మన ప్రమేయం లేకుండా జరిగే తప్పుల్ని పొరపాట్లని అంటారు. అదే తెలిసి చేస్తే, దాన్నే తప్పు అని పిలుస్తారు. తెలియక తప్పులు దొర్లితే అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న సూక్ష్మాన్నికూడా ఏపీ ప్రభుత్వం గ్రహించడం లేదు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే పనిగా పెట్టుకున్నారని, అలాంటి వాటికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే స్పృహ ప్రభుత్వంలో కొరవడిందనే విమర్శలున్నాయి.
ఒక వైపు న్యాయస్థానాల్లో ప్రతికూల తీర్పులు వస్తున్నా, మళ్లీ అదే తప్పును పదేపదే ప్రభుత్వం చేస్తుండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేయకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం వల్ల ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు.
కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రంగుల విషయంలో సుదీర్ఘ పోరాటానికి దిగింది. చివరికి న్యాయస్థానంలో మొట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది. తాజాగా ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయమని కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసే వరకూ తెచ్చుకుంది.
అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది ప్రమాణపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.