించి పాటలకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఇంకా ట్యూన్ లు ఇవ్వాల్సి వుందని వినికిడి. ట్యూన్ లు ఇస్తా పాటలు రాయించుకోవాలి. అప్పుడు రికార్డింగ్. ఆపైన పాటల చిత్రీకరణ. ఇంత వుంది వ్యవహారం. ఇంక పోస్ట్ ప్రొడక్షన్ వుండనే వుంటుంది.
అంటే ఒక వేళ అజ్ఞాతవాసి లేకపోయినా, ఇప్పుడున్న ఈ రెండు నెలల టైమ్ సరిపోతుందా అన్నది అనుమానం. బహుశా ఈ సంగతి తెలిసే, హారిక హాసిని యూనిట్ టక్కన సంక్రాంతి డేట్ ను ప్రకటించేసి వుంటుందేమో?