సర్జికల్ స్ట్రైక్స్.. గతంలోనూ జరిగాయిగానీ, ఈ మధ్యనే పాపులర్ అయ్యింది ఈ మాట. భారత సైన్యం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్ చేశాక, అసలు సర్జికల్ స్ట్రైక్ ఏంటి.? అనే విషయమై చాలా చాలా చాలా చర్చే జరిగింది. కానీ, పాకిస్తాన్ సైన్యం అసలు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చెయ్యలేదని చెబుతోంది.
అందుకే, ఇంకోసారి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌కి సమాయత్తమవుతోందట. ఏమో, రేపు తెల్లారే లోపు, ఇంకో సర్జికల్ స్ట్రైక్ జరిగిందంటూ భారత సైన్యం అధికారికంగా ప్రకటన చేస్తుందేమో. ఇటీవల ఇలాగే, ఎవరూ ఊహించని విధంగా సర్జికల్ స్ట్రైక్ జరిపి, తీరిగ్గా అసలు విషయాన్ని ప్రకటించారు. అసలు సర్జికల్ స్ట్రైక్ అంటేనే సీక్రెట్ ఆపరేషన్. శతృవుని చావుదెబ్బ కొట్టడం సర్జికల్ స్ట్రైక్ ఉద్దేశ్యం. శతృవు మింగలేక కక్కలేక గింజుకునేలా చేయడం సర్జికల్ స్ట్రైక్ స్పెషాలిటీ.
దాడి జరిగిందీ, జరగలేదు.. అంటూ పాకిస్తాన్ కిందా మీదా పడ్తోందంటేనే, భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ ఎంత పక్కాగా నిర్వహించిందో అర్థం చేసుకోవచ్చు. 'దమ్ముంటే ఆధారాలు ప్రకటించండి..' అంటూ పాకిస్తాన్ మీడియా సవాల్ విసురుతోంది భారతదేశానికి. సర్జికల్ స్ట్రైక్స్‌కి సంబందించిన ఆధారాలు సైన్యం వద్ద గోప్యంగా వుంటాయి. ఎందుకంటే, అత్యంత వ్యూహాత్మకంగా ఆ దాడులు జరుగుతాయి. వాటి వివరాల్ని వెల్లడించడం దాదాపు అసాధ్యమే.
కానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, 'త్వరలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం.. చూసి ఎంజాయ్ చెయ్యమనండి..' అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా సెటైర్ వేయడం చూస్తోంటే, సర్జికల్ స్ట్రైక్స్‌కి సంబంధించిన చిన్న 'క్లిప్' అయినా త్వరలో విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో. అక్కడ చనిపోయింది తీవ్రవాదులు. ఆ విషయాన్ని పాక్ ఒప్పుకుంటే, అంతర్జాతీయ సమాజంలో, పాకిస్తాన్ స్వయానా తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుందనే విషయం తేటతెల్లమయిపోతుంది. తన పరువు తానే తీసుకున్నట్లవుతుంది. అందుకే, తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనడంలేదు. 9 మంది పాక్ సైనికులు చనిపోయినా, పాక్ నోట 'అబ్బే, సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు' అని బుకాయించడానికి కారణం ఇదే.
నిజానికి, సర్జికల్ స్ట్రైక్స్‌ని పాకిస్తాన్ ఊహించలేదు. తీవ్రవాదంపై భారత సైన్యం విరుచుకుపడుతుందని కలలో కూడా అనుకోలేదు. అదే సమయంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్ పట్ల వ్యతిరేకత వస్తుందని కూడా అంచనా వేయలేకపోయింది. ఇప్పుడిక భారత సైన్యానికి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై ఇంకోసారి స్ట్రైక్ చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. అయినప్పటికీ, పాకిస్తాన్‌తో పొంచి వున్న ప్రమాదం నేపథ్యంలో.. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు.
చివరగా: సర్జికల్ స్ట్రైక్స్‌తో భారత్ – పాక్ మధ్య యుద్ధం తప్పదని అంతా అనుకున్నారు. కానీ, ఆ సర్జికల్ స్ట్రైక్స్‌తో సీన్ మొత్తం మారిపోయింది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రూఫ్ కోసం డిమాండ్ చేయడమంటే, దాన్ని పట్టుకుని అంతర్జాతీయ సమాజంలో మరో రచ్చ చేయడానికే కదా.! సర్జికల్ స్ట్రైక్ జరిగినా, జరగలేదని చెబుతూ అంతర్జాతీయ సమాజం దృష్టిలో కుక్కిన పేనులా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పరిస్థితి నిజానికిప్పుడు చచ్చిన పాము కిందే లెక్క. ఈ పరిస్థితుల్లో ఇంకో సర్జికల్ స్ట్రైక్ అంటే, ఇంకేమన్నా వుందా.?