– పవన్ కళ్యాణ్ అభిమాన కవి గురించి ప్రఖ్యాత రచయిత ముళ్లపూడి వెంకట రమణ గారు తన ఆత్మకథ ‘‘కోతికొమ్మచ్చి’’ లో రాసిన ఒక ఉదంతం.
‘‘నన్నూ, బాపునీ ఏలూరులో గుప్తా ఫౌండేషన్ వారు సత్కరించినపుడు శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారిని కూడా సత్కరించారు. ఆ క్రితం రాత్రి ఆయన, రాణి ఇందిరా ధనరాజ్‌గిరి కూడా హైదరాబాదు నుంచి ఏలూరు వచ్చారు. ఆ రైలు అర్ధరాత్రి స్టేషనుకు చేరిందట. ప్లాట్‌ఫాం పొడుగూనా నేలమీద పడుకుని నిద్రపోతున్న పేదవాళ్లని చూశారు. వారంతా ఆ డిసెంబరు మంచులో చలికి గజగజలాడటం చూసి ‘విచలితుడనైపోయాను.’ అని ఆ సభావేదికపై చెప్పారు శర్మగారు.
‘‘ఆ రాత్రి తెల్లవార్లూ ఆ పేదవారి దురవస్థను తలుస్తూ స్కాచ్ విస్కీ సిప్ చేస్తూ అలాగే రూములో కూర్చుండిపోయాను. ఇందుకు నా భార్య ఇందిరాదేవియే సాక్షి’’ అని కూడా ప్రకటించారు. ఇందిరాదేవిగారు కూడా సానుభూతితో తలపంకించారు. సభ అంతా చప్పట్లతో హర్షధ్వానాలతో మారుమోగిపోయింది.
ఇందిరా, శర్మగారలతో నాకు కొద్దిపాటి స్నేహం, కాస్త చనువూ వుండేవి. ముత్యాలముగ్గు చిత్రం వారి సహకారంతోనే వారి ధన్‌బాగ్ పాలెస్‌లోనే తీశాం. ఆయన ‘‘ముత్యాలముగ్గు’’లో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.’ అనే పాట రాశారు. ఆయన రాసిన సినిమా పాట అదొక్కటే.
సభలో శర్మగారి పక్కనే వున్న నేను సహృదయంతో సవినయంగా ఒక సూచన చేశాను. ‘‘మీరు పేదల చలికి చలించిపోయారు కాబట్టి, ఇప్పుడే యీ సభలోనే గుప్తా గారిచ్చే యాభైవేలతో లక్ష దుప్పట్లు కొని ఏలూరు నుంచి హైద్రాబాదు దాకా పంచవచ్చుగదా’’ అని గొణిగాను.
శర్మగారు గాఢంగా ఊపిరి పీల్చి ‘‘నీ పేరు వెంకటరమణ కాదు- మర్కట రమణ’’ అన్నారు గుసగుసగా.
మద్యకవితలు కొత్తేమీ కాదు. ధన్‌బాగ్ పాలెస్‌లో – గాలికి తలలూపే పెద్దపెద్ద చెట్లను చూస్తూ పేదల బాధలను తలపోస్తూ పద్యాలు చెబుతూంటే – శ్రీశ్రీ కూడా మెచ్చుకున్నారు.
‘శేషేన్ – నీ కవిత చూసేన్
నీ పద్యం – ఫ్రెంచి మద్యం’ అన్నారు.’’