పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు హృదయ విదారకంగా తయారయ్యాయి. భవిష్యత్తు అద్భుతం.. అంటూ ప్రధాని నరేంద్రమోడీ వేదికలెక్కి ప్రసంగాలు ఇస్తున్నారుగానీ, అదే మాట పార్లమెంటు సాక్షిగా చెప్పలేకపోతున్నారు. ఎవరన్నా సరే, పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రశ్నలు లేవనెత్తితే చాలు దేశద్రోహులైపోతున్న దుస్థితి.
నిజానికి పెద్ద నోట్ల రద్దుని దేశంలో ఎవరూ వ్యతిరేకించడంలేదు. ఆ రద్దు ప్రక్రియ అనంతరం చేపట్టాల్సిన చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రజలు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్తున్నారు. ఇదీ అసలు సమస్య. దేశంలోంచి నల్లధనం మటుమాయమైపోవడం మాటేమోగానీ, గడచిన 18 రోజుల్లో ఏకంగా 70 మంది ఊపిరి మాయమైపోయింది. ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా వుంటాయో ఏమో.! దేశం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యరా.? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుండి ప్రధాని నరేంద్రమోడీదాకా అందరి నోటా ఒకటే మాటా, 'స్వైప్' చేసెయ్యండి.. అని. సరదా మాటల్లో అదే 'గీకడం'. చేతిలో క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో వుంటే గీకడం చాలా తేలిక. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఈ గీకడం అంత సేఫ్ కాదు. షాపింగ్ మాల్స్‌లో గీకితేనే, చాలా అనుమానాలు. ఎందుకంటే, అక్కడ స్కిమ్మింగ్ కేటుగాళ్ళుంటారు. అలాంటిది, పూర్తిగా దేశమంతా ఈ గీకడం మీదే ఆధారపడితే ఎలా.?
మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్.. అంటున్నారు.. ఇక్కడా భద్రత గాల్లో దీపమే. ఫిషింగ్ అనీ, ఇంకోటనీ ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రమాదం పొంచి వుంది. విదేశాల్లో ముందు భద్రత, ఆ తర్వాతే ఇలాంటివన్నీ. మన దేశంలో అలా కాదు, భద్రత సంగతి దేవుడెరుగు.. ముందైతే, టెక్నాలజీని వాడేసుకుందామనే పద్ధతి. ఫిష్సింగ్ కేటుగాళ్ళకు, మన దేశమే పెద్ద టార్గెట్. నిత్యం, ఈ తరహా కేసుల్ని మీడియాలో చూస్తూనే వున్నాం. అతి తక్కువ వాడకం వుండే మన దేశంపైనే ఈ గురి ఏంటి.? అని అంతా వాపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాడకం ఎక్కువైతే, ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఊహించుకోవడం కష్టమే.
మన దేశంలో మీడియా చాలా చిత్రమైనది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీని ఆకాశానికెత్తేస్తూనే వుంది. ఆ ఆకాశానికెత్తేసే కథనాలు మెయిన్ పేజీల్లో, పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలు.. అంటే, చావులు, ఆన్‌లైన్ మోసాలు వంటివి లోపలి పేజీల్లో ఎక్కడో, చిన్న చిన్న న్యూస్ ఐటమ్స్‌గా కవర్ చేస్తుండడం ఆశ్చర్యకరమే. దేశంలో ఎవరూ నిజాలు చెప్పలేని దుస్థితిలోకి దేశాన్ని నెట్టేసిన ప్రధాని నరేంద్రమోడీ.. రియల్లీ గ్రేట్.. అనేద్దామా.?