‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?

రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలా పొంతన ఉంటే పాలకులు తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నట్లు అవుతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకోవడమంటే తమకు తామే భస్మమైపోవడమని, తమ కొంప…

రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలా పొంతన ఉంటే పాలకులు తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నట్లు అవుతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకోవడమంటే తమకు తామే భస్మమైపోవడమని, తమ కొంప తామే కూల్చుకోవడమని అర్థం.

పాలకులు ఎవరూ కూడా తెలిసితెలిసి కొంప కూల్చుకోరు కదా. కాబట్టి తెలివైన పనేమిటంటే చూసీచూడనట్లు పోవడమే. చెప్పినదంతా చేయలేమని పాలకులకు తెలుసు. అయినప్పటికీ అబద్ధాలాడుతూనే ఉంటారు. ఒక్కోసారి మౌనంగా ఉండిపోతారు.

'నేరం చేసినవారు ఎంత పెద్దవారైనా సరే వదిలేది లేదు. జైలుకు పంపుతాం'..అని హూంకరిస్తారు. పిచ్చి జనం నేరగాళ్లు జైలుకు పోతారని ఎదురుచూస్తుంటారు. వారు అలా ఎదురు చూస్తుండగానే ఆ కేసును నీరుగార్చేస్తారు. కొంతకాలం తరువాత అందరూ మర్చిపోతారు. ఇలా మర్చిపోయే జాబితాలో తాజాగా ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరారు. ఈయన కేసు తెలిసిందే కదా. ఒకప్పుడు ఈయన ఎండీగా ఉన్న కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగ్గొట్టింది. 

దీంతో గంటా శ్రీనివాసరావు ఆస్తులతోపాటు ఆ కంపెనీలోని మరికొందరి ఆస్తులను బ్యాంకు జప్తు చేసింది. గంటా ఇళ్లను కూడా బ్యాంకు స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి రుణాలు ఎగ్గొట్టడం అనేది పెద్ద అవినీతి. అందులోనూ వందల కోట్ల రుణాలంటే మాటలా? టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఇదే పని చేశారు. అందులోనూ ఆయన విదేశీ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఇదీ కోట్లాది రూపాయల రుణమే.

పొద్దున్న లేస్తే తాను నీతిపరుడినని, నిప్పులాంటి మనిషినని, అవినీతిని సహించనను ఉపన్యాసాలు దంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు సుజనా చౌదరి విషయంలో, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలోనూ మౌనంగా ఉండిపోయారు.

లంచం తీసుకోవడం ఒక్కటే అవినీతి కిందకు వస్తుందని ఆయన అనుకుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఉండదు. 'మంత్రులు రుణాలు ఎగవేశారు' అని బ్యాంకులు ప్రకటించాయంటే అంతకంటే తలవంపులు ఉంటాయా? ఇది ప్రభుత్వ ఇమేజ్‌కు, టీడీపీ పరువు ప్రతిష్టలకు భంగం కాదా? ఈ ప్రశ్నలే ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ప్రజలూ అడుగుతున్నారు. 

ప్రజలు, ప్రతిపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా చంద్రబాబు పట్టించుకోరు. మంత్రుల మీద యాక్షన్‌ తీసుకుంటే వారి నుంచి రియాక్షన్‌ వస్తుందని చంద్రబాబు భయం. అందుకే ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఈ చెవి నుంచి ఆ చెవి నుంచి వదిలేస్తున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు విషయంలో మౌనంగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన సామాజిక వర్గం. అంటే కులం. 'కాపు' సామాజిక వర్గానికి చెందిన గంటాపై ఎలాంటి చర్య తీసుకున్నా అది బాబుకు ప్రతికూలంగా మారే ప్రమాదముంది.

ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే కదా. ముద్రగడ ముఖ్యమంత్రికి కంట్లో నలుసులా, పక్కలో బల్లెంటా మారాడు. ఇప్పుడు గంటాపై ఏదైనా మాట్లాడినా, చర్య తీసుకున్నా మొత్తం కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. కాపులను వేధిస్తున్నారని, అణగదొక్కుతున్నారని ప్రచారం సాగుతుంది. పార్టీకి కాపు సామాజికవర్గం మద్దతు ఉండదనే భయం కలుగుతోంది. గంటా రుణాలు ఎగవేసినా, ఆయన ఆస్తులు బ్యాంకు స్వాధీనం చేసుకున్నా ఆయన బలమైన పలుకుబడి ఉన్న నాయకుడనేది కాదనలేం. రాజకీయాల్లోకి రాకముందుకు గంటా విజయవంతమైన వ్యాపారవేత్త.

కాని రాజకీయాల్లోకి వచ్చాక తన ప్రత్యూష కంపెనీని సరిగా పట్టించుకోకపోవడంతో అది నిండా అప్పుల్లో మునిగిపోయింది. చివరకు గంటా రుణం ఎగవేతదారుగా ముద్ర వేయించుకున్నారు. కాని ఆయన అంగీకరించడంలేదు. తాను రుణాలకు హామీదారుగా ఉన్నానని, తన సహచరులు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు తనను కూడా బాధ్యుడిని చేసిందని చెప్పుకుంటున్నారు.

గంటా తీగను కదలిస్తే కులం డొంక కదులుతుంది. వాస్తవానికి చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావుపై సదభిప్రాయం లేదు. ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన వ్యవహారశైలిపై అసహనంగా ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో గంటాకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో గంటా ప్రజారాజ్యం తరపునే పోటీ చేసి గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెసులో విలీనమైన తరువాత టీడీపీలో చేరారు. అయినప్పటికీ చిరుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇది బాబుకు నచ్చడంలేదు. అయినప్పటికీ గంటా కాపు సామాజికవర్గం నేత కావడంతో బాబు ఏం చేయలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.