స్నేహానికి కూడా హద్దులుంటాయి.. అన్నింటినీ పంచుకోగల స్నేహం కొన్నింటిని పంచుకోనివ్వదు. ప్రధానంగా ‘‘పేరు ప్రఖ్యాతులను’’. అవసరానికి తగిన డబ్బునో, చేతిలో ఉన్న వస్తువులనో పంచుకున్నంత సులభం కాదు ప్రతిష్టను పంచుకోవడం అంటే! బహుశా అందుకేనేమో వాళ్లిద్దరి పేర్లూ కలిసిపోయాయి… విడదీయడానికి సాధ్యం కానంతగా మిళితమయ్యాయి. అసలు ఆ పేరులో ఇద్దరున్నది గ్రహించడం కూడా కష్టం. ఆ ద్వయమే ‘‘సిద్ధిక్లాల్’’. మలయాళీ దర్శకులే కానీ.. వీళ్లిద్దరి సజనా తెలుగులో సూపర్ హిట్! వీళ్ల సబ్జెక్టుల మన దగ్గర కల్ట్ హిట్స్‌గా, క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.
కేరళలో కళాకారులకు పురిటి గడ్డ ‘కళాభవన్’. ఒక మిమిక్రీ ట్రూప్‌గా మొదలైన దీని ప్రస్థానం తదనంతర కాలంలో నాటకం, సినీ సంబంధ కళలన్నింటికీ శిక్షణా గహంగాగా మారింది. ఈ హౌస్ ఆఫ్ ఆర్ట్స్‌లో ట్రైనప్ అయిన ఎంతోమంది తదనంతర కాలంలో తమకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నారు. కేవలం మలయాళానికే పరిమితం కాదు వీరి ప్రభ. దక్షిణాది భాషలంతా వీరు గుర్తింపు సంపాదించుకున్నారు. ఎక్కడకు వెళ్లినా తమ మూలాలు తాము మరవకుండా ఉండటానికి, తాము ఎక్కడి నుంచి వచ్చామో ఇట్టే అర్థం అయ్యేలా చేయడానికి వీళ్లు తమ పేర్ల ముందు ‘‘కళాభవన్’’ ట్యాగ్ తగిలించుకోవడం కనిపిస్తుంది. అందరూ కాదు కానీ, తమకు శిక్షణను ఇచ్చిన ఈ సెంటర్ పేరును ట్యాగ్ చేసుకుంటారు. ‘కళాభవన్’ మణి ఈ సంతతే. మణిలా ఆ ఆర్ట్స్ ఆఫ్ హౌస్ పేరును తగిలించుకోలేదు కానీ.. సిద్ధిక్, లాల్లు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్లే. కళాభవన్ మెరిట్ లిస్టులో తొలి స్థానాల్లో ఉండే సజనకారులు వీళ్లిద్దరూ!
ఒకరిది కథ, మరొకరిది స్క్రీన్ ప్లే.. ఇద్దరిలో ఎవరో ఒకరు అదనంగా మాటలు రాసే బాధ్యత తీసుకుంటారు.. ఇక దర్శకత్వం మాత్రం ఇద్దరూ దగ్గరుండి చేసే పని. బాల్యం నుంచి స్నేహితులు. ఇద్దరి అభిరుచీ ఒక్కటే. అదే మిమిక్రీ! హాస్యాన్ని పడించడానికి ఒక అద్భుత మార్గమనుకున్నారు కానీ.. అంతటితో ఆగిపోలేదు! కామెడీ జోనర్లో వీళ్ల క్రియేటివిటి ఇండియానే ఊపేసింది! కేరళతో మొదలై బాలీవుడ్ రికార్డులను కూడా చెల్లా చెదురుచేసింది. ‘‘హేరాఫెరీ’’ గత దశాబ్దం ఆరంభంలో బాలీవుడ్లో వసూళ్ల రికార్డు సష్టించి.. 2000 వరకూ వసూళ్ల విషయంలో ఉన్న పాత రికార్డులన్నింటినీ చెరిపేసి.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రం.
కామెడీ సినిమాలు హిట్ అవుతాయి కానీ.. మరీ అంత హిట్ అవుతాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదంత వరకూ. ఆ సినిమాకు దర్శకుడు ప్రియదర్శన్ అయినా.. ఈ సంచలనానికి మూలం మాత్రం మలయాళంలో ఉంది. దాని సష్టించింది సిద్ధిక్ లాల్లే. ఒక అమెరికన్ టీవీ సీరిస్ ఆధారంగా ఈ ద్వయం రూపొందించిన ‘‘రామ్ జీ రావ్ స్పీకింగ్’’ ఆధారంగానే హిందీలో ‘‘హేరాఫెరీ’’ రూపొందించారు. అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, పరేష్ రావల్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో దాన్ని ‘ధనలక్ష్మీ ఐలవ్యూ’ పేరుతో రీమేక్ చేశారు.
‘మధురానగరిలో..’ తెలుగులో 90లలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా. దీని మూలాన్ని తీసిన వారు కూడా దర్శకద్వయమే. మళయాళంలో ‘ఇన్ హరిహర నగర్’ పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యి ఎక్కడిక్కడ సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమిటంటే.. హిందీలో దీన్ని రెండుసార్లు రీమేక్ చేశారు. 1991లో మళయాళంలో వచ్చిన ఈ సినిమాను 92లో బాపయ్య దర్శకత్వంలో రీమేక్ చేయగా.. ఇదే సబ్జెక్ట్‌ను 2007లో ధోల్ పేరుతో ప్రియదర్శన్ మళ్లీ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అదీ ఈ సబ్జెక్టుకు ఉన్న సత్తా!
జగపతి బాబు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ‘పెద్దరికం’ దీన్ని తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్లాసిక్ అనాలి. దీనికి మూలం’ గాడ్ ఫాదర్’ అనే మళయాళ సినిమా. సిద్ధిక్ లాల్లు రూపొందించిన ఆ సినిమా ఆధారంగానే తెలుగులో పెద్దరికం తీశారు. 1995లో వచ్చిన మన్నర్ మథాయ్ స్పీకింగ్ వీళ్లిద్దరి దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సినిమా. ఇది కూడా అక్కడ సూపర్ హిట్టే. హిచ్ కాక్ సినిమా ‘‘వర్టిగో’’ ప్రభావంతో రూపొందించిన ఈ సినిమా తదనంతర కాలంలో హిందీలో ‘భాగమ్ భాగ్’’గా తెలుగులో ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’’గా రీమేక్ అయ్యింది.
కేవలం దర్శకులుగా విడిపోయి.. ఎవరి కెరీర్లు వారి చూసుకోవడంతోనే వీరి కాంబోకు తెరపడలేదు. ఆ తర్వాత కూడా ఇది కొనసాగింది, కొనసాగుతోంది. విడిపడ్డాకా సిద్ధిక్ దర్శకత్వం మీదే దష్టి పెట్టాడు. లాల్ మాత్రం నిర్మాణం చేపట్టడంతో పాటు నటుడిగా కూడా రాణించాడు. అడపాదడపా రచన, దర్శకత్వ బాధ్యతల్లో బిజీగా ఉన్నాడు. సిద్ధిక్ సోలోగా దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు లాల్. ఇలాంటి వాటిలో ఒకటి ‘హిట్లర్’.
మలయాలంలో మమ్ముట్టీ హీరోగా రూపొందిన ఈ సినిమా సౌత్‌లో అన్ని భాషల్లోనూ రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. తెలుగులో మెగాస్టార్ హీరోగా, తమిళంలో సత్యరాజ్, కన్నడలో విష్ణువర్ధన్‌లు ఈ సినిమాను రీమేక్ చేశారు. హిందీలో సునీల్ షెట్టి ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాను రక్తి కట్టించాడు. ఈ విధంగా కూడా ఈ కాంబో దిగ్విజయ యాత్ర కొనసాగింది. లాల్ నిర్మాతగా సిద్ధిక్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ‘‘ఫ్రెండ్స్’’ ఇదే తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’’గా రూపొందింది.
సిద్దిక్ సోలోగా దర్వకత్వం వహిస్తూ విజయబావుటా ఎగరేసుకుంటూ వెళ్లాడు. దాదాపు వందశాతం హిట్ పర్సేంటేజీ ఉన్న దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. ఎప్పుడో 86లో దర్శకత్వం మొదలు పెట్టి.. ఇప్పటికీ హిందీ ‘బాడీగార్డ్’తో వందకోట్ల మార్కును రీచ్ అయ్యి.. ముప్పై ఏళ్ల కెరీర్‌తోనూ యువతరానికి పోటీ పడుతున్నాడితను. ఇక లాల్ నటుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకొంటూ వస్తున్నాడు. పందెంకోడి, అన్నవరం వంటి సినిమాలతో తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యాడితను.
ఈ నేపథ్యంలో ఈ కాంబో మల్లీ రిపీట్ అయ్యింది. గత ఏడాది మలయాళంలో వచ్చిన ‘కింగ్ లయర్’కు లాల్, సిద్ధిక్లు కలిసి పని చేశారు. లాల్ సోలోగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సిద్ధిక్ రచనా బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చూశాడు.
వీళ్ల కాంబినేషన్ మలయాళంలో ఒక జనరేషన్లో సినిమాలు తీస్తే.. పదిపదిహేనేళ్ల తర్వాత మరో భాషలో రీమేక్ అయ్యి ఆ సినిమాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ విధంగా తమ సజనతో వీళ్ల సర్వకాలసర్వావస్థల్లోనూ సత్తా చాటినట్టే. కాబట్టి ముందు ముందు కూడా ఈ కాంబో మ్యాజిక్‌లు రిపీటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.