ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఐఫోన్ ఎక్స్ నిన్నట్నుంచి అందుబాటులోకి వచ్చింది. లక్ష రూపాయలకు పైగా ఖరీదు చేసే ఈ ఫోన్ ను దక్కించుకునేందుకు కొన్ని దేశాల్లో (భారత్ లో కాదు) ముందురోజు నుంచే క్యూలు కట్టారు జనాలు. అలా ఐఫోన్ ఎక్స్ ను దక్కించుకున్న కొంతమందికి మాత్రం తొలిరోజు చుక్కలు కనిపించాయి.
ఇంటికెళ్లి ఫోన్ యాక్టివేట్ చేద్దామనుకున్న కొంతమంది యూజర్లకు అది సాధ్యం కాలేదు. ఐఫోన్ ఎక్స్ ను యాక్టివేట్ చేయాలంటే ముందు మనకు వై-ఫై సిగ్నల్ ఉండాలి. అలా వైఫై ఉన్నప్పటికీ ఎక్స్-సిరీస్ కనెక్ట్ కాలేదు. “యాక్టివేషన్ సర్వర్ ఈజ్ టెంపరర్లీ అన్-ఎవైలబుల్” అనే సందేశం చాలామందికి రాగా, ఐట్యూన్స్ కు కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండంటూ మరికొంతమందికి నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో చాలామంది వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగిన ఆనందంలో ఉన్న ఆపిల్ సంస్థ ఈ ఇబ్బందుల్ని పట్టించుకునే స్థితిలో లేదు. దీంతో కొన్ని గంటల పాటు చాలామంది వినియోగదారులు యాక్టివేషన్ సమస్యలు ఎదుర్కొన్నారు. కొత్త ఫోన్లను పక్కనపెట్టి పాతవే వాడుకున్నారు.
అలా దాదాపు 5గంటలు గడిచిన తర్వాత ఈ సమస్యలపై ఆపిల్ కంపెనీ స్పందించింది. కొత్త మోడల్ ను ఎలా యాక్టివేట్ చేయాలో చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. సత్వరం స్పందించేలా ఆన్ లైన్ వేదికలను కూడా ఏర్పాటుచేసింది. అన్ని నెట్ వర్క్ క్యారియర్లను సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ ను రూపొందించకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.