కరోనా మహమ్మారి నుంచి ప్రమాదం ముగిసిపోలేదని, ప్రపంచమంతా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఇప్పటికే కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లతో ప్రపంచ మానవాళి అంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా అనే పేరు వింటే చాలు గజగజ వణికిపోయేంతగా… ఆ మహమ్మారి పంజా విసిరింది.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై తాజా హెచ్చరిక పిడుగుపాటైంది. కరోనా వల్ల ప్రమాదం పొంచి వుందని చెప్పడంతో పాటు గణాంకాలను కూడా వివరిస్తోంది. ఈ సందర్భంగా గత వారం ప్రపంచ వ్యాప్తంగా 31 లక్షల మంది కరోనాబారిన పడగా, 54 వేల మంది మరణించిన షాకింగ్ న్యూస్ చెప్పింది.
కొన్ని దేశాల్లో కరోనా బారిన పడుతూ ఆస్పత్రులపాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ జనం అజాగ్రత్తగా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక మన దేశం విషయానికి వస్తే మంగళవారం 18,346 మంది కరోనా బారిన పడినట్టు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 278 మంది మృతి చెందారు.