ఓ వైపు “మా” లొల్లి వాడివేడిగా జరుగుతోంది. ఆ గొడవల్లో ఉన్న జనాలు అందులో బిజీగా ఉన్నారు. మరోవైపు వాటికి దూరంగా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ పని తాము చేసుకుంటున్నారు. వీళ్లు ఎప్పుడూ అందులో కలుగజేసుకోలేదు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. తారక్ పేరు ఇలా తెరపైకి రావడం, అప్పుడే ఆ పేరు చుట్టూ మీడియా హడావుడి స్టార్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.
మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతిస్తున్న నరేష్ పై ఆరోపణలు చేస్తూ ఎన్టీఆర్ పేరు లేవనెత్తారు జీవిత రాజశేఖర్. ఈ క్రమంలో.. ఎన్నికలతో అస్సలు సంబంధం లేని ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. ఈ మధ్య ఎక్కడో ఎన్టీఆర్ కలిస్తే ఓటు వేస్తున్నావా తారక్ అని అడిగారంట జీవిత. దానికి తారక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఓటు వేయమని తనను అడగొద్దని, ఓటింగ్ కు తాను రానని, ప్రస్తుతం అసోసియేషన్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే చాలా బాధగా ఉందని తారక్, జీవితతో అన్నారట. దీంతో ఇప్పుడు మీడియా ఛానెల్స్ అన్నీ తారక్ పై పడ్డాయి. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఓటు వేయనని చెప్పడం ఏంటంటూ కథనాలు, విశ్లేషణలు, డిబేట్లు మొదలయ్యాయి.
దీనికి మరింత ఆజ్యం పోస్తూ, ప్రకాష్ రాజ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఎన్టీఆర్ అలా ఓటు వేయను అని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు ప్రకాష్ రాజ్. “ఎన్టీఆర్ కు నేను ఫోన్ చేసి అడుగుతాను. అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు బంగారం అని చెబుతాను. వచ్చి ఓటు వేయమని కోరుతాను. నచ్చిన వాళ్లకు ఓటు వేయమని అడుగుతాను.” అన్నారు.
జీవిత ఏదో పొరపాటున ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారని, ఆమె కావాలని అలా చేయరని అన్నాడు ప్రకాష్ రాజ్. మొత్తమ్మీద ఎన్టీఆర్ పేరు మాత్రం మీడియాలో మారుమోగిపోతోంది.